గద్వాల క్రైం: ‘‘రానున్నది 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఎండల తీవ్రత సమయంలో ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి. అత్యవసరమైతేనే బయటకు రావాలి. జిల్లాలో ప్రస్తుతం ఎండల తీవ్రత 43 డిగ్రీలు దాటుతోంది. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగడంతో పాటు ఉదయం 10 గంటల నుంచే వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో స్వీయ జాగ్రత్తలే రక్షణ గొడుగుగా నిలుస్తాయి.’’ అని జిల్లా ఇన్‌చార్జి వైద్యారోగ్యశాఖ అధికారి సిద్దప్ప వెల్లడించారు. వేసవిలో మండే ఎండలతో ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉంది. అయితే వడదెబ్బ నుంచి తప్పించుకునేందుకు వైద్యారోగ్యశాఖ చేపడుతున్న చర్యలపై ‘సాక్షి’ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఫోన్–ఇన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలోని 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆస్పత్రి, పల్లె దవాఖానల్లో వడదెబ్బకు గురైన వారికి అవసరమైన మందులు, లక్షకు పైగా ఓఆర్‌ఎస్ పాకెట్లు అందుబాటులో ఉన్నాయని ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ చెప్పారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు.
ప్రశ్న: ఉదయం నుంచే ఎండలు పెరుగుతున్నాయి. స్కూల్ నుంచి వచ్చిన చిన్నారులు ఉక్కపోతకు గురై ఇబ్బందులు పడుతున్నారు.
– శ్రీకాంత్, పాత హౌసింగ్ బోర్డు, గద్వాల
వైద్యాధికారి: సాధారణంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులు వేడిని తట్టుకునే సామర్థ్యం కోల్పోతారు. యూనిఫాం ధరించడం వల్ల వారికి అవసరమయ్యే గాలి చేకూరాదు. పైగా సిల్క్ దుస్తులు కావడం, షూ ధరించడం సమస్యగా ఉంటుంది. అవసరమైన పోషకాహారం, నీరు తీసుకోరు. బయట చిరుతిండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. వేడి గాలుల వల్ల ఉక్కపోతకు గురవుతారు. సిల్క్ దుస్తులు, షూ లాంటి వాటికి విరామం ఇవ్వాలి. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించేలా చూడాలి.
ప్రశ్న: ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
– రాముడు, ఉండవెల్లి
వైద్యాధికారి: ప్రతి ఒక్కరూ తెల్లని కాటన్ దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు నిమ్మ, చెరుకు, పండ్ల రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగాలి. బయటకు వెళ్లే క్రమంలో చలువ అద్దాలు, గొడుగు, తలపాగ, టోపీ ధరించాలి. ఇంట్లో తయారు చేసిన ఆహార పదార్ధాలనే తీసుకోవాలి. అందులో మసాలాలు, నూనె వంటివి తక్కువగా ఉండాలి. ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు, కల్తీ ఐస్‌తో తయారు చేసిన పండ్ల రసాలు తీసుకోవద్దు. శరీరంలో మార్పులు వచ్చినట్లు గమనిస్తే సమీపంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలోని వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే ఓఆర్‌ఎస్, ఐవీ ప్లూయిడ్స్, మందులు తీసుకోవాలి. వైద్యుల సూచనలు పాటించాలి.
ప్రశ్న: వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– ప్రసాద్, రెండవ రైల్వేగేట్, గద్వాల
వైద్యాధికారి: ఎండల తీవ్రత పెరిగినందున ఉదయం 11నుంచి సాయంత్రం 4గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలి. చిన్నారులు, వృద్ధులను చల్లని ప్రదేశాల్లో ఉండాలి. బయటకు వచ్చే క్రమంలో కాటన్ దుస్తులు, గొడుగు లేదా తలపాగ, టోపీ ధరించాలి. బయట మాసాల ఫుడ్, బేకరి ఫుడ్, నూనె వంటి వంటకాల జోలికి వెళ్లరాదు. తేలికపాటి ఆహారం రాగిజావ, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ అందుబాటులో లేని వారు పిడికెడు చక్కెర, చిటికెడు ఉప్పు కలిపిన నీటిని గంటకోసారి తాగాలి.
ప్రశ్న: వ్యవసాయ, కూలీ పనులు చేసే వారు వడదెబ్బ బారిన పడకుండా ఏ జాగ్రత్తలు పాటించాలి? – పరశురాముడు లైఫ్
చేంజ్ సంస్థ నిర్వాహకుడు, గద్వాల
ౖవెద్యాధికారి: కూలీలు, రైతులు వీలైనంత వరకు ఉదయం 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి పనులు చేసుకోవాలి. ఎక్కువగా చెట్ల నీడలో ఉండాలి. ఎండలో ప నులు చేయడం వల్ల శరీరంలో వేడి ఉష్ణోగ్రత లు పెరిగిపోయి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ప్రణాళికలు చేసుకోవాలి. ఉపాఽధి హామీ పనులు చేసే కూలీలకు కలెక్టర్ ఆదేశాల మేరకు వైద్యసిబ్బంది ద్వారా ఓఆర్‌ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాం. వడదెబ్బ తగిలిన వారిని వెంటనే చల్లని ప్రదేశానికి తీసుకెళ్లాలి. అవసరమైతే స మీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలి.
రానున్న రోజుల్లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు
అత్యవసరమైతేనే బయటకు రావాలి
బయటి ఆహారానికి దూరంగా ఉండాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో
వైద్యసేవలకు ప్రత్యేక చర్యలు
‘సాక్షి’ ఫోన్–ఇన్ కార్యక్రమంలో
ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓ సిద్దప్ప
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