
ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలి
అలంపూర్: సాగుభూములను ప్రమాదకరంగా మార్చే ఇథనాల్ ప్యాక్టరీ అనుమతులను రద్దు చేయాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి కోరారు. హైదరాబాద్‌లోని శాసన మండలిలో సమావేశాల్లో ఎమ్మెల్సీ పలు సమస్యలను బుధవారం ప్రస్తావించారు. అలంపూర్ నియోజకవర్గంలో ప్రజలు వ్యవసాయ ఆధారిత జీవనం సాగిస్తున్నారని వివరించారు. రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామం వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. పంట పొలాలకు ప్రమాదకరంగా మార్చే ఈ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని, ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. మా ప్రాంతంలో వ్యవసాయ భూములకు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉన్న ఫ్యాక్టరీలు కొనసాగుతున్నట్లు తెలిపారు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీతో 12 గ్రామాల రైతులు, ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా రైతులు, ప్రజలు పోరాటం చేస్తున్నారని, పంట పొలాలను, భూగర్భ జలాలను కలుషితం చేసే ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు. గ్రామాల సర్పంచ్‌ల పాలన ముగిసి ఏడాది కావస్తుండటంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు. త్వరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలకు రాష్ట్రంతోపాటు కేంద్ర నిధులు వస్తాయని విజ్ఞప్తి చేశారు. మున్సిపాలిటీల్లో పన్నుల భారం తగ్గించాలని కోరారు. మున్సిపాలిటీలకు కొత్త పాలక వర్గం వచ్చేలోపు పెండింగ్ బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. 5 కి.మీ, 8 కి.మీ దూరంలో ఉన్న గ్రామాలను మున్సిపాలిటిల్లో కలిపారని పేర్కొన్నారు. ఇకనైనా వాటిని విడదీసి పంచాయతీలుగా మార్చాని విజ్ఞప్తి చేశారు.