
వైద్యుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్లకు పెంపు: మోదీ
ప్రభుత్వ వైద్యుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచుతామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. తన ప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. వైద్యులు ఏడాదికి 12 రోజులు పేద గర్భిణులకు ఉచితంగా సేవలు అందించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.
''ప్రధానమంత్రిని కాను.. ప్రధాన సేవకుడినని, అలాగే పనిచేస్తానని, 125 కోట్ల మంది భారతీయులకు సేవ చేసేందుకు నిరంతరం కృషిచేస్తానని ఎర్రకోట నుంచే చెప్పాను. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి.. ఎన్నికలు జరుగుతాయి.. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేది ప్రజల కలలు సాకారం చేయడానికే. గత రెండేళ్లలో మా పనితీరు ఎలా ఉందో అందరూ చూశారు. నా ప్రభుత్వం ఈ దేశంలోని పేదలకు అంకితం అని నా మొదటి ప్రసంగంలోనే చెప్పాను. పేదలకు పేదరికం మీద పోరాడే శక్తి ఇచ్చే పథకాల మీదే ఈ రెండేళ్లు దృష్టిపెట్టాను. తమ పిల్లలకు వారసత్వంగా పేదరికం ఇవ్వాలని ఏ తల్లిదండ్రులూ అనుకోరు. రెండేళ్ల ముందు దేశం ఎలా ఉండేదో గుర్తు చేసుకోండి. ప్రతి రోజూ ఒక కొత్త స్కాం బయటపడేది.. పెద్దపెద్దవాళ్లు స్కాముల్లో మునిగిపోయారని, వేల కోట్లాది రూపాయలు దోచుకున్నారని కథనాలు వచ్చేవి. అసలు ప్రజల సొమ్ము దోచుకోడానికే కుర్చీలో కూర్చోబెడతారా? ఈ దోపిడీని అరికడతానని అప్పుడే చెప్పాను. ఇప్పటికి రెండేళ్లయింది.. ఈ రెండేళ్ల కాలంలో మోదీ సర్కారు ఒక్క రూపాయి తిన్నట్లు ఏమైనా ఆరోపణలొచ్చాయా.. మా ప్రత్యర్థులు ఏమైనా ఆరోపించారా, పత్రికల్లో, టీవీలలో ఏవైనా కథనాలొచ్చాయా? లక్షల మంది మధ్య నిల్చుని ప్రజలను తమ లెక్కలు అడిగే ధైర్యం ఇన్నాళ్ల బట్టి ఎవరికీ లేకపోయింది.
గ్యాస్ సిలిండర్లు కేవలం ధనవంతులకు మాత్రమే అందే పరిస్థితులుండేవి. పేదలకు గ్యాస్ పొయ్యి కలలో కూడా కనిపించేది కాదు. ఏం.. కట్టెల పొయ్యి మీదే వంట చేసి పేదలు చచ్చిపోవాలా? నా దేశ ప్రజలు నిజాయితీపరులు కాబట్టే నాకు పనిచేసే శక్తి వచ్చింది. ఎవరైనా గ్యాస్ సిలిండర్ల మీద సబ్సిడీ వదులుకోగలిగితే వదలాలని కోరాను.. కోటిమందికి పైగా ముందుకొచ్చారు.. ఇది చిన్న నిర్ణయం కాదు. వాళ్లు అందించిన ఈ శక్తితో.. రాబోయే మూడేళ్లలో 5 కోట్ల కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇస్తానని చెబుతున్నాను. కట్టెల పొయ్యి ఉన్నచోటల్లా గ్యాస్ పొయ్యిలు అందిస్తాం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద నిర్ణయం ఎప్పుడూ తీసుకోలేదు
మీరే చెప్పండి.. ప్రభుత్వం సమాజం గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు సమాజంలో పురుషుల కంటే మహిళల సంఖ్య తక్కువగా ఉంది. ఎందుకంటే, ఆడపిల్లలను తల్లి గర్భంలోనే చిదిమేస్తున్నారు. 1000 మంది అబ్బాయిలు పుడుతున్నపుడు 1000 మంది అమ్మాయిలు పుట్టకపోతే పరిస్థితి ఏంటి? అందుకే బేటీ బచావ్, బేటీ పఢావ్ అని పిలుపునిచ్చాం. ఇన్నాళ్ల బట్టి ఓటు బ్యాంకుల కోసమే అన్ని పథకాలు పెట్టారు. నాకు జాతి మత భేదాలు లేవు.. ప్రజలే నా కుటుంబం. 125 కోట్ల మంది కోసమే పథకాలు సిద్ధం చేశాం'' అని ఆయన అన్నారు.