
జోరుగా మెడికల్ దందా!
వైద్యుల చీటీ లేకుండానే మాత్రల విక్రయాలు
రెండేళ్లుగా తనిఖీల
జాడేది..?
2023 ఫిబ్రవరి 7, 9వ తేదిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఔషధ నియంత్రణ అధికారులు దినేష్, మహ్మద్‌రఫీ, రబీయా, రేష్మ జిల్లా కేంద్రంలోని పలు మెడికల్ దుకాణాలు, సర్జీకల్ ఏజెన్సీలలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలో ఫార్మసిస్ట్‌లు లేకుండా మందులు విక్రయాలు, వైద్యుల చీటీలు లేకుండా మందులు రోగి, బంధువులకు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. కొందరు యువత దగ్గు సిరప్‌లను మెడికల్ దుకాణంలో కోనుగోలు చేసినట్లు ధ్రువీకరించారు. మందుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు, వాటి కాలపరిమితిలను డీ కోడ్ చేసుకున్నారు. అదే రోజు జిల్లా కేంద్రంలో ఓ మెడికల్ దుకాణ నిర్వాహకుడు ఔషధ నియంత్రణ అధికారుల అనుమతి లేకుండా మందులు విక్రయించినట్లు గుర్తించి యాజమానికి నోటీసులు జారీ చేశారు. 30.12.2023 ముగ్గురిపై డ్రగ్ అండ్ కాస్మోటెక్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసులు జిల్లా కోర్టులో నడుస్తున్నాయి. నాటినుంచి జిల్లాలో అధికారులు తనిఖీలు చేసిన దాఖలాలు లేకపోయాయి. పలువురు దుకాణాదారులకు లైసెన్స్ లేకుండానే దర్జాగా మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. డబ్బులు సంపాదించాలన్న ఆశతో నాణ్యత లేని మందులు, వివిధ కంపెనీల నిర్వహకులు ఉచితంగా ఇచ్చిన మందులను రోగికి అంటగడుతున్నారు. వైద్యుల చీటీ లేకుండా మందులు విక్రయిస్తున్నారు.
● మెడికల్ షాపులలో ఇష్టారీతిగా యాంటీబయాటిక్స్, నిద్రమాత్రల అమ్మకాలు
● కానరాని ఫార్మసిస్టులు
● మామ్ముళ్ల మత్తులో ఔషధ నియంత్రణాధికారులు
గద్వాల క్రైం: జిల్లాలోని ప్రైవేటు మెడికల్ దుకాణాల్లో నిబంధనల ఉల్లంఘన జోరుగా సాగుతోంది. వైద్యులు రాసిన ప్రిస్కిప్షన్ లేకుండానే నొప్పుల నివారణ, నిద్రమాత్రలు, యాంటీ బయాటిక్ మందులు విక్రయిస్తున్నారు. మరోవైపు గ్రామాల్లో ఆర్‌ఎంపీలు సైతం ఎలాంటి అనుమతి లేకుండా మెడికల్ దుకాణాలను నిర్వహిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. గంజాయి, డ్రగ్స్‌కి అలవాటు పడిన కొందరు యువత సరిపడా డబ్బులు లేకపోవడంతో అదేతరహా మత్తును కలిగించే కొన్ని రకాల సిరప్‌లను మెడికల్ దుకాణాల్లో కొనుగోలు చేసి ఇష్టారీతిగా తాగుతున్నట్లు సమాచారం. మెడికల్ దుకాణాల నిర్వాహకులు ఇచ్చే మాముళ్లకు అలవాటు పాడి గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో ఔషధ నియంత్రణ అధికారుల తనిఖీలు చేయడమే మరిచారు అన్న ఆరోపణలు వినవస్తున్నాయి. జిల్లాలో 300 మెడికల్ దుకాణాలు, 8 సర్జికల్ ఏజెన్సీలు ఓ మాఫియాగా ఏర్పడ్డాయి. మందులు విక్రయించాలంటే నిబంధనల మేరకు ప్రతి మెడికల్ దుకాణంలో ఫార్మసిస్ట్ తప్పనిసరి. అయితే నడిగడ్డలో ఔషధ నియంత్రణ అధికారులు.. కార్యాలయం లేకపోవడం.. ఓ వ్యక్తిని నియమించుకుని అక్రమ సంపాదనకు తెర తీశారని సమాచారం.
అంతా ప్రైవేటు వ్యక్తే..
గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో వెలసిన మెడికల్ దుకాణాలను తనిఖీలు చేయాల్సిన ఔషధ నియంత్రణ అధికారులు మామూళ్లకు అలవాటుపడడంతో ఓ ప్రైవేటు వ్యక్తే అంతా తానై నడిపిస్తున్నట్లు సమాచారం. నిత్యం మెడికల్ దుకాణాల నిర్వాహకులకు అందుబాటులో ఉంటూ.. ఎవరైనా తనిఖీలకు వస్తున్నట్లు తెలిస్తే ముందస్తుగా సమాచారం ఇచ్చి అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నూతన దుకాణాల అనుమతి.. రెన్యూవల్ వివిధ అనుమతుల కోసం సదరు వ్యక్తిని సంప్రదిస్తే చాలు పనులు పూర్తి అవుతాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ సదరు ప్రైవేటు వ్యక్తిని ఆరా తీయగా.. గత కొన్నేళ్లుగా వారితో పని చేయడంతో నిర్వాహకులు కలవడం వాస్తవామే అన్నారు.

జోరుగా మెడికల్ దందా!