
అయితే.. రికార్డే..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
రాష్ట్ర ప్రభుత్వం గత వానాకాలం నుంచి సన్నాలకు మద్దతు ధరతోపాటు ప్రోత్సాహకంగా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఫలితంగా ఉమ్మడి పాలమూరులోని ఐదు జిల్లాల్లో అన్నదాతలు ఈ యాసంగిలోనూ వరిసాగు వైపే మొగ్గు చూపారు. ప్రధానంగా బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్ రకాలకు చెందిన సన్న రకాల ధాన్యం సాగుకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో సాధారణ సాగును మించి సుమారు 20 శాతం.. గత యాసంగితో పోలిస్తే దాదాపు 25 శాతం మేర వరి సాగు పెరిగినట్లు వ్యవసాయ శాఖ లెక్కగట్టింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సీజన్‌లో ఉమ్మడి జిల్లా పరిధిలో రికార్డు స్థాయిలో దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు.. 11,36,660 మెట్రిక్ టన్నులు సేకరించాలనే లక్ష్యం నిర్దేశించారు.
1,61,504 ఎకరాల్లో పెరిగిన సాగు..
ఉమ్మడి జిల్లాలో గత యాసంగిలో 4,75,264 ఎకరాల్లో వరి సాగు కాగా.. ప్రస్తుతం ఇదే సీజన్‌లో 6,36,768 ఎకరాల్లో సాగు చేశారు. ఈ లెక్కన 1,61,504 ఎకరాల్లో వరి సాగు పెరగగా.. ఈ మేరకు అదనంగా మరో 30 కొనుగోలు కేంద్రాలను అదనంగా కేటాయించారు.
రెండో వారంలో కేంద్రాలు..
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో యాసంగి కోతలు ప్రారంభం కాగా.. ఎలాంటి ఆటంకాలు లేకుండా సేకరణ చేపట్టాలని అధికార యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల మొదటి వారం నుంచే ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తేవాలని సూచించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు సెంటర్లను అధికారులు ఖరారు చేశారు. అయితే ఉమ్మడి జిల్లా పరిధిలో కోతలకు మరింత సమయం పట్టనుండగా.. ఈ నెల రెండో వారం నుంచి కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రయత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ మినహా మిగతా జిల్లాల కలెక్టర్లు.. మిల్లర్లు, వ్యవసాయ, పౌరసరఫరాలు, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్షలు నిర్వహించి తగిన సూచనలు చేశారు. ఎండాకాలం నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ధాన్యం సేకరణ లక్ష్యం 11.36 లక్షల మెట్రిక్ టన్నులు
గత సీజన్లతో పోలిస్తే ఈ యాసంగిలో భారీగా వరిసాగు
ఉమ్మడి జిల్లాలో 30 వరకు పెరిగిన కొనుగోలు కేంద్రాలు
ఈ నెల రెండో వారంలో అందుబాటులోకి సెంటర్లు
ఇప్పటికే అధికారులు, మిల్లర్లతో సమీక్షించిన ఆయా జిల్లాల కలెక్టర్లు
కేంద్రాల వద్ద టెంట్లు, నీటి వసతి ఏర్పాటుకు ఆదేశాలు