
రాజ్యాంగ నిర్మాతను అవమానించిన కాంగ్రెస్
గద్వాలటౌన్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్‌కు సముచిత గౌరవం ఇవ్వకపోగా.. ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు త్రీవంగా అవమానించారని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్‌గౌడ్ ఆరోపించారు. అంబేద్కర్ శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఆదివారం స్థానిక గంజిపేట కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1952 లోక్‌సభ ఎన్నికల్లో అంబేద్కర్‌ను ఓడించేందుకు ఆనాటి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కలిసి నారాయణరావ్ కథరోల్కర్‌ను పోటీకి నిలిపాయని, నెహ్రూ స్వయంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి అంబేద్కర్ ఓటమికి కారకులయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ హయాంలో అంబేద్కర్ స్మృతివనం, పంచతీర్థ పేరుతో ఆయన పుట్టిన, నివసించిన, దహన సంస్కారాలు నిర్వహించిన స్థలాలను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని 75 సార్లు సవరించిందన్నారు. బీజేపీ మాత్రమే అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటోందని తెలిపారు. అంబేద్కర్ చూపిన బాటలోనే ప్రతి ఒక్కరూ నడవాలని చెప్పారు. అంబేడ్కర్ లాంటి మహనీయులను స్మరించుకోవాలని, వారు కలలుకన్న నవభారతాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామాంజనేయులు, డీకే స్నిగ్దారెడ్డి, రవికుమార్‌ఏక్బోటే, బండల వెంకట్రాములు, అక్కల రమాదేవి, దేవాదాస్, శివారెడ్డి, స్వప్న, చిత్తారి కిరణ్, తిమ్మన్న, శంకర్, నర్సింహా, శ్యామ్‌రావు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.