
ముచ్చటగా మూడుసార్లు ప్రారంభం
ఒక్క కొనుగోలు కేంద్రాన్ని అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పోటాపోటీగా మూడు సార్లు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కొండేరులో వరి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే విజయుడు ప్రారంబించారు. అయితే ఈ కొనుగోలు కేంద్రాన్ని ఈ నెల 15న మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులు మొదటి సారి ప్రారంభించారు. బుధవారం ఉదయం అలంపూర్ మార్కెట్‌యార్డు చైర్మెన్ దొడ్డెప్ప రెండవసారి ప్రారంభించారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే స్థానిక ఎమ్మెల్యే విజయుడు ముచ్చటగా మూడోసారి ప్రారంభించడం గమనార్హం. దీనిపై ఏపిఎం కుర్మయ్యను వివరణ కోరగా.. మొదటిసారి బీఆర్‌ఎస్ నాయకులు తమకు సమాచారం లేకుండానే ప్రారంభించారని, రెండవసారి ప్రారంభానికి వచ్చిన అలంపూర్ మార్కెట్‌యార్డు చైర్మన్ దొడ్డెప్పకు ఎమ్మెల్యే వస్తున్నారన్న విషయాన్ని చెప్పామన్నారు. గంట వ్యవధిలోనే మూడోసారి ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం ప్రారంభించారని తెలిపారు.