పంటలు ఎండుతున్నా పట్టించుకోని ప్రభుత్వం
కేటీదొడ్డి: రాష్ట్రంలో పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతునాయుడు ఆధ్వర్యంలో బుధవారం మండలంలోని కొండాపురం, వెంకటాపురం, గువ్వలదిన్నె, ఉమిత్యాల గ్రామాలలో ర్యాలంపాడు రిజర్వాయర్ 104 ప్యాకేజీ కాల్వ ద్వారా నీరందక పంటలు ఎండగా.. వరి పంటలను ఆయన పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం కలెక్టర్ సంతోష్, ఇరిగేషన్ ఎస్‌ఈ రహీముద్దీన్‌కు పోన్ చేసి సాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. విలేకర్లతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దోచుకోవడం.. దాచుకోవడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకున్నదని, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి పాటుపడింది శూన్యమన్నారు. జూరాల, నెట్టెంపాడు, రిజర్వాయర్ ఆయకట్టు కింద సాగునీరందకపోవడంతో పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదని విమర్శించారు. యాసంగి సాగుకు ముందు ప్రభుత్వం ఐఏబీ సమావేశం నిర్వహించకుండా పంటల ప్రణాళిక రూపొందిందని అన్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని అయినా సీఎం రేవంత్‌రెడ్డి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఓ వైపు పంటలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుంటే వారిని పరామర్శించడానికి కూడా మంత్రులు, స్ధానిక ప్రజాప్రతినిధులకు తీరిక లేదని ఎద్దేవా చేశారు. పదేళ్లలోపు ఎప్పుడు కూడా రైతుల పంటలు ఎండకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాపాడితే ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి పంటలు ఎండడానికి కారణమయ్యాడని ఆరోపించారు. రాప్ట్రంలో ఇప్పటి వరకు 448 మంది అన్నదాతలు ప్రభుత్వ నిర్వాకం వల్ల బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి, మోనేష్, అంగడి బస్వరాజ్, వెంకటేష్ నాయుడు, ఎస్ రాము, తిరుమలేష్, కామేష్, తదితరులు ఉన్నారు.


