జిల్లా కేంద్రంలో ఇష్టారాజ్యంగా బహుళ అంతస్తుల నిర్మాణాలు
పాత ఇళ్లపైనే నిర్మాణాలు..
చాలామంది మధ్య తరగతి ప్రజలు ఇళ్ల స్థలాలు లేక పెరుగుతున్న కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి పాత ఇళ్లపైనే అదనంగా గదులు నిర్మించుకుంటున్నారు. కొందరైతే పిల్లర్లు లేని ఇళ్లపై ప్రమాదకరంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరికొంత మంది అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు ఉల్లంఘించి బహుళ అంతస్తులు నిర్మించుకుంటున్నారు. ఈ విషయంలో భవన యజమానులు కనీస జాగ్రత్తలు తీసుకోవడం లేదు. అధికారులు సైతం క్షేత్రస్థాయి పరిశీలన చేసి భవన సామర్థ్యానికనుగుణంగా అనుమతులు ఇచ్చి దిశానిర్ధేశం చేయాలి. కానీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా గద్వాలలో భిన్నమైన పరిస్థితులున్నాయి.
గద్వాలటౌన్: ‘ఐదు రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని పోతులవారి వీధిలో నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతిచెందిన తీరు అందరిని కలిచివేసింది.’ ఈ సంఘటనను చూస్తే.. మరి గద్వాల జిల్లా పరిస్థితి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. బహుళ అంతస్తుల నిర్మాణాలు అధికారుల ఎదుట కనిపిస్తున్నా అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో సంబఽంధిత అధికారులు స్థానికంగా ఉన్న భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. ప్రతి ఏడాది ఎక్కడో ఒక చోట ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా.. విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా.. బహుళ అంతస్తులు, పురాతన భవనాలు, కట్టడాల విషయంలో అధికారులు, పాలకులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించటంలేదు. ‘చేతులు కాలే దాకా కళ్లు తెరుచుకోరు... కాళ్లు కదలవు’ అన్నట్లుగా జిల్లా కేంద్రంలోని ఆయా శాఖల అధికారుల పనితీరు కనిపిస్తుంది. ఈ స్థితిలో గద్వాలలో బహుళ అంతస్తుల నిర్మాణాల భద్రత, నాణ్యత ఎంతమాత్రం అన్న ప్రశ్న రేకెత్తించింది.
పర్యవేక్షణ అంతంతే
నోటీసులతో
సరిపెడుతున్న అధికారులు
గుర్తించినా.. పట్టించుకోని వైనం
ఏటా వానాకాలం ముందు జిల్లాలో పాత భవనాల ఇళ్లను గుర్తించేందుకు అధికారులు ఇంటింటి సర్వే చేపడతారు. పట్టణాలు, గ్రామాల్లో అప్రమత్తం చేసినా ఇంటి యజమానుల్లో అవగాహన కలగటం లేదు. కొంతమంది ఇంటికి వెళ్లి నోటీసులు జారీ చేశారు. కానీ కొందరు ఇళ్ల యజమానులు మాత్రం తమకేమి పట్టనట్లు ఉండిపోయారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే చాలా మందికి నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.