Transport workers
-
కోత పడింది!
రవాణా సంస్థ ఉద్యోగ, కార్మికులకు షాక్ ఇచ్చే నిర్ణయాన్ని ఆ సంస్థ యాజమాన్యం బుధవారం తీసుకుంది. సమ్మె కాలాన్ని సెలవు దినంగా పరిగణించి ఏడు రోజుల జీతంలో కోత విధిస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదానికి దారి తీసింది. కోర్టును ఆశ్రయించడమా లేదా మళ్లీ మెరుపు సమ్మెకు దిగడమా అన్న నిర్ణయం తీసుకునేందుకు గురువారం కార్మిక సంఘాలు సమావేశం అవుతున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో లక్షన్నర మంది ఉద్యోగ, కార్మికులు ఉన్నారు. తమ డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే మూడుసార్లు సమ్మె బాటను అనుసరించారు. పాలకుల్లో స్పందన లేని దృష్ట్యా, గత నెల జనవరి ఐదో తేదీ నుంచి మెరుపు సమ్మెకు కార్మికులు దిగారు. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగాయి. ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు తప్పలేదు. రవాణా సంస్థకు కోట్లాది రూపాయల మేరకు నష్టం తప్పలేదు. ఈ సమయంలో సమ్మె కాలంలో పలువురు కార్మిక నేతలకు, వారి మద్దతుదారులకు శాఖా పరమైన నోటీసులు జారీ అయ్యాయి. చర్యలు తప్పదన్నట్టుగా హెచ్చరికలు వెళ్లాయి. అ సమయంలో సంక్రాంతి పర్వదినం సమీపించడంతో ప్రజ లకు ఇబ్బంది కల్గించ కూడదన్న ఉద్దేశంతో కార్మికులు ఓ మెట్టు దిగారు. అలాగే, కార్మికులకు బాసటగా నిలిచే విధంగా హైకోర్టు నిర్ణయం తీసుకోవడంతో 11వ తేదీ సమ్మెను కార్మిక సంఘాలు విరమించాయి. కోర్టులో వాదనల సమయంలో శాఖా పరంగా ఎలాంటి చర్యలు ఉండబోవన్న హామీని ప్రభుత్వం కార్మికులకు ఇచ్చింది. అయితే, చాప కింద నీరులా తమ పనితనాన్ని రవాణా సంస్థ యాజమాన్యం తాజాగా ప్రదర్శించడం వివాదానికి దారి తీసింది. వేతనంలో కోత: శాఖా పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఓ వైపు ప్రకటించి, మరో వైపు వేతనంలో కోత విధిస్తూ తమ పనితనాన్ని ప్రదర్శించారు. జనవరి నెల వేతన లెక్కింపు వివరాలు బుధవారం వెలుగులోకి రావడంతో కార్మికులకు షాక్ తగిలినట్టు అయింది. ఫిబ్రవరి ఒకటో తేదీన బ్యాంకుల్లో జీతాలు జమ కావాల్సి ఉంది. అయితే, 31వ తేదీ లెక్కింపు మేరకు ఏడు రోజుల పాటు లక్షల మంది ఉద్యోగ కార్మికులకు ఏడు రోజుల పాటు వేతనంలో కోత విధించి ఉండడం గమనార్హం. ఈ మేరకు ఒక్కో కార్మికులకు రూ. మూడు వేల ఐదు వందల మేరకు వేతనం కట్ చేసి ఉన్న సమాచారం కార్మిక సంఘాల్లో ఆగ్రహాన్ని రేపాయి. తమ మీద ఎలాంటి చర్యలు ఉండబోవన్న పాలకులు, తాజాగా కోత విధించడాన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. కింది స్థాయిలో రూ. 3500, ఆ పై స్థాయి వారికి మరింతగా వేతనాల్లో కోత విధించడాన్ని కార్మిక నేతలు ఖండిస్తున్నారు. ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకు ఏడు రోజుల పాటు జీతంలో కోత విధించామని యాజమాన్యం సైతం పేర్కొన్న సంకేతాలతో కార్మిక సంఘాల్లో ఆగ్రహం బయలు దేరింది. గురువారం రవాణా కార్మిక సంఘాలన్నీ ఏకం అయ్యేందుకు నిర్ణయించారు. కార్మిక సంఘాల సమాలోచన తదుపరి కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ప్రజలకు ఇబ్బంది కల్గించకుండా ఈ వ్యవహారాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవడమా లేదా, మరో మారు ఇలాంటి కోతల జోలికి యాజమాన్యం వెళ్లకుండా ఉండే విధంగా, తీవ్ర హెచ్చరికలు ఇచ్చే రీతిలో మళ్లీ మెరుపు సమ్మెకు దిగడమా అన్న అంశంపై కార్మిక నేతలు మరికొన్ని గంటల్లో తమ నిర్ణయాన్ని ప్రకటించబోతున్నారు. ఈ విషయంగా సీఐటీ యూ నేత సౌందరరాజన్ పేర్కొంటూ, వేతనం కత్తిరింపు వ్యవహారం తమ దృష్టికి వచ్చిందన్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నామని, చాప కింద నీరులా ఇలాంటి చర్యలకు పాల్పడిన పక్షంలో, తామేమిటో మరో మారు చూపించాల్సి ఉంటుందని హెచ్చరించారు. గురువారం బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యే వేతనాల పరిశీలన మేరకు కార్మిక సంఘాలు సమావేశం కానున్నాయని, ఇందులో మరో మారు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. -
పట్టువీడరు.. మెట్టు దిగరు
రవాణా సమ్మె బుధవారానికి ఏడో రోజుకు చేరుకుంది. బస్సుల సౌకర్యం లేకపోవడంతో ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం విజ్ఞప్తులు చేసినా, కోర్టు కొరడా ఝుళిపించినా సమ్మెకారులు ఎంతకూ పట్టువీడడం లేదు. అలాగే ప్రభుత్వం మెట్టు దిగడం లేదు. గురువారం తప్పనిసరిగా విధుల్లో చేరాలని మద్రాసు హైకోర్టు ఉద్యో గులకు బుధవారం సాయంత్రం అల్టిమేటం ఇచ్చింది. సాక్షి, చెన్నై: నెలసరి వేతనాన్ని 2.57 శాతం పెంచాలని, జీతంలో మినహాయించుకున్న రూ.7వేల కోట్ల పీఎఫ్ మొత్తాన్ని విడుదల చేయాలని తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర రవాణాశాఖ ఉద్యోగులు, కార్మికులు తలపెట్టిన సమ్మె బుధవారానికి ఏడోరోజుకు చేరుకుంది. సిటీ బస్సుల్లో ప్రయాణానికి బాగా అలవాటుపడిన ప్రజలు వారంరోజులుగా నానా అవస్థలు పడుతున్నారు. ప్రయివేటు వాహనాల దోపిడీకి గురవుతున్నారు. లోకల్ రైళ్ల బోగీల కిటీకీ ఊచలు పట్టుకుని వేలాడుతూ ప్రయాణిస్తున్న విద్యార్థులు ప్రాణాలతో చెలగాటం అడుతున్నారు. ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో మరింత ఒత్తిడి తేవడంలో భాగంగా ఉద్యోగులు, కార్మికులు మంగళవారం తమ భార్య, పిల్లలను సైతం వెంటపెట్టుకుని వచ్చి ఆందోళనలు సాగించారు. సమ్మెపై మద్రాసు హైకోర్టు నిషేధం విధించినా కార్మికులు ఏమాత్రం ఖాతరు చేయలేదు. కోర్కెలు నెరవేరేవరకు సమ్మె విరమించబోమని కార్మిక సంఘాల నాయకులు పునరుద్ఘాటించారు. బస్సులు, కాంట్రాక్టు కార్మికులతో ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రమాదానికి దారితీస్తున్నాయి. బుధవారం సైతం అనేక సంఘటనలను చోటుచేసుకున్నాయి. తిరుప్పూరు–తిరుమంగళం రోడ్డులో ప్రభుత్వ బస్సు తాత్కాలిక డ్రైవర్ కారుపైకి ఎక్కించాడు. ఊటీ సమీపంలో ఒక బస్సు ఇంటిపైకి దూసుకెళ్లింది. తాత్కాలిక డ్రైవర్ల కారణంగా ఈ వారం రోజుల్లో ఐదుగురు బలయ్యారు. కొందరు డ్రైవర్లు రెండుచేతులతో గేర్లను మారుస్తూ ప్రయాణికులను భయపెడుతున్నారు. అసలే డొక్కు బస్సులు, ఆపై అనుభవం లేని డ్రైవర్లు ప్రమాదాలకు కారణంగా మారింది. విధుల్లో చేరాలంటూ కార్మికుల ఇళ్లకు వెళ్లి మరీ కొందరు బెదిరిస్తున్నారు. కరూరు జిల్లాలో డ్రైవర్ ఇంట్లోకి చొరబడిన ఒక పోలీసు కానిస్టేబుల్ బెదిరింపులకు గురిచేశాడు. