గిద్దలూరు, న్యూస్‌లైన్: నిరుపేదలకు ఉచితంగా మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారు. గిద్దలూరు ఏరియా వైద్యశాలలో ఈ దందా మరీ ఎక్కువైంది. కాన్పు కోసం వచ్చిన వారికి ఆపరేషన్ చేస్తే రూ. 3 వేలు ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇవ్వని వారిని వేధిస్తున్నారు. గర్భిణులు కాన్పులు చేయించుకునేందుకు వైద్యశాలకు వస్తే వారి వద్ద నుంచి వైద్యశాల మరమ్మతులంటూ డొనేషన్ల రూపంలో నగదు వసూలు చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. రాచర్ల మండలం చినగానిపల్లెకు చెందిన నర్ల వెంకటేశ్వరరెడ్డి తన భార్య సుజాతను ఈనెల 6న కాన్పు చేయించేందుకు గిద్దలూరు ఏరియా వైద్యశాలకు తీసుకొచ్చాడు. అక్కడ సాధారణ కాన్పు కాకపోవడంతో వైద్యుడు సూరిబాబు ఆపరేషన్ చేశారు. ఆ వెంటనే డాక్టర్ సాయి ప్రశాంతి కుటుంబ సంక్షేమ ఆపరేషన్ చేశారు. బుధవారం సుజాతను వైద్యశాల నుంచి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు.
ఇంటికెళ్లేందుకు సిద్ధమైన ఆమె స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ కోసం వైద్యుల వద్దకు వెళ్లగా, అందుకు వారు రూ. 3 వేలు ఇవ్వాలని చెప్పడంతో కంగుతింది. ఎందుకివ్వాలని ఆమె బంధువులు ప్రశ్నిస్తే డాక్టర్ గారికి స్టెతస్కోప్ కొనుగోలు చేయాలని సిబ్బంది చెప్పడం విశేషం. ఆపరేషన్ చేసే ముందు సిబ్బందికి ఎగ్‌పఫ్, స్ప్రైట్, 5 లీటర్ల డీజల్ తీసుకురావాలని వైద్యులు చెప్పడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇచ్చామని బాధితుడు వెంకటేశ్వరరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపాడు. నగదు ఇచ్చేందుకు తమ వద్ద ఏమీ లేదని చెప్పడంతో స్టెరిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వకుండా మధ్యాహ్నం వరకు ఉంచుకుని వారం తర్వాత రావాలని చెప్పి పంపారని బాధితులు తెలిపారు.
ఈ సమస్య ఒక్క వెంకటేశ్వరరెడ్డి దంపతులదే కాదు..ఇక్కడికి వైద్యం కోసం వచ్చే ప్రతి ఒక్కరిదీ ఇదే పరిస్థితి. వైద్యశాలలో రోజూ తమ నుంచి నగదు వసూలు చేస్తున్నట్లు రోగులు చెబుతున్నారు. గిద్దలూరు ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఆస్పత్రిలో డెలివరీ చేయించుకుంది. ఇక్కడ పనిచేస్తున్న స్వీపర్ ఒకరు రూ. 200 అడిగితే ఇవ్వలేదని ఆమెకు లేని రోగం ఉందని అందరికీ చెప్పింది. దీంతో ఆ మహిళ నాలుగు రోజులుగా ఏడుస్తూ కాలం వెళ్లదీస్తోంది. పేదల కోసం నిర్మించిన వైద్యశాలలో ఇలా నగదు దండుకోవడం ఎంతవరకు సమంజసమని రోగులు ప్రశ్నిస్తున్నారు.
అత్యవసరం కోసం డీజిల్ తెప్పించాం...
స్థానిక వైద్యశాల సూపరింటెండెంట్ సూరిబాబును నగదు వసూళ్ల గురించి ప్రశ్నించగా వైద్యశాలకు నిధుల కొరత ఉండటంతో అత్యవసరం కోసం డీజిల్ తెప్పించుకుంటున్నామని, నగదు తీసుకోవడం లేదని చెప్పారు. వైద్యవిధాన పరిషత్ సమన్వయకర్త దుర్గాప్రసాద్‌ను వివరణ కోరగా లేని రోగం ఉన్నట్లు చెప్పిన స్వీపర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలిపారు. వైద్యులు నగదు వసూలు గురించి తెలుపగా, బాధితుల నుంచి ఫిర్యాదు అందితే సంబంధిత వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కాసులిస్తేనే..కాన్పు
Published Thu, Nov 14 2013 4:03 AM | Last Updated on Sat, Sep 2 2017 12:34 AM
Advertisement
Advertisement