
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
గద్వాల క్రైం: జిల్లాలోని రైతులకు ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయించినట్లు తేలితే వారిపై క్రిమినల్, పీడీ యాక్టు కేసులు నమోదు చేయాల్సిందిగా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాబోవు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయా గ్రామాల్లో రైతులు సాగుకు సన్నద్ధమవుతుంటారని, ఈక్రమంలోనే పలువురు వ్యాపారులు నాసీరకం విత్తనాలు, ఫర్టిలైజర్, యూరియా, పురుగుమందులు తదితర వాటిని రైతులకు విక్రయాలు చేస్తుంటారన్నారు. ఎక్కడైనా నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే అవకాశం ఉంటుందని, అలాంటి వారిపై నిఘా ఉంచాలని, విరివిగా వ్యవసాయ, పోలీసుశాఖ సంయుక్తంగా సోదాలు చేపట్టాలన్నారు. రాష్ట్ర డీజీపీ రెండు రోజులపాటు అన్ని జిల్లా పోలీసు అధికారులతో సమావేశంలో ఆదేశాలు జారీ చేసినట్లు సిబ్బందికి వివరించారు. ఎక్కడైన బెట్టింగ్, గంజాయి, మత్తు పదార్థాల సరఫరా వంటి వాటిపై నిఘా ఉంచాలన్నారు. బాధితులతో సిబ్బంది హుందాగా వ్యవహరించి పోలీసులపై నమ్మకం కలిగేల విధులు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎస్పీ మొగిలయ్య, సీఐలు శ్రీను, రవిబాబు, టాటాబాబు ఉన్నారు.