
‘వికాసానికి ’ విఘ్నాలు..!
గద్వాల యార్డులో వడ్లు కాంటా వేస్తున్న కార్మికులు
●
‘రాజీవ్ యువ వికాసం’
దరఖాస్తులకు అడ్డంకులు
రేషన్ కార్డు లేకపోవడంతో..
రాజీవ్ యువవికాస్ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వెళితే రేషన్‌కార్డు అడిగారు. మాకు రేషన్‌కార్డు రాకపోవడంతో దరఖాస్తు చేసుకోలేకపోయాను. ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వ పథకం తీసుకోలేదు. కొత్త ప్రభుత్వంలోనైన రేషన్‌కార్డు వస్తుందనుకుంటే కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వడంలేదు.
– రాజు, గద్వాల పట్టణం
టెక్నికల్ సమస్యలను
పరిష్కరిస్తాం..
యువ వికాసం పథకం దరఖాస్తులకు సంబంధించి పలు టెక్నికల్ సమస్యలు మా దృష్టికి వచ్చాయి. కొన్నింటిని పరిష్కరించాం. కొత్త మండలాల్లో బ్యాంకులు, గ్రామాలు తదితర సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. బీసీ లోన్ కింద దరఖాస్తు చేసుకునే వారు మహబూబ్‌నగర్‌లోని బీసీ సంక్షేమ శాఖ కార్యాలయానికి వస్తే వెంటనే పరిష్కరిస్తాం. ఎవరూ ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. కార్యాలయంలో ఎడిట్ ఆప్షన్‌కు అవకాశం ఉంది. – ఇందిర,
బీసీ సంక్షేమ శాఖ అధికారి, మహబూబ్‌నగర్
● అనేక ప్రాంతాల్లో సాంకేతిక
సమస్యలతో ఇబ్బందులు
● ఆన్‌లైన్‌లో మండలం, బ్యాంక్, గ్రామాల పేర్లు గల్లంతు
● రేషన్‌కార్డులో ఒక్కరికే అవకాశం.. కొత్తవి రాక పలువురి ఆందోళన
● కొన్ని చోట్ల కులం, ఆదాయం
సర్టిఫికెట్లకూ తప్పని పాట్లు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి సాంకేతిక సమస్యలు అడ్డంకిగా మారాయి. ఈ పథకంలో భాగంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల యువతకు సబ్సిడీ రుణాలు అందించేందుకు ఈ ఏడాది మార్చి 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ చేపట్టగా.. ఈ ప్రక్రియకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైన విషయం తెలిసిందే. దీంతో సర్కారు దరఖాస్తుల తుది గడువును మార్చి 30 నుంచి ఈ నెల 14 వరకు పొడిగించింది. అయినప్పటికీ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు రకాల సాంకేతిక సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సర్కారు నిర్దేశిత గడువుకు మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉండగా.. దరఖాస్తుదారుల్లో ఆందోళన గూడు కట్టుకుంది. మీ సేవ, ఇంటర్నెట్ సెంటర్ల వద్దకు నిత్యం చక్కర్లు కొడుతున్నా.. ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం వ్యక్తమవుతోంది.
సమస్యలు.. ఇబ్బందులు
● జిల్లాల పునర్విభజనలో రంగారెడ్డి జిల్లాలోని గండేడ్ మండలాన్ని మహబూబ్‌నగర్ జిల్లాలో చేర్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గండేడ్ మండలం నుంచి కొత్తగా మహమ్మదాబాద్ మండలం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఆయా మండలంలోని పలు గ్రామాలకు చెందిన వారికి.. ఆ గ్రామ పరిధిలోని బ్యాంకులు వెబ్‌సైట్‌లో కనిపించడం లేదు. ఆయా గ్రామాల పరిధిలోని బ్యాంకులను ఎంపిక చేసుకున్న పక్షంలో వారికి సంబంధం లేని గ్రామాల పేర్లు చూపిస్తోంది. ఈ సమస్య మహమ్మదాబాద్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో నూతనంగా ఏర్పాటైన కౌకుంట్ల, మూసాపేట, కొత్తపల్లి, గుండుమాల్, ఎర్రవల్లి, పదర, చిన్నంబావి మండల పరిధిలో నెలకొన్నట్లు తెలుస్తోంది.
● మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని ధర్మాపూర్, చౌదర్‌పల్లి గ్రామాలకు సంబంధించిన పేర్లు ఒకసారి వెబ్‌సైట్‌లో కనపడుతున్నాయి. మరికొన్ని సార్లు చూపించడం లేదు. దీంతో ప్రతిరోజు మీసేవ, ఇంటర్నెట్ సెంటర్లకు క్యూ కట్టాల్సి వస్తోందని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
