
భూ సమస్యల పరిష్కారానికే చట్టం
ఎర్రవల్లి: భవిష్యత్‌లో ప్రతి భూమికి ఆధార్ తరహాలో ప్రత్యేక గుర్తింపు కల్పించేలా సర్వే ద్వారా కొలతలు, హద్దులు వంటి సమగ్ర వివరాలతో భూధార్‌ను ప్రవేశ పెట్టనున్నట్లు, భూభారతి చట్టం ద్వారా భూ రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసుకునే అవకాశం కల్పించబడుతుందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సుకు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కును కల్పించడంతో పాటు భూ సంబంధిత వివాదాలను పూర్తిగా నివారించేలా ప్రభుత్వం అనేక కీలక అంశాలను సమన్వయపరిచి నూతన భూభారతి ఆర్‌ఓఆర్ చట్టాన్ని రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. ఈచట్టంలో మొత్తం 23 సెక్షన్లు, 18 నిబంధనలు ఉండటం ద్వారా భూ పరిపాలన మరింత స్పష్టతతో, శాసీ్త్రయంగా అమలవుతుందని వెల్లడించారు. భూమి రిజిస్ట్రేషన్ లేదా మ్యూటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూ సర్వే నిర్వహించి మ్యాప్ సిద్దం చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. సాదా బైనామాల పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్థ రైతులకు న్యాయబద్దమైన మార్గం కల్పిస్తోందని తెలిపారు. భూభారతితో రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నిలుస్తోందని, భూ సమస్యల పరిష్కారానికి ఎంతో వెసులుబాటు కలగనుందని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డిసిసిబి చైర్మెన్ విష్ణువర్దన్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మెన్ నీలి శ్రీనివాసులు, పిఎసిఎస్ చైర్మెన్ రంగారెడ్డి, తహసీల్దార్ నరేష్, ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఏఓ రవికుమార్, ఏఈఓలు, జీపీ కార్యదర్శులు, రైతు సంఘాల నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.