
పల్లెపల్లెన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం
గద్వాలటౌన్: భారతీయ జనతా పార్టీ బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. గతంలో కంటే ఈసారి భిన్నంగా పార్టీ కార్యకర్తలు వేడుకలు నిర్వహించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని బూత్‌స్థాయిలో పార్టీ జెండాను ఆయా కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యకర్తలు సైతం తమ ఇళ్లపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షుడు రామంజనేయులు ఆవిష్కరించారు. ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై బీజేపీ ఆవిర్భవించిందని చెప్పారు. ఒకేదేశం, ఒకే ప్రజలు, ఒకే మతం కావాలని కోరిన ఘనత తమ పార్టీదేనని పేర్కొన్నారు. మహనీయుల అవిశ్రాంత సేవ, కృషి ఫలితంగానే జనసంఘ్ నుంచి భారతీయ జనతాపార్టీ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేఖ విధానాలు, నయవంచక పాలనపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అప్సర్‌పాష, డీకే స్నిగ్దారెడ్డి, బండల వెంకట్రాములు, రవికుమార్‌ఏక్బోటే, బండల పద్మావతి, జయశ్రీ, సంజీవ్ భరద్వాజ్, వెంకటేశ్వర్‌రెడ్డి, నర్సింహా, దేవదాసు, అనిల్, చిత్తారికిరణ్, మమత తదితరులు పాల్గొన్నారు.