
పకడ్బందీగా ధాన్యం కొనుగోళ్లు
గద్వాల: యాసంగిలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఇందుకు సంబంధించి అన్ని రకాలుగా ముందస్తు సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీవోసీ కార్యాలయంలోని సమావేశం హాలులో అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024–25 యాసంగిలో రైతులు పండించిన ప్రతీగింజను కొనుగోలు చేయాలన్నారు. యాసంగిలో సీజన్ ధాన్యం కొనుగోళ్లను ఏప్రిల్ మూడో వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు వివరాలు ఎప్పటికప్పుడు రికార్డులో నమోదు చేయాలన్నారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలని, గతంలో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు ప్రక్రియలో అన్ని రకాల ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి ధాన్యం కొనుగోలు వ్యవహారం సక్రమంగా కొనసాగించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, సివిల్‌సప్‌లై డీఎస్‌వో స్వామి, డీఎం విమల, డీఏవో సక్రియ నాయక్, కో–ఆపరేటీవ్ అధికారి శ్రీనివాస్, ఏవోలు తదితరులు పాల్గొన్నారు.