ఎర్రవల్లి: ఉపాధి హామీ పఽథకంలో కూలీలతో సరైన కొలతల ప్రకారం పనులను చేయించి అధిక వేతనం వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధికారులకు సూచించారు. శనివారం మండలంలోని తిమ్మాపురం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ..రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఉపాధి కూలీలు తగు జాగ్రత్తలు పాటించాలని, పనులు జరుగుతున్న ప్రదేశంలో కనీస వసతులు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉపాధి పనిలో మహిళ సమాఖ్య సంఘం సభ్యులు కూడా పాల్గొని వివిధ శాఖలకు ఉపయోగపడే పనులను పూర్తిచేసి పథకాన్ని సద్వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అబ్దుల్ సయ్యద్ ఖాన్, ఎపిఎం శివజ్యోతి, పంచాయతీ కార్యదర్శి విష్ణువర్దన్‌రెడ్డి, టిఎ ప్రవీన్, తదితరులు పాల్గొన్నారు.
పురాతన బావి కబ్జాపై నిరసన
గద్వాలటౌన్: సంస్థానాధీశుల కాలం నాటి పురాతన బావులను పునరుద్ధ్దరించలేని పాలకులు, అధికార యంత్రాంగం.. కనీసం వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోలేకపోవడం దారుణమని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. పురాతన కొత్తబావిని పునరుద్దరించడంతో పాటు ఆక్రమించుకున్న మున్సిపల్ మాజీ చైర్మన్ వేణుగోపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం బీజేపీ నిరసన దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పురాతన బావి కబ్జాపై ప్రజా సంఘాలు, అఖిలపక్ష నాయకులు ఆందోళనలు చేస్తున్న ఎమ్మెల్యే స్పందించకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
పూడ్చిన బావిలో మట్టి తొలగించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే, వారిపై అధికార పార్టీ నేత బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అనుమతులు లేకుండా సుమారు రెండు వందల టిప్పర్ల మట్టిని తరలించి బావిని పూడ్చిన సంబంధిత అధికారులు పట్టనట్లుగా వ్యవహరించారని ఆరోపించారు. దీక్ష శిబిరంలో బీజేపీ నాయకులు బండల వెంకట్రాములు, జయశ్రీ, కేకే రె డ్డి, దేవదాసు, చిత్తారికిరణ్, నర్సింహా, మాలీంఇసాక్, కృష్ణ, మదుగౌడ్, వాసు, శంకర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్
అచ్చంపేట రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని.. బీసీలు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ కోరారు. శనివారం అచ్చంపేట పట్టణంలోని మహేంద్రనగర్ కాలనీలో బుడుబుక్కుల కులస్తులతో ఆయన సమావేశమై వారి జీవన స్థితిగతులను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు చెందిన కొన్ని జాతుల వారు వృత్తిపరంగా ఉన్నత స్థాయిలో ఉన్నా.. తమ కులం పేరు బయట చెప్పేందుకు సిగ్గుపడే స్థితిలో ఉన్నారన్నారు. బీసీలలోని కొన్ని కులాల్లో పేర్లు బయటకు చెప్పుకోలేనంత అభ్యంతరకరంగా ఉండటంతోనే కుల పేర్ల మార్పిడీపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు చెప్పారు. పేరు మార్పిడీపై వారి సలహాలను స్వీకరించారు.

‘ఉపాధి’ కూలీలకు అధిక వేతనం వచ్చేలా చూడాలి