ఆస్తిపన్ను వసూళ్లలో ‘అయిజ’ రికార్డు
అయిజ: మున్సిపాలిటీలకు సంబంధించి 2024–25 ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్నులో 95 శాతం వసూలు చేసి అయిజ మున్సిపాలిటీ రాష్ట్రంలో టాప్ ఫైవ్‌లో ఒకటిగా నిలిచింది. సోమవారం ఆర్థిక సంవత్సరం ఆఖరి రోజు కావడంతో చివరి రోజు వసూలు చేసిన దానితో కలిపి అయిజ టాప్ ఫైవ్‌లో ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో గత సంవత్సరం కంటే 12.09 శాతం ఆస్తిపన్ను ఎక్కువగా వసూలు చేయడంతో అయిజ మున్సిపాలిటీ 15 ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించింది. దీంతో 15వ ఆర్థిక సంఘం నుంచి సుమారు రూ.2కోట్లు నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సైదులు మాట్లాడుతూ.. పురపాలక సంఘం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా ఈ సంవత్సరం ఆస్తిపన్ను 95 శాతం వసూలు చేశామని అన్నారు. మొత్తం 1.82 కోట్లు డిమాండ్ ఉండగా 1.62 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు. ఈసందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఆర్‌ఐ, ఆర్‌ఓ, బిల్ కలెక్టర్లను అభినందించారు. మున్సిపాలిటీ సిబ్బంది సంబరాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఓ లక్ష్మన్న, ఆర్‌ఐ విజయ్, వార్డు ఆఫీసర్లు భరత్, రామకృష్ణ, బిల్ కలెక్టర్లు అజ్మీర్ ఖాజా, అడివన్న, మహేంద్రనాథ్, నరేష్, నాగరాజు, ఆంజనేయులు, వీరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.