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా రవాణా కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని హైకోర్టుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలియజేసినా సమ్మెకారులు వినిపించుకోలేదు. 60 వేల మందికి నోటీసులు, 63 మందికి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సమ్మెకు బలైన ముగ్గురు కార్మికులు: వారంరోజులుగా సాగుతున్న రవాణా సమ్మె ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు గుండెపోటుతో మరణించారు. మదురై జిల్లా ఉసిలంపట్టికి చెందిన సెల్వం (55) అదే ఊరిలోని బస్సు డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ప్రతిరోజూ సమ్మెలో పాల్గొంటున్నాడు. సమ్మె ప్రారంభం కాగానే భార్య పిల్లలను ఉసిలంపట్టిలోనే ఉంచి తాను దిండుగల్లు జిల్లా వత్తలగుండులోని తన స్నేహితుని ఇంట్లో ఉంటున్నాడు. యథాప్రకారం మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమ్మెలో పాల్గొని సమీపంలోని ఒక తోటలో నిద్రించాడు. అదే రోజురాత్రి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అలాగే తిరునెల్వేలి జిల్లా సెంగొట్టైకి చెందిన గణేశన్ (50) అనే డ్రైవర్ సమ్మె గురించి తన తోటి కార్మికులకు చెప్పుకుని బాధపడేవాడు. మంగళవారం సాయంత్రం ఒక తోటలో అతను ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇతనికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సమ్మెలో పాల్గొన్న వారిని ఉద్యోగం నుంచి ప్రభుత్వం శాశ్వతంగా తొలగిస్తుందని కొందరు ప్రచారం చేయడంతో ఈరోడ్ జిల్లాకు చెందిన దేవరాజ్ (45) అనే డ్రైవర్ గుండెపోటుకు గురై మంగళవారం రాత్రి ప్రాణాలు విడిచాడు. -
ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె: రోడ్డెక్కని బస్సులు
సాక్షి, చెన్నై: తమిళనాడులో ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో 80 శాతం పైగా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. బస్సులు నడవకపోవడంతో ప్రజలు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమిళనాడులోని పలు బస్టాండ్లలో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో విద్యార్థులు అవస్తులు పడుతున్నారు. ఇవే అదునుగా ప్రైవేటు వాహనాల యాజమాన్యాలు అధిక మొత్తంలో ఛార్జీలు దండుకుంటున్నాయి. కాగా రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కారణంగా సీఎం పళని స్వామితో రవాణా శాఖ మంత్రి విజయ్ భాస్కర్ భేటి అయ్యారు. ఈ భేటీలో కార్మికుల సమ్మె, వారి సమస్యలపై చర్చించనున్నారు. -
నమోదు కాని వాహనాలు జప్తు!
