ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలి
గద్వాల క్రైం: సమస్యలపై వచ్చే బాధితుల పట్ల సిబ్బంది స్నేహ పూర్వకంగా ఉండాలని, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం ఆయనతోపాటు డీఎస్పీ మొగిలయ్య పట్టణ పోలీసు స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పట్టణంలోని వివిధ కాలనీలో నిత్యం గస్తీ, పెట్రోలిం నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాలు, సైబర్ క్రైం, మహిళల వేధింపులు, అత్యాచార యత్నం, మిస్సింగ్ కేసులలో ప్రత్యేక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలన్నారు. శివారు ప్రాంతాల్లో నిత్యం వాహనాల తనిఖీతో పాటు డ్రంకెన్ డ్రైవ్ చేపట్టాలని, స్టేషన్ పరిశరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం నమోదైన కేసుల వివరాలను తెలుసుకున్నారు. కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేసి నేరస్తులకు శిక్షపడేలా చూడాలని, డయల్ 100 కాల్స్ విషయంలో త్వరగా స్పందించాలని, బాధితులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన శాఖ పరమైన చర్యలు తప్పవన్నారు. సీఐ శ్రీను, ఎస్‌ఐ కల్యాణ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
నేడు ఉల్లి
బహిరంగ వేలం
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి బహిరంగ వేలం నిర్వహిస్తారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డుకు వరుసగా సెలవులు రావడం వల్ల శనివారం నుంచి మంగళవారం వరకు లావాదేవీలు జరగలేదు. తిరిగి బుధవారం మార్కెట్‌లో లావాదేవీలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ఉల్లి వేలం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ధాన్యం టెండర్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.


