
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కృషి
కేటీదొడ్డి/ ధరూరు: పేద ప్రజల ఆకలి తీర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం సంపన్నులతో సమానంగా సన్న బియ్యం అందిస్తోందని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం ఆయన ఎస్పీ శ్రీనివాసరావు, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి మండలంలోని మల్లాపురం గ్రామంలో లబ్ధిదారుడు సురేష్‌నాయక్ కుటుంబ సభ్యులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడితో సన్నబియ్యం ఎలా ఉన్నాయి అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అర్హత గలిగిన ప్రతి ఒక్కరికి సన్న బియ్యం అందిస్తామన్నారు. ఎమ్యెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ వెనకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమన్నారు. సన్న బియ్యాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంటికి కలెక్టర్‌ను ఆహ్వానించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డు చైర్మన్ హన్మంతు, తహసీల్దార్ హరికృష్ణ, నాయకులు రాజశేఖర్, రామకృష్ణనాయుడు, విజయ్, రమేష్‌నాయుడు, టీచర్ గోవిందు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ నమూనా ఇంటి నిర్మాణం పరిశీలన
ధరూరు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మాణ పనులను కలెక్టర్ బీఎం సంతో్‌ష్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మంజూరు పత్రాలను అందించడంతోపాటు ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. కుల, ఆదాయ, ఏబీసీ, రెసిడెన్సీ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ భూపాల్‌రెడ్డి, డీటీ మంగమ్మ, ఆర్‌ఐ తేజ తదితరులు పాల్గొన్నారు.