
వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం మహిళలకు మేలు
గద్వాలటౌన్: వక్ఫ్ సవరణ చట్టంతో పేద ముస్లిం మహిళలకు మేలు జరుగుతుందని మహబూబ్‌నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ పేర్కొన్నారు. వన్ నేషన్– వన్ ఎలక్షన్, వక్ఫ్ సవరణ చట్టం–2025పై జిల్లా కేంద్రంలో బీజేపీ ఏర్పాటు చేసిన మేధావుల అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పాలనలో వక్ఫ్ చట్టం పక్కదారి పట్టిందని, ధనిక ముస్లింలకు మాత్రమే లబ్ధి చూకూరిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు, ఎంఐఎం నేతలు చట్ట సవరణపై భయాందోళనలు రేకెత్తించారని ఆందోళన వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ బిల్లుతో వక్ఫ్‌బోర్డుల్లో జరిగే అవినీతి, అక్రమాలకు ముగింపు పడి పేద ముస్లింలకు లాభం చూకూరుతుందన్నారు. వక్ఫ్‌బోర్డు పేరుతో ఇంతకాలం జరిగిన అక్రమాలకు ఇది అడ్డుకట్ట వేస్తుందని చెప్పారు. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వలన దేశానికి ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. అభివృద్ధికి సైతం దోహదం చేస్తుందని చెప్పారు. పలువురు ముస్లింలు మాట్లాడుతూ వక్ఫ్ సవరణ చట్టాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. వెనకబడిన ముస్లింలకు ఇది ఆర్థికపరమైన ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. పేద ముస్లింలు బీజేపీ ప్రభుత్వానికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అప్సర్‌పాష, బీజేపీ నాయకులు రామంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రామచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్‌ఏక్టోటే, మాలీం ఇసాక్, మోహిద్‌ఖాన్, అత ఉర్ రహమాన్, దేవదాసు, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.