ప్రభుత్వ వైద్యుల ఆందోళన (ఫైల్)
ప్రభుత్వ వైద్యులు ఎట్టకేలకువెనక్కుతగ్గారు. వారంరోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీరిపై ప్రభుత్వం ఎస్మా చట్టం ప్రయోగించేందుకుసిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా సమ్మెనువిరమించారు. సమ్మెకుదిగిన వైద్యులంతా శుక్రవారం విధులకు హాజరుకావడంతో రోగులకు కొంత ఊరటలభించింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్యుల పోస్టులను పెంచాలని, విద్యార్హతకు సమానంగా వేతనాలు చెల్లించాలని, వైద్య విద్యలో పీజీకి ప్రభుత్వ డాక్టర్లకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని, పీజీ వైద్య విద్యార్థులకు నియామక ఇంటర్వ్యూలు నిర్వహించాలని, కేంద్ర ప్రభుత్వ వైద్యులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వ వైద్యులు కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. నల్ల బ్యాడ్జీలు ధరించడం, రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తూ వచ్చారు.
తమిళనాడు ప్రభుత్వ డాక్టర్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులతో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్, కార్యదర్శి, ఉన్నతాధికారులు గతంలో అనేకసార్లు చర్చలు జరిపారు. ఆరు వారాల్లోగా డిమాండ్లను నెరవేరుస్తామని అప్పట్లో మంత్రి విజయభాస్కర్ సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. రోజులుగడుస్తున్నా హామీల అమలును ప్రభుత్వం దాటవేయడంతో అక్టోబర్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వానికి ముందుగానే సమాచారం ఇచ్చారు. ప్రభుత్వంలో కదలిక లేకపోవడంతో గత నెల 25వ తేదీన వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు. సుమారు 15 వేల మంది వైద్యుల సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా వైద్యసేవలు స్తంభించిపోయాయి.
సాధారణ చికిత్సతోపాటు అత్యవసర విభాగం వైద్యులు సైతం సమ్మెకు దిగడంతో రోగులు తీవ్ర ఇబ్బందులకులోనయ్యారు. గురువారం ఉదయం చెన్నై జీహెచ్ వద్దకు పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి ప్రాంగణంలోని వైద్యులను సమ్మె విరమించాల్సిందిగా కోరారు. సమ్మెకు మద్దతుగా బయటి ప్రాంతాల నుంచి వస్తున్నవారిని అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా వైద్యులు నినాదాలు చేశారు. సమ్మెను తీవ్రం చేయడంలో భాగంగా హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు సమ్మెలో పాల్గొనేలా చేశారు. ప్రభుత్వం, వైద్యుల సంఘం ఎవరికివారు పంతాలకు పోవడంతో సమస్య జఠిలంగా మారింది.
ఈ దశలో వైద్యులచేత సమ్మె విరమింపజేసేందుకు ప్రభుత్వం చొరవచూపేలా ఆదేశించాలని సూర్యప్రకాశం అనే న్యాయవాది గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి డాక్టర్ విజయభాస్కర్ జరిపిన చర్చలు విఫలం కావడంతో క్రమశిక్షణ కొరడా ఝుళిపించేందుకు సిద్ధమైనారు. సమ్మెలో ఉన్న సుమారు 50 మంది వైద్యులను గురువారం ఆకస్మిక బదిలీ చేశారు. సమ్మె విరమించి విధుల్లో చేరకుంటే ఎస్మా చట్టం కింద డిస్మిస్ చేసి, వారి స్థానంలో కొత్తవారిని రిక్రూట్ చేసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు.
ఈ పరిణామంతో భీతిల్లిన 2,160 మంది సాయంత్రానికి విధుల్లో చేరారు. శుక్రవారం ఉదయం విధుల్లో చేరని వైద్యుల స్థానాలను ఖాళీలుగా ప్రకటించి కొత్తవారితో భర్తీ చేస్తామని మంత్రి మరోసారి హెచ్చరించారు. అంతేగాక 188 కొత్త డాక్టర్లకు శుక్రవారం నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి బీలా రాజేష్ సర్వం సిద్ధం చేసుకున్నారు. వైద్యులు సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించి సమ్మె విరమిస్తే చర్యలకు సిద్ధమని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడువు విధించారు. ఈ పరిణామాలతో దిగొచ్చిన వైద్యుల సంఘం ప్రతినిధులు సమ్మెను తాత్కాలికంగా విరమించి విధుల్లో చేరుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు.
వైద్యులకు ధన్యవాదాలు :మంత్రి విజయభాస్కర్
ప్రభుత్వ విన్నపాన్ని మన్నించి సమ్మెను విరమించిన వైద్యులకు ధన్యవాదాలని మంత్రి విజయభాస్కర్ అన్నారు. మీడియాతో శుక్రవారం మాట్లాడుతూ, సమ్మెను విరమించినందున ఇప్పటి వరకున్న వైద్యుల సర్వీసును రద్దు (బ్రేక్ ఇన్ సర్వీస్)చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment