జోగులాంబ: ఆలస్యంగానైనా వర్షాలు సమృద్ధిగా కురవడంతో జిల్లాలో పంటల సాగుకు ఆశాజనకమైందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం ఐడీవోసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ఏడాది జూన్‌లో సాధారణ వర్షపాతం కంటే 23శాతం తక్కువగా వర్షపాతం నమోదైందన్నారు. అయితే జూలైలో జిల్లా వ్యాప్తంగా 73.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు 52.8 మి.మీ. నమోదైందన్నారు.
ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆశాజనకంగా ఉండడంతో వానాకాలం పంటల సాగుకు ఇబ్బందులు లేవన్నారు. రైతులందరు కూడా వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మేరకు పంటలను సాగుచేసుకోవాలన్నారు. గతేడాది వానాకాలంలో జిల్లా వ్యాప్తంగా 4,01,764 ఎకరాలలో వివిధ పంటలు సాగు చేయగా, అదే ఏడాది జూలైలో 1.75లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగయ్యాయన్నారు. ఈ ఏడాది జూలై 20వ తేదీ నాటికి కేవలం 83,041ఎకరాలలో మాత్రమే వివిధ రకాల పంటలను సాగుచేశారన్నారు.
ఆలస్యంగా వర్షాలు కురవడంతోనే పంటలు సాగు ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో రైతులకు ఇబ్బందులు తొలగాయని వరి, మిరప, మొక్కజొన్న, రాగి, కొర్ర, వేరుశనగ, ఆముదాలు, పొద్దుతిరుగుడు, కందులు వంటి పంటలు సాగుచేసేందుకు అనుకూలంగా ఉంటాయన్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు వరి, ఆముదం, రాగి, కొర్ర, పొద్దుతిరుగుడు, మిర్చి పంటలు వేసుకోవచ్చన్నారు.
నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
జిల్లా వ్యాప్తంగా నష్టపోయిన సీడుపత్తి పంట సాగుచేసిన రైతులకు సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత దానిని ప్రభుత్వానికి పంపి నష్టపోయిన రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే దీనిపై సీడుపత్తి కంపెనీలు, రైతులు, అధికారులతో సమీక్షించినట్లు వివరించారు.
అప్రమత్తంగా ఉండాలి
ముసురు వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ పేర్కొన్నారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లలో నివాసం ఉండరాదని, దీనిపై ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు.
అదేవిధంగా పిడుగుపాటుకు గురి కాకుండా ప్రజలు బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద, నీటికుంటలకు దూరంగా ఉండాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. సమావేశంలో డీఏఓ గోవిందునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై విస్తృత ప్రచారం
ఎలక్ట్రానిక్ ఓటింగ్‌పై ప్రజలకు విస్తృతమైన ప్రచారం కల్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈవీఎం యంత్రాలలో పదిశాతం యంత్రాలను వీవీ ప్యాట్లను సిబ్బంది శిక్షణ, ఓటర్లలో అవగాహన కార్యక్రమాల కోసం వినియోగించనున్నట్లు తెలిపారు.
ఓటు ప్రతిఒక్కరి హక్కు అని, తప్పకుండా వినియోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఈమేరకు జిల్లాలోని గద్వాల, అలంపూరు తహసీల్దార్ కార్యాలయాలు, గద్వాల ఆర్డీవో కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో యంత్ర ప్రదర్శన కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ వరలక్ష్మి సురేష్, రఘు, డీటీ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment