షడ్రుచుల ఉగాది
క్రోధీకి వందనం.. ఆశల విశ్వావసు నామకు ఆహ్వానం
తెలుగు సంస్కృతి, సంప్రదాయాల్లో కాలానికి ఒక ప్రమాణం ఉంది. కాలాన్ని లెక్కించడానికి నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. అందులో భాగంగానే నెలలకు, సంవత్సరాలకు పేర్లను నిర్దేశించారు. ఛైత్రం నుంచి ప్రారంభమయ్యే నెలలు ఫాల్గుణంతో ముగిస్తాయి. కొత్త పూత, కొత్త కాత, కొత్త రుచులతో నూతన సంవత్సరం ఆరంభమవుతూ కొంగొత్త ఆలోచనలకు తెరతీస్తుంది. ద్వాపర యుగంలో తన అవతారాన్ని శ్రీకృష్ణుడు చాలించగా కలియుగం ప్రారంభమయ్యే సమయంగా దీన్ని యుగాదిగా పరిగణించారనే వాదన ఉంది. యుగాది కాలక్రమంలో ఉగాదిగా వాడుకలోకి వచ్చింది.
పంచాంగ పఠనం తర్వాత నిర్వహించే కవి సమ్మేళనం ఆకట్టుకునేలా ఉంటుంది. ‘హితేన సహితం సాహిత్యం’ అంటారు. మేలుచేసేదే సాహిత్యం అని అర్థం. వసంతరుతువు కావడంతో లేత చిగుళ్లు తిన్న కోయిలలు మాధుర్యంతో కూసే కూత కవిలో కొత్త ఆలోచనలు కలిగిస్తుంది. ఈ సమ్మేళనాల్లో ఔత్సాహిక కవులు జనహితం కోరుతూ రచించిన కవితలను షడ్రుచులతోపాటు మాతృబాషపై మాధుర్యాన్ని జోడించి ఇందులో చదివి వినిపిస్తారు. ఇలాంటి కవి సమ్మేళనాలకు చిన్నారులను తీసుకెళ్లడం వల్ల వారికి మాతృభాషపై మరింత అవగాహన పెరిగే వీలుంటుంది. కవితా రచనప్రక్రియపై అవగాహన పెరుగుతుంది. ఇతరభాషల పట్ల మోజుతో ఉన్నవారికి సైతం మాతృభాషపై ఆసక్తిని కలిగిస్తుంది. కవితల రూపంలో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ముందు తరానికి పరిచయం చేయొచ్చు.
ప్రపంచ భాషల్లో తెలుగు మాధుర్యమైంది. ఎందుకంటే తెలుగులో ప్రతి పదం చివర అచ్చుతో ముగుస్తుంది. అచ్చుతో పదాలు ముగిసే భాష కాబ ట్టి అజంతభాష అనే పేరువచ్చింది. తెలుగుభాష మాధుర్యాన్ని చాట డానికి కవి సమ్మేళనం ఒక చక్కని వేదిక.
● తెలుగు సంస్కృతికి ప్రతీక ఈ పండుగ
● ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు
ఉగాది పర్వదినం తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకం. ఉగాది రోజున ఒంటికి పసుపు కలిపిన సున్ని పిండితో నలుగు పెట్టుకొని తలంటు స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరిస్తారు. షడ్రుచుల పచ్చడి సేవిస్తారు. పచ్చడిలో పులుపు (ఆమ్లం), తీపి (మధురం), వగరు (కషాయం), చేదు (పిత్తం), కారం (కటువు), ఉప్పు (లవణం) గుణాలతో కూడిన వేపపువ్వు, లేత మామిడి కాయ, బెల్లం, చింతపండు, ఉప్పు, కారంతో ఉగాది పచ్చడి తయారు చేస్తారు.
ఈ పండుగ రోజున సాయంత్రం వేళ ఆలయాల్లో, గ్రామకూడలిలో పంచాంగ పఠనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పంచాంగం పూర్వ కాలంనుంచి ఒక శాస్త్రంగా భావిస్తూ వస్తున్నారు. గ్రామ పురోహితుడు హాజరై గ్రామ పెద్దలు, పుర ప్రముఖుల మధ్య పంచాంగం వివరాలను చదివి వినిపిస్తారు. పంచాంగం రానున్న ఏడాది కాలంలో వ్యక్తుల వ్యక్తిగత ఆదాయ, వ్యయాలు, పోకడలతో పాటు దేశప్రాంత సామాజిక పరిస్థితులు, వాతావరణం వంటి విషయాల్లోనూ అప్రమత్తం చేస్తుంది. వర్షాలు, కరవు కాటకాలు, అరిష్టాల గురించి ఇందులో వివరిస్తారు. నమ్మకాన్ని బట్టి ఈ వివరాలను విశ్వసిస్తారు. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అనే ఐదు అంశాలతో కూడిన పంచాంగ పఠనం వింటే సంపద, ఆయుష్షు, పాపపరిహారం, రోగాలు తొలగడం, చేసే ప్రయత్నాలు ఫలించడం వంటి ఐదు ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు.
మనిషికి, ప్రకృతికి సంబంధం
చలికాలంలో మనిషి శరీరంపై కాలం తీరిన చర్మం పొరలుగా రాలిపోతుంది. వెంట్రుకలు కూడా అలాగే రాలిపోతుంటాయి. ప్రకృతిలో కూడా హేమంతరుతువు (చలికాలం ప్రారంభం)లో చెట్ల ఆకులు ఎండిపోతుంటాయి. శిశిరుతువు (చలికాలం ముగింపు)లో కొత్త చిగుళ్లు వేస్తుంటాయి. ఇలా ఒకే కాలం మనిషికి, ప్రకృతికి సంబంధాన్ని కలిపింది.
ఆకట్టుకునే కవి సమ్మేళనం
తెలుగుజాతికి ప్రత్యేకం
తెలుగు అజంత భాష
భవిష్యత్తుపై అప్రమత్తత..
పంచాంగం


