
ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి
మానవపాడు: మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని.. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అధికారి గంట కవిత సూచించారు. సోమవారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో భవిష్య భారత్ ఎస్‌బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో మద్యం, సిగరెట్, గుట్కా, సారా వంటి వ్యసనాలను నియంత్రించాలని అన్నారు. బాల్యవివాహాలపై గ్రామస్థాయిలో ప్రజలకు ఆశ వర్కర్లు అవగాహన కల్పించాలని, వాటి వలన కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, అది చెడిపోతే కుటుంబం నాశనం అవుతుందని పేర్కొన్నారు. దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేది ఒక్క వైద్యులు, వైద్య సిబ్బందికేనని, ఆశ కార్యకర్తలు ఆరోగ్య సైనికులని, గ్రామాల్లో ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్యంపై, వ్యాసనాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత మీపై ఉందని అన్నారు. అనంతరం జడ్జితోపాటు ప్రాజెక్ట్ మేనేజర్ నాగరాజు క్షయ వ్యాధికి సంబందించి పలువురికి ఆరోగ్య, పోషకకిట్లను అందించారు. ఎస్‌బీఐ భవిష్య అంబులెన్స్ సేవలను గురించి, బ్లడ్ పరీక్షలు, దీర్ఘకాలిక వ్యాధులు వెంటనే పరీక్షలు వివరలను రోగులకు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా టీబీ అధికారి రాజు, నోడల్ అఫీసర్ సాధిక్, డాక్టర్ హేమమానస, సూపర్‌వైజర్ చంద్రన్న తదితరులు పాల్గొన్నారు.