
వేరుశనగ క్వింటా రూ.6,289
గద్వాల వ్యవసాయం: గద్వాల మార్కెట్‌యార్డుకు శుక్రవారం 765 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6289, కనిష్టం రూ.3459, సరాసరి రూ.5313 ధరలు పలికాయి. అలాగే, 21 క్వింటాళ్ల కంది రాగా గరిష్టం రూ. 6509, కనిష్టం రూ. 6226, సరాసరి రూ. 6419 ధరలు వచ్చాయి. 98 క్వింటాళ్ల ఆముదాలు రాగా గరిష్టం రూ. 6021, కనిష్టం రూ. 5201, సరాసరి రూ. 6001 ధరలు పలికాయి. 787 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టం రూ.2062, కనిష్టం రూ. 1709, సరాసరి రూ.2009 ధరలు లభించాయి.
ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంగా భవానీప్రసాద్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎం(ఎం)గా ఎస్.భవానీప్రసాద్ బదిలీపై వచ్చారు. ఖమ్మం రీజియన్‌లో డిప్యూటీ ఆర్‌ఎంగా పనిచేస్తున్న ఈయన ఇటీవల బదిలీపై ఇక్కడికి వచ్చి బాధ్యతలు చేపట్టారు. డిప్యూటీ ఆర్‌ఎం(ఎం)గా పనిచేసిన శ్యామల హైదరాబాద్‌లోని మియాపూర్‌కు బదిలీపై వెళ్లారు.
ముగిసిన జాబ్‌మేళా
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాబ్‌మేళాకు 380 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొదటిరోజు గురువారం టీఎస్‌కేసీ, సైంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఇందులో లెన్స్‌కార్, ట్రెండ్జ్ ఐటీ, గ్రావిటీ, అన్నపూర్ణ ఫైనాన్స్, ఫ్యూచర్ ప్రాపర్టీ, ఎంపవర్మెంట్, ధ్రువంత్, హెచ్‌ఆర్‌హెచ్ నెక్ట్స్ తదితర కంపెనీలు పాల్గొన్నాయి. మొత్తం 300 మంది ఉద్యోగార్థులు రాగా వంద మందిని ఎంపిక చేశారు. అలాగే శుక్రవారం ఐసీఐసీఐ బ్యాంకు అధికారులు నిర్వహించగా 80 మంది పాల్గొంటే 20 మందిని ఎంపిక చేశారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి అవకాశాలు మరిన్ని వస్తాయని, అందరూ ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఐక్యూసీ కో–ఆర్డినేటర్ డా.జె.శ్రీదేవి, టీఎస్‌కేసీ కో–ఆర్డినేటర్ డా.హరిబాబు, మెంటర్ పి.స్వరూప, సైంట్, టీఎంఐ ప్రాజెక్టు మేనేజర్ వికాస్, ఐసీఐసీఐ బ్యాంకు హెచ్‌ఆర్ కిరణ్ పాల్గొన్నారు.
రామయ్యకు ఏకాంత సేవ
చారకొండ: మండలంలోని సిర్సనగండ్ల సీతారామచంద్రస్వామికి శుక్రవారం రాత్రి పల్లకీసేవ, చక్రతీర్థం, ఏకాంతసేవ, ద్వాదశ ఆరాధన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకం, అర్చనాథులు, శివదత్తాత్రేయ, పరశురామ, ముక్కిడిపోచమ్మ ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రామశర్మ, ఈఓ ఆంజనేయులు, మేనేజర్ నిరంజన్, అర్చకులు మురళీధర్‌శర్మ, లక్ష్మణ్, గోపి, వేణు, ఆనంద్, భాస్కర్, ప్రవీణ్, భక్తులు పాల్గొన్నారు.
కనులపండువగా
పంబ ఆరట్టు
వనపర్తిటౌన్: అయ్యప్ప జన్మదినం సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో పంబ ఆరట్టు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తికి శాస్త్రోక్తంగా పూజాధికాలు నిర్వహించి పంబ ఆరట్టులో భాగంగా పవిత్ర జలాలతో చక్రస్నానం చేయించారు. భక్తుల శరణుఘోషతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. చక్రస్నానం అనంతరం మేళతాళాలు, వాయిద్యాలతో స్వామివారిని ఆలయ ప్రాంగణంలోకి తీసుకొచ్చి పల్లకీసేవ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ప్రారంభమై లక్ష్మీ గణపతి హోమం, మూల విగ్రహానికి ఆలయ ప్రధాన అర్చకుడు రమేష్‌శర్మ అభిషేకాలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉత్సవమూర్తికి 3 గంటల పాటు అభిషేకాలు నిర్వహించారు. తర్వాత ఆలయంలోని మూలమూర్తికి సహస్ర నామార్చన, మహా మంగళహారతి, భక్తులకు అన్నదానం చేశారు. ఆయా కార్యక్రమాలు తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

వేరుశనగ క్వింటా రూ.6,289

వేరుశనగ క్వింటా రూ.6,289