నమోదు కాని వాహనాలు జప్తు! | Unregistered vehicles are confiscated! | Sakshi
Sakshi News home page

నమోదు కాని వాహనాలు జప్తు!

Published Tue, Dec 5 2017 2:42 AM | Last Updated on Tue, Dec 5 2017 2:42 AM

Unregistered vehicles are confiscated! - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ యాక్ట్‌ కింద వాహనాలను నమోదు చేసుకోని సంస్థలపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు వివరాలు నమోదు చేయని సంస్థలకు త్రైమాసిక పన్ను చెల్లింపునకు అవకాశం లేకుండా చేస్తారు. తర్వాత పన్ను చెల్లించని వాహనం రోడ్డెక్కితే జప్తు చేస్తారు. కార్మిక చట్టాలను కచ్చితంగా అమలు చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

నిబంధనలు పట్టని సంస్థలు
రవాణా సంస్థల్లో పని చేసే కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి చట్టంలో అన్ని నిబంధనలు పొందుపర్చినా చాలా సంస్థలు పట్టించుకోవటం లేదు. అసలు ఏ సంస్థలో ఎంతమంది పని చేస్తున్నారు, ఇతర వివరాలు కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉండటం లేదు. కనీస వేతనాలు చెల్లింపు మొదలు రెండో డ్రైవర్, 8 గంటలకు మించి పని చేయించకపోవటం వంటి అంశాలపై స్పష్టమైన ఆదేశాలున్నా అమలు చేయకుండా.. ఆయా సంస్థల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రయాణికుల రవాణా, సరుకు రవాణా వాహనాలు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించేప్పుడు కూడా రెండో డ్రైవర్‌ను ఏర్పాటు చేయటం లేదు. ఫలితంగా ఒకే డ్రైవర్‌ ఎక్కువ గంటలు పని చేయటంతోపాటు తీవ్రంగా అలసిపోయి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతోంది. 

పది శాతం కూడా రిజిస్టర్‌ కాలేదు..
ఈ నేపథ్యంలో వీటిపై నిఘా ఉంచాలంటే ఆయా సంస్థలు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ యాక్ట్‌ కింద వాహనాలను రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. ఆ వివరాల ఆధారంగా కార్మిక శాఖ, రవాణా శాఖల అధికారులు దాడులు చేసి వివరాలు వాకబు చేస్తారు. కానీ రాష్ట్రంలో ఇప్పటివరకు పది శాతం వాహనాలు కూడా తమ వాహనాలను రిజి స్టర్‌ చేయలేదు. ఇప్పుడు అన్ని వాహనాలు రిజిస్టర్‌ అయ్యేలా కార్మిక శాఖ చర్యలు తీసుకుంటోంది. రిజిస్టర్‌ చేయించుకున్న వాహనాలకే ప్రత్యేకంగా ఓ టోకెన్‌ ఇస్తుంది. టోకెన్‌ చూపితేనే త్రైమాసిక పన్ను కట్టించు కుంటారు. టోకెన్‌ లేకుండా పన్ను కట్టించు కోవద్దని నిర్ణయించినట్టు రవాణా శాఖ కమి షనర్‌ సునీల్‌ శర్మ సోమవారం సచివాల యంలో విలేకరుల సమావేశంలో తెలిపారు. టోకెన్‌ లేని వాహనాల నుంచి పన్ను వసూలు చేయబోమని, ఆ వాహనాలను అధికారులు జప్తు చేస్తారని హెచ్చరించారు. ఇప్పటికే వాహనాల జప్తు ప్రారంభించారు. రెండో డ్రైవర్‌ లేకపోవటం, డ్రైవర్‌తో ఎక్కువ గంటలు పనిచేయిస్తున్న అంశాల ఆధారంగా గత వారం రోజుల్లో 51 వాహనాలను జప్తు చేసి వాటి పర్మిట్లు రద్దు చేసినట్టు జేటీసీ రమేశ్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement