● ప్రత్యేక ప్రార్థనలకు
ఈద్గాలు ముస్తాబు
● ముగిసిన నెలరోజుల ఉపవాస దీక్షలు
గద్వాలటౌన్: ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొనే రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లోని ప్రార్థనా మందిరాలు ముస్తాబయ్యాయి. నెలరోజుల ఉపవాస దీక్షలు అనంతరం జరుపుకొనే రంజాన్ పర్వదినాన్ని ఎంతో భక్తిశ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా నిర్వహించుకుంటారు. సోమవారం పండుగ నేపథ్యంలో జిల్లా కేంద్రం, అయిజ, అలంపూర్, మానవపాడు, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అన్ని మసీదులు ముస్తాబయ్యాయి. రంగులు వేసి రంగురంగుల విద్యుద్దీపాలంకరణతో ప్రార్థనా మందిరాలను ముస్తాబు చేశారు. జిల్లా కేంద్రంలోని వ్యాపార కేంద్రాలన్నీ జనంతో కిటకిటలాడాయి. సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గద్వాలలో ఏటా రంజాన్ చివరి వారం ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ముఖ్యంగా కూరగాయలు మార్కెట్ చౌరస్తాలో ఉన్న సేమ్యాల దుకాణాల వద్ద రద్దీ కనిపించింది. టోపీలు, అత్తర్ల కొనుగోలు కోసం యువకులు ఉత్సాహం చూపారు. ఫ్యాన్సీ, బ్యాంగిల్‌స్టోర్స్ దుకాణాలు మహిళలు, యువతులతో కిక్కిరిశాయి. చిన్నారులను సైతం ఆకట్టుకునే విధంగా కొత్త తరహా దుస్తులు రంజాన్‌లో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ల దగ్గర రంజాన్ పండగ శోభ కనిపించింది. పండగను పురస్కరించుకొని స్థానిక ఈద్గావద్ద కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. పండగ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.


