
కొత్త చట్టంతో భూ సమస్యలకు సత్వర పరిష్కారం
గట్టు: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తున్నట్లు కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శనివారం గట్టులో భూ భారతి చట్టం–2025పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కొత్తగా ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చిందని అన్నారు. కొత్త చట్టం ప్రకారం ఇక నుంచి భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు భూమిని సర్వే చేసి, మ్యాప్‌తోనే రిజిస్ట్రేషన్ చేయనున్నట్లు, ఇలా చేయడం ద్వారా 90 శాతం భూముల వివాదాలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ప్రతి మనిషికి ఆధార్ ఉన్నట్లే.. ప్రతి రైతు భూమికి భూదార్ కార్డు ఉండనుందని, ఇక నుంచి భూ ఆక్రమణకు అవకాశం లేదన్నారు. కొత్త చట్టం ద్వారా లావాదేవీల సేవలు, రిజిస్ట్రేషన్, ముటేషన్, నిషేధిత భూములు, ఆర్‌ఓఆర్ మార్పులు, చేర్పులు, వారసత్వ భూములు, సాదాబైనామాలు, ఓఆర్‌సీ వంటి సేవలు సుభతరం అవుతాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారాకి మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని, నిర్దేశిత సమయంలో సమస్యలను పరిష్కరించడం జరుగుంతుందని తెలిపారు. ధరణి వ్యవస్థలో భూ హక్కులపై తలెత్తే వివాదాలకు అప్పీల్ అవకాశం లేక సివిల్ కోర్టుకు వెళ్లాల్సి వచ్చేదని, కొత్త చట్టం ద్వారా తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్, ట్రీభ్యునల్ వరకు అప్పీల్ అవకాశం అందుబాటులోకి వచ్చి, సమస్యలకు పరిష్కారం లభించనున్నట్లు వివరించారు. జిల్లాలోనే గట్టు మండలంలోనే అత్యధిక భూ సమస్యలు ఉన్నప్పటికి ఇప్పటికే 90 శాతం సమస్యలు పరిష్కరించామని, త్వరలోనే గ్రామ పాలన అధికారుల నియామకం కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామాల వారిగా అధికారులు రెవెన్యూ సదస్సులను నిర్వహించి, దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహసిల్దార్ సలీముద్దిన్,ఎంపీడీఓ చెన్నయ్య పాల్గొన్నారు.
పిల్లలకు పౌష్టికాహారం, మెరుగైన విద్య అందించాలి
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు మెరుగైన విద్యను అందించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అంగన్‌వాడీ టీచర్లకు ఆదేశించారు. శనివారం గట్టులోని సంతబజారు అంగన్‌వాడీ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలోని పిల్లలు, తల్లులు, బాలింతలకు అందుతున్న అంగన్‌వాడీ సేవల గురించి సిబ్బంది ద్వారా వివరాలను తెలుసుకున్నారు. చిన్నారుల ఎత్తు, బరువులను పరిశీలించి,మోబైల్ యాప్‌లోని వివరాలను చెక్ చేశారు. పిల్లల పెరుగుదల, పర్యవేక్షణ క్రమంగా చేపట్టి ఖచ్చితమైన ఎత్తులు, బరువులు యాప్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. పిల్లలను అంగ్లం అక్షరమాల, తెలుగు వర్ణమాలపై ప్రశ్నించారు. పిల్లలకు అంగన్‌వాడి కేంద్రంలో బలమైన పునాది పడడానికి మరింత మెరుగుగా అంగన్‌వాడి టీచర్లు పని చేయాలన్నారు.గర్భిణుల ఆరోగ్య స్థితిని ఎప్పడికప్పుడు పర్యవేక్షణ చేయాలని, పౌష్టికాహారంపై అవగాహాన కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్నయ్య, ఆస్పిరేషన్ బ్లాక్ కోఆర్డీనేటర్ అప్జల్, ఆర్‌ఐ రాజు, అంగన్‌వా డి టీచర్ వెంకట్రావమ్మలు పాల్గొన్నారు.