
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం
గద్వాలటౌన్: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులలో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన వారినే లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని, ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉండాలన్నారు. ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షిస్తూ పూర్తయ్యేలా చూడాలన్నారు. ఇళ్ల నిర్మాణాల పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించినట్లు తెలిపారు. ప్రతి వారం పురోగతిపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల స్వీకరణపై సమీక్షించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నుంచి వచ్చిన దరఖాస్తుల పరిశీలన తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలను ప్రభుత్వ సూచనల ప్రకారం నిర్వహించాలన్నారు.
తాగునీటి సమస్య రాకుండా చూడాలి
వేసవిలో జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తలెత్తకుండా ప్రణాళిక బద్దంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. తాగునీటి సరఫరాపై మండలాల వారీగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ పట్టణ, గ్రామాల పరిధిలో ఎక్కడ కూడా తాగునీటి సమస్య తలెత్తకూడదన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి కొరత ఉన్న సమస్యాత్మక ప్రాంతాలను ముందస్తుగా గుర్తించి, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాగునీటికి అవకాశం ఉన్న అన్ని మార్గాలను సమర్ధవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రజల తాగునీటి సమస్యపై నిర్లక్ష్యంగా వ్యవహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అధికారులు సమన్వయంతో పైపులైన్ లీకేజీలు, మోటర్ల మరమ్మతు చేపట్టాలన్నారు.
స్ట్రాంగ్‌రూం వద్ద పటిష్ట భద్రత
ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతినెలకు ఒకసారి నిర్వహించే సాధారణ తనిఖీలలో భాగంగా కలెక్టర్ తనిఖీ చేపట్టి, భద్రత చర్యలను పరిశీలించారు. స్ట్రాంగ్‌రూం రికార్డులు, సీసీ కెమెరాలను పరిశీలించారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న జంటకు సమావేశ మందిరంలో ప్రోత్సహాక బహుమతిని అందజేశారు. పట్టణానికి చెందిన మౌనిక, రమేష్ కులాంతర వివాహం చేసుకోగా.. ప్రభుత్వం కల్పించిన పథకం ద్వారా రూ.2.50 లక్షల ప్రోత్సాహక బహుమతికి సంబంధించిన బాండ్‌ను కలెక్టర్ వారికి అందజేశారు. సమావేశాల్లో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, సంబంధిత అధికారులు నాగేంద్రం, రమేష్‌బాబు, శ్రీధర్‌రెడ్డి, పరమేశ్వరి, సరోజ, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారి
కలెక్టర్ బీఎం సంతోష్