రవాణా సమ్మె బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. బస్సుల సౌకర్యం లేకపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా, కోర్టు కొరడా ఝుళిపించినా సమ్మెకారులు ఎంతకూ పట్టువీడడం లేదు. అలాగే ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. గురువారం తప్పనిసరిగా విధుల్లో చేరాలని మద్రాసు హైకోర్టు ఉద్యో గులకు బుధవారం సాయంత్రం అల్టిమేటం ఇచ్చింది.
సాక్షి, చెన్నై: నెలసరి వేతనాన్ని 2.57 శాతం పెంచాలని, జీతంలో మినహాయించుకున్న రూ.7వేల కోట్ల పీఎఫ్ మొత్తాన్ని విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికులు తలపెట్టిన సమ్మె బుధవారానికి ఏడోరోజుకు చేరుకుంది. సిటీ బస్సుల్లో ప్రయాణానికి బాగా అలవాటుపడిన ప్రజలు వారంరోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రయివేటు వాహనాల దోపిడీకి గురవుతున్నారు. లోకల్ రైళ్ల బోగీల కిటీకీ ఊచలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో మరింత ఒత్తిడి తేవడంలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు మంగళవారం తమ భార్య, పిల్లలను సైతం వెంటపెట్టుకుని వచ్చి ఆందోళనలు సాగించారు.
సమ్మెపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించినా కార్మికులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కోర్కెలు నెరవేరేవరకు సమ్మె విరమించబోమని కార్మిక సంఘాల నాయకులు పునరుద్ఘాటించారు. బస్సులు, కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రమాదానికి దారితీస్తున్నాయి. బుధవారం సైతం అనేక సంఘటనలను చోటుచేసుకున్నాయి. తిరుప్పూరు–తిరుమంగళం రోడ్డులో ప్రభుత్వ బస్సు తాత్కాలిక డ్రైవర్ కారుపైకి ఎక్కించాడు. ఊటీ సమీపంలో ఒక బస్సు ఇంటిపైకి దూసుకెళ్లింది.
తాత్కాలిక డ్రైవర్ల కారణంగా ఈ వారం రోజుల్లో ఐదుగురు బలయ్యారు. కొందరు డ్రైవర్లు రెండుచేతులతో గేర్లను మారుస్తూ ప్రయాణికులను భయపెడుతున్నారు. అసలే డొక్కు బస్సులు, ఆపై అనుభవం లేని డ్రైవర్లు ప్రమాదాలకు కారణంగా మారింది. విధుల్లో చేరాలంటూ కార్మికుల ఇళ్లకు వెళ్లి మరీ కొందరు బెదిరిస్తున్నారు. కరూరు జిల్లాలో డ్రైవర్ ఇంట్లోకి చొరబడిన ఒక పోలీసు కానిస్టేబుల్ బెదిరింపులకు గురిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రవాణా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసినా సమ్మెకారులు వినిపించుకోలేదు. 60 వేల మందికి నోటీసులు, 63 మందికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సమ్మెకు బలైన ముగ్గురు కార్మికులు:
వారంరోజులుగా సాగుతున్న రవాణా సమ్మె ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు గుండెపోటుతో మరణించారు. మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన సెల్వం (55) అదే ఊరిలోని బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె ప్రారంభం కాగానే భార్య పిల్లలను ఉసిలంపట్టిలోనే ఉంచి తాను దిండుగల్లు జిల్లా వత్తలగుండులోని తన స్నేహితుని ఇంట్లో ఉంటున్నాడు. యథాప్రకారం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మెలో పాల్గొని సమీపంలోని ఒక తోటలో నిద్రించాడు. అదే రోజురాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
అలాగే తిరునెల్వేలి జిల్లా సెంగొట్టైకి చెందిన గణేశన్ (50) అనే డ్రైవర్ సమ్మె గురించి తన తోటి కార్మికులకు చెప్పుకుని బాధపడేవాడు. మంగళవారం సాయంత్రం ఒక తోటలో అతను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగం నుంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగిస్తుందని కొందరు ప్రచారం చేయడంతో ఈరోడ్ జిల్లాకు చెందిన దేవరాజ్ (45) అనే డ్రైవర్ గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచాడు.
Comments
Please login to add a commentAdd a comment