గద్వాల: అలంపూర్ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు రూపొందించి అమలుచేయాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జోగుళాంబ దేవస్థానం అభివృద్ధి పర్యవేక్షణ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అలంపూర్ పునరుద్ధరణ ప్రణాళికను ఆర్కిటెక్ సూర్యనారాయణమూర్తి ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఏకై క శక్తిపీఠమైన అలంపూర్ జోగుళాంబ క్షేత్రం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని దేవాలయాన్ని అన్నివిధాలా తీర్చిదిద్దడంతో పాటు పర్యాటకంగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు, ఆలయ పరిసరాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సూచించారు. ప్రసాద్ స్కీం భవనానికి నీటి సరఫరాకు సంబంధించి మున్సిపల్ కమిషనర్, ఇంట్రా ఈఈ, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు నది నీటి శుద్ధి విషయంలో ఫీల్డ్ విజిట్ నిర్వహించి.. 15 రోజుల్లో వ్యయ అంచనాలను సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రసాద్ స్కీం భవనాన్ని టూరిజం శాఖ అధికారులు వెంటనే దేవాదాయశాఖకు అప్పగించాలన్నారు. దేవాలయానికి అనుసంధానించే రహదారుల అభివృద్ధికి, గాంధీ జంక్షన్ నుంచి ఆలయం వరకు రహదారి నిర్మాణ ప్రతిపాదనలను సిద్ధం చేయాలన్నారు. డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. హైదరాబాద్, కర్నూలు నుంచి అలంపూర్ మార్గాల్లో దిశానిర్దేశిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పార్కింగ్ ప్రాంతంలో మొక్కలు పెంచాలని, టాయిలెట్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేయాలని పర్యాటకశాఖ అధికారులను ఆదేశించారు. ఆలయ అభివృద్ధికి అన్నిశాఖల అఽధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. దేవాలయం వద్ద చేపట్టే అభివృద్ధి పనులపై శాఖల వారీగా వారం రోజుల్లో ప్రతిపాదనలను సిద్ధం చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్డీఓ శ్రీనివాసరావు, రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణరావు, అసిస్టెంట్ స్థాపతి గణేశ్, టెంపుల్ డిజైనర్ గోవిందహరి, ఏడీ ఆర్కియాలజీ నాగలక్ష్మి, ఈఓ పురేందర్, డీపీఓ నాగేంద్రం, తహసీల్దార్ మంజుల, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖరరావు, ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వనజారెడ్డి తదితరులు ఉన్నారు.