కూలీల రక్షణపై పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

కూలీల రక్షణపై పట్టింపేది?

Mar 29 2025 12:29 AM | Updated on Mar 29 2025 12:31 AM

రాజోళి: ఉపాధి హామీలో పని చేసే కూలీలకు రక్షణ కరువైంది. మండే ఎండలో పని చేసే వారికి చేయాల్సిన రక్షణ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో గ్రామ పంచాయతీలు చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం నుంచి గ్రామాల్లో ఉపాధి పనుల్లో పాల్గొని కుటుంబ పోషణ చేసుకునే వారికి వేసవి కాలం వచ్చిందంటే గాల్లో ప్రాణాలు పెట్టి పనులు చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం నిబంధనల ప్రకారం జాగ్రత్తలు వహిస్తూ పనులు చేయండని చెబుతున్నప్పటికీ, నిర్ధేశించిన పనులను చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలను క్షేత్ర స్థాయిలో కల్పించలేకపోతున్నారు.

వసతుల్లేక ఇబ్బందులు

ప్రస్తుతం పాంపాండ్స్‌, గుట్టల్లో గుంతలు తీయడం, నర్సరీల్లో మొక్కల పనులు జరుగుతున్నాయి. పని చేసే ప్రదేశంలో కూలీలు భోజనం చేయడానికి, అలసటగా ఉన్నప్పుడు సేదతీరడానికి ప్రభుత్వం గుడారాలు పంపిణీ చేసేది. ఏళ్లుగా వాటి పంపిణీ నిలిచింది. కనీసం కొత్త ఆర్థిక సంవత్సరంలోనైనా వాటిని అందిస్తే ప్రయోజనం చేకూరుతోంది. గతంలో మెడికల్‌ కిట్లు పంపిణీ చేసేది. గాయాలపాలైనా, ఒంట్లో నీటిశాతం తగ్గినప్పుడు కనీసం ప్రథమ చికిత్స చేయడానికి కిట్లను పంపిణీ చేయాల్సింది. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్‌, బ్యాండెడ్‌, దూది, అయోడిన్‌ సీసా, కొన్ని రకాల మందులు ఉండేవి తొమ్మిదేళ్లుగా కిట్లను కూడా పంపిణీ చేయడం లేదు. అయితే, ఎండలో ఎక్కువ సేపు పని చేయటం వల్ల కూలీలకు వడదెబ్బ తగిలే ప్రమాదం ముంది. తాగునీరు సక్రమంగా తాగకపోతే నీరసం, డీహైడ్రేషన్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉంటుంది. నీడ సౌకర్యం లేకపోవటంతో కూలీలు శారీరకంగా బలహీనమవుతారు. ఈక్రమంలో కూలీలు తగినంత నీరు తాగుతూ.. శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా చూసుకోవాలని, పని ప్రవేశాల్లో ఓఆర్‌ఎస్‌ ద్రావణం లేదా నిమ్మకాయ నీళ్లుండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, 12 నుంచి 3 గంటల వరకు పనిచేయటం మానుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ముందే అప్రమత్తమవ్వాలి

ప్రమాదాలు జరిగాక రక్షణ చర్యలు, ఆసుపత్రులకు పరుగులు తీసే బదులు ముందుగానే రక్షణ చర్యలు చేపడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎండలో కూలీలు పనులు చేసే దగ్గర కనీసం మెడికల్‌ కిట్లు, టెంట్లు ఉండటం లేదు. తాగునీరు కూడా సక్రమంగా లేదు. గ్రామానికి దూరంలో పని కల్పించినప్పుడు కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.

– విజయ్‌, రాజోళి

ఏర్పాట్లు చేస్తాం

గ్రామ పంచాయతీలకు బాధ్యత ఉన్నప్పటికీ, మా పర్యవేక్షణ నిత్యం ఉంటుంది. గ్రామానికి దూరంగా పనులు జరిగే సమయంలో తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, ఎక్కడ పనులు చేపట్టినా రక్షణ చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా వసతులు లేకపోతే కూలీలు తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత సిబ్బందితో మాట్లాడి వెంటనే చర్యలు చేపడుతున్నాం.

– ప్రసాద్‌, ఏపీఓ, రాజోళి

గ్రామపంచాతీలపైనే..

ఉపాధి కూలీలకు రక్షణ చర్యలు కల్పించాలంటూ గ్రామ పంచాయతీలపైనే ప్రభుత్వాలు భారం వేస్తుండటంతో జీపీలు పూర్తి స్థాయిలో కూలీలకు రక్షణ కల్పించలేకపోతున్నాయి. బడ్జెట్‌ లేమి, నిధుల కొరత కారణంగా ఉపాది కూలీలకు కల్పించాల్సిన వసతుల్లో చాలా వరకు గాలికొదిలేస్తున్నాయి. తరుచూ జిల్లా అధికారుల తనిఖీలు, పనులు ఎక్కువగా జరిగే గ్రామాల్లో వసతుల కల్పన ఉన్నప్పటికీ చాలా గ్రామాల్లో కనీసం రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో కూలీలు ఉసూరుమంటున్నారు. ఉదయమే పనులకు వెళ్లి ఎండ పడకముందే ఇళ్లకు తిరిగి వచ్చేయాలంటూ ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పనులు నిర్ణయించే చోటుకు వెళ్లే సరికే ఎండ పడుతుందని, అక్కడ పని ప్రారంభించేలోగానే ఎండ ముదురుతుందని, అదే ఎండలోనే ఇంటికి రావడం తప్పడం లేదని కూలీలు అంటున్నారు. పనులు చేసి ఇంటికి వచ్చేలోగానే వడదెబ్బలు తగిలి అనారోగ్యానికి గురైన కూలీలు ఎందరో ఉన్నారని, ప్రస్తుతం వేసవి ఆరంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండగా..మున్ముందు ఇంకా ఎక్కువగా ముదిరే అవకాశముందని, దాన్ని దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలని కూలీలు కోరుతున్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు పర్యవేక్షణతో కనీస సౌకర్యాల కల్పన ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మండుటెండల్లో ఉపాధి కూలీల అవస్థలు

క్షేత్ర స్థాయిలో కొరవడిన పర్యవేక్షణ

కనీస సౌకర్యాలు కరువు

రక్షణ చర్యలు గాలికొదిలేసిన అధికారులు

కూలీల రక్షణపై పట్టింపేది? 1
1/1

కూలీల రక్షణపై పట్టింపేది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement