
పొగాకు రైతు పరేషాన్
అకాల వర్షాలకు నల్లబారుతున్న పొగాకు మండెలు
●
న్యాయం చేయాలి
పొగాకు మండలను తిప్పి తిప్పి చేతులు అరిగి పోయాయి. ఎన్నో ఇబ్బందులు పడి పంటను సాగు చేశాం. తీరా పంట విక్రయిద్దామంటే ఆయా కంపెనీలు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు గతంలో రైతులను అడిగి మరి కొనుగోలు చేశారు. ప్రస్తుతం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలతో పంటను కాపాడుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నాం. ఎక్కడ పంట నల్లగా మారుతుందోనని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం, అధికారులు స్పందించి పొగాకు రైతులకు న్యాయం చేయాలి.
– వెంకటేశ్వర్లు, పొగాకు రైతు, ఉండవెల్లి
కుదేలవుతున్నారు..
తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాలలో మాత్రమే పొగాకు పంటను సాగుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రైతు పొగాకు పండించే ముందు మీరు సాగు చేయండి.. మేం కొంటామంటూ నమ్మబలికారు. తీరా పంట చేతికి వచ్చిన సమయంలో కంపెనీ యజమానులు చేతులెత్తేస్తున్నారు. మొత్తంగా పొగాకు సాగు చేసిన రైతు కుదేలవుతున్నారు. జిల్లా అధికారులు రైతుల బాధలు పట్టించుకోవడం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పొగాకు కంపెనీల యజమానులతో మాట్లాడి రైతులకు న్యాయం అందేలా చూడాలి.
– ఈదన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు
ఉండవెల్లి: ఓ వైపు అకాల వర్షాల భయం.. మరోవైపు డిమాండ్ ఉన్న రకాలను మాత్రమే కొంటామంటూ ఆయా కంపెనీల నిర్వాహకులు నిబంధనలు పెడుతుండడం.. మొత్తంగా పొగాకు రైతులు పరేషాన్‌లో పడ్డారు. పొగాకులో 62 రకాలు ఉండగా.. ప్రధానంగా బీడీ, సిగరెట్, చుక్కబర్లి, బర్లి, అడ్–50, కస్తూరికి డిమాండ్ ఎక్కువ. గత ఏడాది పొగాకు పంటకు అధిక ధర పలకడంతో ఈ సారి కూడా లాభాలు వస్తాయని, విస్తారంగా సాగు చేయాలని ఆయా కంపెనీల నిర్వాహకులు సూచించడంతో రైతులు పొగాకులో ప్రధాన రకాలైన సిగిరేట్, బీడిని అధికంగా సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి అందుతుంది. ఈ పరిస్థితుల్లోనే రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. అటు అకాల వర్షాలతో ఎండకు ఆరబెట్టిన పొగాకు మండెలు నల్లబారుతున్నాయి. కొనుగోళ్లు ఆలస్యమైతే మరింత నష్టపోయే అవకాశం ఉందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికితోడు బయటి మార్కెట్‌లో బీడీకి రకానికి మార్కెట్ లేదంటూ కేవలం సిగరెట్ రకాన్ని మాత్రమే కొనుగోలు చేస్తుండడంతో బీడీ రకం పొగాకు సాగు చేసిన రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ఇటీవల బీడి రకాన్ని సాగు చేసిన రైతులు సదరు ప్రైవేట్ కంపెనీ వద్దకు పంట విక్రయించే నిమిత్తం వెళ్లగా.. కంపెనీ వద్దకు రావద్దని తేల్చి చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు.
అకాల వర్షంతో బూజు పడుతోంది..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీడి రకం పొగాకు అధిక మోతాదులో సాగు చేశారు. గద్వాల, అలంపూర్, వనపర్తి, కొల్లాపూర్, నియోజకవర్గాలలోని గ్రామాలకు చెందిన రైతులు పంటను సాగు చేశారు. ఒక్కో నియోజకవర్గంలో 2 వేల ఎకరాలకు పైగా సాగు చేశారు. జోగుళాంబ గద్వాల వ్యాప్తంగా 3500 ఎకరాల్లో పొగాకు పంట సాగు చేయగా.. కేవలం అలంపూర్ నియోజకవర్గంలోనే 2500 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాది పొగాకు క్వింటాకు రూ.14 వేల నుంచి రూ.16 వేల వరకు పలికింది. ఈ ఏడాది వచ్చేసరికి అమాంతం ధర పడిపోయింది. క్వింటా రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు పలుకుతుండడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. రెండు నెలలుగా పొగాకు మండలను దింపడం ప్రారంభించారు. ఇదిలాఉండగా, గత పది రోజులుగా కురుస్తున్న వర్షంతో మండలు నల్లబారి బూజు పడుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
కంపెనీలు ఆశచూపడంతో విస్తారంగా సాగు
తీరా పంట చేతికి వచ్చాక.. ఆ రకానికి మార్కెట్ లేదంటూ వెనుకంజ
దిక్కుతోచని స్థితిలో పొగాకు రైతులు

పొగాకు రైతు పరేషాన్

పొగాకు రైతు పరేషాన్