
హైదరాబాద్ – శ్రీశైలం రోడ్డు విస్తరణపై కేంద్రం పునఃపరిశీలన
ప్రత్యామ్నాయాలపై నివేదిక కోరిన ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి
అధ్యయనం చేస్తున్న అధికారులు.. త్వరలో నివేదిక
‘ఎలివేటెడ్’కు రూ.7,690 కోట్ల వ్యయం.. కేబుల్ కార్ మార్గం రూ.2,270 కోట్లతోనే నిర్మాణం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ – శ్రీశైలం పుణ్యక్షేత్రం మధ్య రోడ్డు విస్తరణలో భాగంగా నల్లమల అటవీ ప్రాంతంలో నిర్మించతలపెట్టిన భారీ ఎలివేటెడ్ కారిడార్‌కు ప్రత్యామ్నాయాలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ దృష్టి పెట్టింది. దాదాపు 45.42 కి.మీ. నిడివితో ఈ మార్గంలో భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. దీని నిర్మాణానికి రూ.7,690 కోట్ల వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.
ఇంత భారీ వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించే బదులు రూ.2,270 కోట్లతో పూర్తయ్యే కేబుల్ కార్ కారిడార్ నిర్మాణ సాధ్యాసాధ్యాలపై నివేదిక అందజేయాలని ఆ శాఖ కార్యదర్శి ఉమాశంకర్ తాజాగా అధికారులను ఆదేశించారు. దీనిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ నిడివితో కేబుల్ కార్ మార్గం లేదు. దాని నిర్మాణం, నిర్వహణ సవాళ్లతో కూడుకున్నది కావటంతో ఆచితూచి పరిశీలించి నివేదిక అందించాలని అధికారులు నిర్ణయించారు.
జంతువులకు ఇబ్బంది లేకుండా..
హైదరాబాద్ – శ్రీశైలం రహదారిని గతంలోనే నాలుగు వరసలకు విస్తరించారు. కానీ, శ్రీశైలం మార్గంలోని మన్ననూరు వరకే ఆ విస్తరణ కొనసాగింది. మన్ననూరు నుంచి దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం మొదలవుతుంది. మధ్యలో అమ్రాబాద్ పులుల అభయారణ్యం ఉంటుంది. ఇక్కడ పెద్ద పులులతోపాటు చాలా రకాల వణ్యప్రాణులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. వాటికి అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మన్ననూరు నుంచి శ్రీశైలం వరకు రోడ్డును విస్తరించలేదు. అక్కడి నుంచి సాధారణ డబుల్ రోడ్డు మాత్రమే ఉంది.
ఆ రోడ్డుమీద ఆంక్షలు కూడా కొనసాగుతున్నాయి. మన్ననూరు నుంచి శ్రీశైలం వైపు రాత్రి 9 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు వాహనాలను అనుమతించరు. పగటిపూట మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. శ్రీశైలం పుణ్య క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ పెరిగి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కొంతకాలంగా రోడ్డును విస్తరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ, వణ్యప్రాణులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటంతో అటవీ శాఖ అందుకు అనుమతించటం లేదు.
ఈ నేపథ్యంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రతిపాదన తెరపైకి వచి్చంది. మన్ననూరు నుంచి తెలంగాణ పరిధి ఉన్న పాతాళగంగ వరకు 62.40 కి.మీ. మేర రోడ్డును విస్తరించాలని.. ఇందులో జంతువుల సంచారం ఉండే 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ (వంతెన తరహా) పద్ధతిలో రోడ్డు నిర్మించాలన్నది ప్రతిపాదన. దీనిని గతేడాది నవంబర్‌లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ అధికారికంగా ప్రతిపాదించింది. ఇది పూర్తయితే దేశంలో అతి పొడవైన ఎలివేటెడ్ కారిడార్లలో ఒకటిగా నిలవనుంది.
ఖర్చు తగ్గించేందుకు..
ఎలివేటెడ్ కారిడార్ భారీ వ్యయంతో కూడిన ప్రాజెక్టు కావటంతో దానికి ప్రత్యామ్నాయం ఆలోచించాలని తాజాగా కేంద్ర ఉపరితల రవాణాశాఖ కార్యదర్శి ఉమాశంకర్ భావించారు. దీనిపై అధ్యయనం చేయాలని జాతీయ రహదారుల విభాగాన్ని ఆదేశించారు. ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించాల్సి వస్తే, తక్కువ నిడివి ఉండే ప్రత్యామ్నాయ అలైన్‌మెంటును సిద్ధం చేయాలని పేర్కొన్నారు.
కుదరని పక్షంలో ఎలివేటెడ్‌కు బదులు కేబుల్ కార్ మార్గాన్ని నిర్మించే సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.170 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. కేబుల్ కార్ మార్గానికి కిలోమీటర్‌కు రూ.50 కోట్లు ఖర్చవుతుందని తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment