
గద్వాల చరిత్రను కాపాడతాం
గద్వాల: గద్వాల సంస్థాతనాధీశుల చరిత్రను కాపాడతానని గద్వాల మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ మునిమనవడు కృష్ణరాంభూపాల్ అన్నారు. బుధవారం ఆయన గద్వాల స్వయంభు లక్ష్మీచెన్నకేశవస్వామిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. గద్వాలలో దిగుడు బావులు తాగునీటి కోసం తమ పూర్వీకులు నిర్మించారని, కొత్తబావిని పరిశీలించడం జరిగిందని చాలా బాధపడ్డానని బావి కబ్జా కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై కలెక్టర్‌తో మాట్లాడుతామన్నారు.
కొత్తబావిని కాపాడాలని కలెక్టర్‌కు వినతి
గద్వాల పట్టణంలోని చింతలపేట వద్ద సంస్థానాధీశుల కాలంలో నిర్మించినటువంటి కొత్తబావి ఆక్రమణకు గురవుతుందని వెంటనే కొత్తబావిని సంరక్షించాలని రాజవంశీయులు కలెక్టర్ బీఎం సంతోష్‌ను సుహాసినిరెడ్డి, వెంకటకృష్ణారెడ్డి, వెంకటాద్రిరెడ్డి, విక్రమ్‌సింహారెడ్డి కోరారు. ఈమేరకు వారు బుధవారం కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్‌లో వినతిపత్రం అందజేశారు.
ఇవ్వడానికి సిద్ధం
జిల్లా కేంద్రంలోని సర్వే నంబర్ 850లో 2.20 ఎకరాలు 1975లో మా నాన్న కొనుగోలు చేశారని ఇందులో కొత్తబావి కూడా ఉందని మాజీ మున్సిపల్ చైర్మన్ జి.వేణుగోపాల్ అన్నారు. ఆయన విలేకరులతో మాటాడుతూ.. తాను ఎక్కడా ఒక ఇంచు స్థలాన్ని కూడా కబ్జా చేయలేదన్నారు. ప్రజలకు ఉపయోగపడుతుందంటే ఎమ్మెల్యే, ఎవరైన పెద్దలు చెబితే కొత్తబావిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.