
‘ర్యాలంపాడు’ లీకేజీల పరిశీలన
ధరూరు: నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు ఏర్పడిన లీకేజీలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్ పూణెకు చెందిన నిపుణుల బృందం గురువారం పరిశీలించింది. ఉదయం11.30 గంటలకు రిజర్వాయర్ వద్దకు చేరుకున్న డాక్టర్ సంజీవ్ బరేలే, సునీల్ పిల్‌లై (కేరళ), కే. నర్సయ్య (ఏపీ కాకినాడ), మందిర ముజుకుదార్, తనుశ్రీ సమంత తదితరుల బృందం సభ్యులు దాదాపు 3 గంటల పాటు ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా ఎడమ కాల్వ వద్ద నీటి లెవెల్స్, ప్రాజెక్టు బండ్ అండ్ గ్రౌండ్ లెవెల్‌లను పరిశీలించారు. ఇరిగేషన్ ఎస్‌ఈ రహీముద్దీన్‌తో పలు విషయాలు ఆరా తీశారు. ప్రాజెక్టు డిజైన్ మ్యాప్స్, ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎలాంటి మెటీరియల్ వాడారు, ప్రాజెక్టు డిజైన్‌ను ఏ సంస్థ చేపట్టింది, ముందుగా సమస్య ఎక్కడ ఏర్పడింది అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం ఎంత, లీకేజీల తరువాత ఎంత మేర నీటిని నిల్వ చేస్తున్నారనే దానిపై ఆరా తీశారు. అక్కడి నుంచి లీకేజీలు ఏర్పడిన మూడు ప్రాంతాలను బండ్ ప్రాంతాలకు వెళ్లి క్షేత్ర స్థాయి పరిశీలించారు. ప్రస్తుతం ర్యాలంపాడు రిజర్వాయర్‌లో నీటి లెవెల్ కేవలం 0.2 టీఎంసీలు మాత్రమే ఉండడంతో లీకేజీ ప్రాంతాల వద్ద ఊట లేకపోవడంపై చర్చించారు. ప్రాజెక్టుపై భాగంలో ఎలాంటి సమస్య లేదని, కేవలం తగ్గు ప్రాంతాల వద్ద మాత్రమే లీకేజీ సమస్య వచ్చినట్లు గుర్తించామని బృందం సభ్యులు తెలియజేశారు. లీకేజీలు ఏర్పడటానికి గల కారణాలను అధ్యయనం చేసందుకు ఇక్కడి నుంచి కొంత మెటీరియల్‌ను తీసుకు వెళ్లి టెస్టులు నిర్వహించి త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను సంబంధిత సీఈకి అందిస్తామని బృందం సభ్యులు తెలియజేశారు. రిజర్వాయర్ ప్రధాన కాలువల వెంట చేపట్టాల్సిన పనులపై ఎస్‌ఈకి వివరించారు. ఈ ప్రాజెక్టు పరిదిలోని మిగతా రిజర్వాయర్ల గూర్చి అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నోనిపల్లి రిజర్వాయర్ వద్దకు వెళ్లారు.