● గత ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దరఖాస్తుదారులకు సంబంధించి యువ వికాసం పథకంలో తొలుత అడ్డంకులు వచ్చాయి. వెబ్‌సైట్ దరఖాస్తులు స్వీకరించలేదు. ఈ క్రమంలో ఆ దరఖాస్తులను పక్కన బెట్టడమే కాకుండా.. వెబ్‌సైట్‌లో వాటిని ఎత్తేసినట్లు సమాచారం. ప్రస్తుతం వారికి ఇబ్బంది లేకున్నా.. గతంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులు రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. వెబ్‌సైట్ దరఖాస్తులు స్వీకరించకపోవడమే ఇందుకు కారణం.
● రాజీవ్ యువ వికాసానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్, పాన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రంతో పాటు ఆదాయ ధ్రువీకరణ పత్రం కావాలి. అయితే కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదాయం సర్టిఫికెట్ 2024 ఏప్రిల్ తర్వాత తీసినదై ఉండాల్సి రావడంతో ఎక్కువ మంది మీ సేవ సెంటర్లు, రెవెన్యూ కార్యాలయానికి చక్కర్లు కొడుతున్నారు. ఐదారు మండలాల్లో మినహా మిగిలిన మండలాల్లో ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు లేవు. కుల ధ్రువీకరణలో మాత్రం జాప్యం జరుగుతోంది.
ఇంటర్వ్యూలకు త్వరలో షెడ్యూల్..
దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మండల, జిల్లాస్థాయిలో ఇంటర్వ్యూ నిర్వహణకు అధికారులు షెడ్యూల్ ప్రకటించనున్నట్లు సమాచారం. ఆ తర్వాత దరఖాస్తులు చేసుకున్న వారి వ్యాపార పెట్టుబడి ఆధారంగా ఆయా బ్యాంకులు సబ్సిడీ రుణాలు అందజేయనున్నాయి. రూ.50 వేలు తీసుకుంటే 100 శాతం సబ్సిడీ రానుంది. రూ.లక్షకు 90 శాతం, రూ.2 లక్షలకు 80 శాతం.. ఆ తర్వాత రూ.4 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ వర్తించనుంది. జూన్ రెండో తేదీ వరకు ప్రక్రియ పూర్తి చేసి.. రుణం మొత్తాన్ని లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు సమాచారం.
ధ్రువపత్రాల జారీలో ఆలస్యం..
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడు నారాయణపేట జిల్లా నర్వ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన రవి. ఇతను రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువపత్రాల కోసం వారం రోజులుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. చాలామంది ఒకే సారి దరఖాస్తు చేసుకోవడంతో కాస్త ఆలస్యం అవుతుందని అధికారులు చెబుతుండడంతో నిరాశతో వెనుదిరుగుతున్నాడు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో కాకుండా మండల పరిషత్ కార్యాలయంలో అందించేందుకు చర్యలు తీసుకోవాలని రవి కోరుతున్నాడు.
తప్పని ప‘రేషాన్’..
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది మంది కొన్నేళ్లుగా నిరీక్షిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తవి ఇస్తామని ప్రకటించింది. ఆ ప్రక్రియ కొనసాగుతోంది. నిబంధనల ప్రకారం రేషన్‌కార్డులో ఉన్న పేర్లలో ఒకరికి మాత్రమే రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ క్రమంలో రేషన్‌కార్డులకు కొత్తగా దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్న వారు యువ వికాసంలో తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అదేవిధంగా అర్హులై ఉండి రేషన్ కార్డు రానివారిలో అసంతృప్తి నెలకొన్నట్లు తెలుస్తోంది.

‘వికాసానికి ’ విఘ్నాలు..!

‘వికాసానికి ’ విఘ్నాలు..!

‘వికాసానికి ’ విఘ్నాలు..!