
నల్లమల ప్రాణ వాయువుతో సమానం
మన్ననూర్: నల్లమల ప్రాంతం నాకు ప్రాణ వాయువుతో సమానం అని, ఇక్కడి ప్రజల ప్రేమానురాగాలు నాకు ఎంతగానో ప్రేరణ కలిగిస్తాయని వాగ్గేయకారుడు, ప్రజా గాయకుడు, కాళోజీ పురస్కారం గ్రహీత జయరాజ్ అన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం పదరలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ నల్లమల ప్రాంతం అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబాటుకు గురైందని, అయినప్పటికీ ఇక్కడి ప్రజల్లో రాష్ట్రం నలుమూల గుర్తుండిపోయేంత మంచితనం ఉందని, అందుకే నాకు ఈ ప్రాంతం అన్నా.. ఇక్కడి ప్రజలు అన్నా ఎంతో ఇష్టం అన్నారు. దళిత బహుజనులు అంబేడ్కర్ మార్గంలో పయనిస్తూ.. ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని తీసేసి తిరిగి రాచరికాన్ని తీసుకువచ్చే కుట్ర జరుగుతుందన్నారు. అంబేడ్కర్ వారసులమైన మనం అగ్రకుల భావాజాలాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య దేశంలో చదువుకు ఉన్న విలువ మరొక దానికి లేదని గమనించి తమ పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా ప్రతిఒక్కరు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉస్మానియా ప్రొఫెసర్ గడుదాస్ వెంకటేశ్వర్లు, కళాకారుడు జక్కా గోపాల్, నాయకులు సత్యనారాయణ, రామలింగం, చిన్న చంద్రయ్య, వెంకటయ్య, ప్రవీణ్‌కుమార్, రాయుడు, బాలింగం, బాలాకుమార్, రవి తదితరులు పాల్గొన్నారు.