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యాక్ట్ కింద వాహనాలను నమోదు చేసుకోని సంస్థలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వివరాలు నమోదు చేయని సంస్థలకు త్రైమాసిక పన్ను చెల్లింపునకు అవకాశం లేకుండా చేస్తారు. తర్వాత పన్ను చెల్లించని వాహనం రోడ్డెక్కితే జప్తు చేస్తారు. కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు పట్టని సంస్థలు రవాణా సంస్థల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టంలో అన్ని నిబంధనలు పొందుపర్చినా చాలా సంస్థలు పట్టించుకోవటం లేదు. అసలు ఏ సంస్థలో ఎంతమంది పని చేస్తున్నారు, ఇతర వివరాలు కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉండటం లేదు. కనీస వేతనాలు చెల్లింపు మొదలు రెండో డ్రైవర్, 8 గంటలకు మించి పని చేయించకపోవటం వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలున్నా అమలు చేయకుండా.. ఆయా సంస్థల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేప్పుడు కూడా రెండో డ్రైవర్‌ను ఏర్పాటు చేయటం లేదు. ఫలితంగా ఒకే డ్రైవర్ ఎక్కువ గంటలు పని చేయటంతోపాటు తీవ్రంగా అలసిపోయి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. పది శాతం కూడా రిజిస్టర్ కాలేదు.. ఈ నేపథ్యంలో వీటిపై నిఘా ఉంచాలంటే ఆయా సంస్థలు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్ యాక్ట్ కింద వాహనాలను రిజిస్టర్ చేయాల్సి ఉంది. ఆ వివరాల ఆధారంగా కార్మిక శాఖ, రవాణా శాఖల అధికారులు దాడులు చేసి వివరాలు వాకబు చేస్తారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు పది శాతం వాహనాలు కూడా తమ వాహనాలను రిజి స్టర్ చేయలేదు. ఇప్పుడు అన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యేలా కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోంది. రిజిస్టర్ చేయించుకున్న వాహనాలకే ప్రత్యేకంగా ఓ టోకెన్ ఇస్తుంది. టోకెన్ చూపితేనే త్రైమాసిక పన్ను కట్టించు కుంటారు. టోకెన్ లేకుండా పన్ను కట్టించు కోవద్దని నిర్ణయించినట్టు రవాణా శాఖ కమి షనర్ సునీల్ శర్మ సోమవారం సచివాల యంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. టోకెన్ లేని వాహనాల నుంచి పన్ను వసూలు చేయబోమని, ఆ వాహనాలను అధికారులు జప్తు చేస్తారని హెచ్చరించారు. ఇప్పటికే వాహనాల జప్తు ప్రారంభించారు. రెండో డ్రైవర్ లేకపోవటం, డ్రైవర్‌తో ఎక్కువ గంటలు పనిచేయిస్తున్న అంశాల ఆధారంగా గత వారం రోజుల్లో 51 వాహనాలను జప్తు చేసి వాటి పర్మిట్లు రద్దు చేసినట్టు జేటీసీ రమేశ్ వెల్లడించారు. -
మా గోడు వినండి...
-
30న బంద్
రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశం బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రోడ్డు రవాణా సురక్షతా చట్టాన్ని వ్యతిరేకిస్తూ రవాణా కార్మికులు ఈనెల 30న బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటోరిక్షా కార్మికులతో పాటు కెఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ అసోషియేషన్, ట్యాక్సీ డ్రైవర్ల సంఘం, మరికొన్ని సంఘాలు మద్దతునిచ్చిన నేపథ్యంలో ఈనెల 30న రాష్ట్రంలో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈనెల 30న రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు ఆటో రిక్షాలతో పా టు ట్యాక్సీలు సైతం స్టాండ్లకే పరిమితం కానున్నాయి. ఇక కేఎస్ఆర్టీసీలో ని నాలుగు విభాగాలకు చెందిన మొత్తం 1.2 లక్షల మంది కార్మికులు, ఉద్యోగులు ఈ బంద్‌లో పాల్గొననున్నారు. దీంతో ఈ నెల 30న ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇక ఈ బంద్‌కు ప్రైవేటు బస్‌ల యజమానులు మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో ప్రైవేటు బస్‌ల సంచారం మాత్రం యధావిధిగా సాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బంద్ కు మద్దతునివ్వాల్సిందిగా ప్రైవేటు బస్‌ల యజమానులను సైతం కోరినట్లు ఆటో డ్రైవర్ల ఏకతా పోరాట సమితి ప్రధాన కార్యదర్శి రుద్రమూర్తి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని భావిస్తున్న రోడ్డు రవాణా సురక్షతా చట్టం ఆటోరిక్షాలకు మరణశాసనంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ బంద్‌లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు.