
సద్వినియోగం చేసుకోవాలి
రాజోళి/శాంతినగర్: రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సూచించారు. రాజోళి మండల కేంద్రం, వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామాల్లోని రేషన్ దుకాణాల్లో శుక్రవారం సన్నబియ్యం పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీతో పేదలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. దళారుల మాటలు నమ్మి సన్నబియ్యాన్ని అమ్ముకోవద్దని సూచించారు. అదే విధంగా రాజోళిలో కల్యాణలక్ష్మి పథకం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్లు పి.రామ్మోహన్, వీరభద్రప్ప, డీటీలు శ్రీకాంత్‌రెడ్డి, ప్రశాంత్‌గౌడ్, ఆర్‌ఐ సర్ధార్, పీఏసీఎస్ చైర్మన్ గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ గోపాల్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటాల్ రూ.6,289
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శుక్రవారం 1,265 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,289, కనిష్టంగా రూ. 3,019, సరాసరి రూ. 4,789 ధరలు వచ్చాయి. 6 క్వింటాళ్ల కందులు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,369, కనిష్టంగా రూ. 5,116, సరాసరి రూ. 6,369 ధరలు లభించాయి. 116 క్వింటాళ్ల ఆముదాలు అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 6,091, కనిష్టంగా రూ. 5,361, సరాసరి రూ. 6,091 ధరలు పలికాయి. 75 క్వింటాళ్ల వరిధాన్యం (సోన) అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 2,016, కనిష్టం రూ. 1,911, సరాసరి రూ. 1,982 ధరలు వచ్చాయి.
జీవితంలో ఉన్నతంగా ఎదగాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదగాలని మెల్‌బోర్న్‌లోని బియాండ్ యువర్ మైండ్స్ సంస్థ వ్యవస్థాపకురాలు సరోజ గుల్లపల్లి పేర్కొన్నారు. శుక్రవారం పీయూలో శుక్రవారం ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పక్షుల ఎదుగుదల, జీవితంతో పోరాటం తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. వ్యక్తి అభిరుచికి అనుగుణంగా స్వేచ్ఛను అనుభవించాలని, ఎంత కష్టపడితే అంత పైకి ఎదుగుతారని పేర్కొన్నారు. నూతన ఆవిష్కరణలపై విద్యార్థులు దృష్టి సారించాలని, సామాజిక నిబంధనలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో కొత్త అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో అధ్యాపకులు రవికుమార్, సిద్ధరామాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.
యువతులతో ఉద్యోగి అసభ్యకర ప్రవర్తన
కేటీదొడ్డి: ప్రభుత్వ శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న ఓ యువకుడు మండలంలోని యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతుల తల్లిదండ్రులు సదరు ఉద్యోగిని నిలదీసినట్లు తెలిసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా.. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.