
నేడు జిల్లాకు డీజీపీ జితేందర్ రాక
గద్వాల క్రైం/ధరూరు: రాష్ట్ర డీజీపీ జితేందర్ శుక్రవారం జిల్లాకు రానున్నారు. నడిగడ్డలో శాంతిభద్రతలు.. విపత్కర కేసులపై ప్రత్యేక సమావేశం నిర్వహించడంతోపాటు కేసుల పురోగతిపై ఆరా తీయనున్నారు. దీంతో జిల్లా అధికారులు గురువారం ఉదయం నుంచే పోలీసు స్టేషన్‌లోని నమోదైన కేసులు, పురోగతి సాధించిన కేసులు, పెండింగ్ కేసుల అంశాలపై పూర్తి స్థాయిలో కసరత్తు చేపట్టారు. మరోవైపు రెండు రాష్ట్రాల సరిహద్దులో అక్రమ దందాలకు అడ్డుకట్ట, నిషేధిత పదార్థాల కట్టడి, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, చీటింగ్ కేసులపై సమీక్ష నిర్వహించనున్నారు. గద్వాల – అలంపూర్ సెగ్మెంట్‌లలో అక్రమ దందాల వ్యవహారంలో పోలీసు సిబ్బంది ప్రమేయంపై ఇటీవల నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదికను అందజేయడం వంటి ఫిర్యాదులను వాకబు చేయనున్నారు. నిషేధిత కల్లు విక్రయాలు, పోలీసుల దాడులు, తీసుకున్న చర్యలు, ఇప్పటి వరకు నమోదైన ఎన్‌డీపీఎస్ యాక్టు కేసుల వివరాల అంశాలపై ఆరా తీసే అకకాశం ఉంది.
ధూరూర్ పోలీసుస్టేషన్‌కు భూమి పూజ
అలాగే, ధరూరులోని నూతన పోలీసు స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.50 కోట్లు మంజూరు చేయగా.. ఈ నిర్మాణానికి రాష్ట్ర డీజీపీ జీతేందర్ ఉదయం 10.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. జిల్లాలో కేవలం రెండు పోలీసు స్టేషన్లు కేటీదొడ్డి, ఉండవెల్లి మాత్రమే అద్దె భవనంలో కొనసాగుతుండగా త్వరలో వాటికి మోక్షం కలిగించే ప్రక్రియను డీజీపీ దృష్టికి జిల్లా అధికారులు తీసుకెళ్లనున్నారు. అలాగే, ఆయన జిల్లా పోలీసు భవనాల్లో సాయుధ బలగాల బ్యారెక్‌లు, అధికారులు, సిబ్బంది బస చేసేందుకు చేపట్టిన క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. నూతన కార్యాలయ నిర్మాణ పనుల విషయంలో పోలీసు హౌసింగ్ సొసైటీ ఇంజినీర్లతో సమావేశం, జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలాఉండగా, గురువారం డీఎస్పీ మొగులయ్య, సీఐ శ్రీను తదితరులు ధరూర్ పోలీస్ స్టేషన్‌నిర్మించే ప్రదేశాన్ని పరిశీలించారు. డీజీపీ రాక నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
శాంతిభద్రతలు.. విపత్కర కేసులపై ఆరా తీసే అవకాశం
వివరాల సేకరించడంలో జిల్లా పోలీసుశాఖ తలమునకలు