Elevated corridors
-
HYD: ప్యారడైజ్ వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్..!
సాక్షి,హైదరాబాద్:సికింద్రాబాద్‌లో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఊరట కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం ప్రారంభించింది. ప్యారడైజ్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం భూ సేకరణ కోసం ప్రాథమిక నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీఫామ్ వరకు ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వం నిర్మించనుంది. ఈ కారిడార్ల భూ సేకరణను ప్రభుత్వం ప్రారంభించనుంది. భూ సేకరణ విషయమై డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్లు, సర్వేయర్లతో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం(నవంబర్ 19) సమావేశమయ్యారు. కాగా, ఈ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం కంటోన్మెంట్ భూములు అవసరమయ్యాయి.అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూములివ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం భూములిచ్చేందుకు అంగీకరించడంతో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. -
‘ఎలివేటెడ్’కు రక్షణ శాఖ భూములు
♦ ఆ శాఖాధికారులతో చర్చించేందుకు నేడు ఢిల్లీ వెళ్లనున్న సునీల్‌శర్మ ♦ బైసన్‌పోలో అంశంపై చర్చకు వచ్చే నెల హస్తినకు సీఎస్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాద్ రహదారులకు చేరుకునేలా నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ల కోసం భూసేకరణ మార్గం సుగమమైంది. కారిడార్ల కోసం సేకరించాల్సిన రక్షణ శాఖ భూముల విషయమై ఆ శాఖ చర్చలకు ఆహ్వానించింది. ప్యారడైజ్ కూడలి నుంచి శామీర్‌పేట వరకు, ప్యాట్నీ కూడలి నుంచి నిజామాబాద్ జాతీయ రహదారిపై సుచిత్ర కూడలి వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ కారిడార్లకు రక్షణ శాఖ భూములు సేకరించాల్సి ఉంది. దీంతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరటంతో ఆ శాఖ సానుకూలంగా స్పందించింది. అయితే ఇప్పటివరకు అధికారికంగా మంజూరీ రాలేదు. దీంతో ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రక్షణ శాఖను భూముల విషయమై కోరడంతో ఆ శాఖ చర్చలకు ఆహ్వానించింది. సికింద్రాబాద్–సఫిల్‌గూడ, సికింద్రాబాద్–రామకృష్ణాపురంలను అనుసంధానిస్తూ కంటోన్మెంట్‌లోని ఏఓసీ గుండా ఉన్న రోడ్డును మూసేయనున్నట్టు ఇదివరకే రక్షణ శాఖ ప్రకటించింది. దీనికి ప్రత్యామ్నాయ రోడ్డు నిర్మాణానికి కూడా రక్షణ శాఖ భూములు సేకరించాల్సి ఉంది. ఈ మూడు రహదారులకు సంబంధించి చర్చించేందుకు రక్షణ శాఖ ఆహ్వానించటంతో రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ శుక్రవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రక్షణ శాఖ అధికారులతో జరిగే ఈ చర్చల్లో భూసేకరణ వ్యవహారం కొలిక్కి వస్తుందని భావిస్తున్నారు. బైసన్‌పోలో గ్రౌండ్ కేటాయింపుపై.. కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనం నిర్మాణానికి రక్షణ శాఖ ఆధీనంలోని బైసన్‌పోలో మైదానం తీసుకోని అందుకు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ విషయాన్ని ఆ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. సీఎం ఢిల్లీ పర్యటనలోనూ చర్చలు జరిగాయి. అయితే స్థానిక కంటోన్మెంట్ అధికారులు సానుకూలంగా లేకపోవటంతో నేరుగా ఢిల్లీ అధికారులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. కానీ ఇప్పటివరకు రక్షణ శాఖ నుంచి పూర్తి సానుకూలత రాలేదు. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ అధికారులతో చర్చించేందుకు వచ్చే నెల మొదటి వారంలో సీఎస్ ఎస్పీ సింగ్ ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ ఢిల్లీ పర్యటనలోనూ దీని ప్రస్తావన వచ్చే అవకాశం ఉన్నా ఎలాంటి నిర్ణయం వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. మైదానాన్ని కేటాయించేందుకు రక్షణ శాఖ అంతర్గత మాటల్లో సానుకూలత వ్యక్తం చేసిందంటున్నారు. -
మన్నెగూడలో ఫైరింగ్ రేంజ్!
♦ ప్రత్యామ్నాయ స్థలంపై రక్షణ శాఖ సానుకూలత? ♦ ప్యాట్నీ–శామీర్‌పేట, ప్యారడైజ్–సుచిత్ర కూడలి ♦ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మోక్షం ♦ కంటోన్మెంట్ భూములు సేకరించేందుకు ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్, కరీంనగర్ రహదారులను నగరంతో ట్రాఫిక్ చిక్కులు లేకుండా అనుసంధానించే రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి స్థలం ఇచ్చేందుకు రక్షణ శాఖ సానుకూల సంకేతాలిచ్చింది. నగరంలోని స్థలం ఇచ్చి దాని బదులు వికారాబాద్ సమీపంలోని మన్నెగూడ వద్ద వంద ఎకరాలకుపైగా భూమిని తీసుకునేందుకు రక్షణ శాఖ సమ్మతించినట్టు తెలిసింది. ఇక్కడ ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేసుకోనుంది. అందుకు ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందా లేదా అన్న విషయంలో స్పష్టత కోసం కంటోన్మెంట్ అధికారులను పరిశీలించాల్సిందిగా ఆదేశించింది. ఈ మేరకు కంటోన్మెంట్ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించి అది అనుకూలంగానే ఉంటుందని ఢిల్లీలోని రక్షణ శాఖ ప్రధాన కార్యాలయానికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఫలితంగా కంటోన్మెంట్ మీదుగా రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమమవుతోంది. ట్రాఫిక్ చిక్కులు లేకుండా... నిజామాబాద్ జాతీయ రహదారి, కరీంనగర్ రాజీవ్ రహదారి గుండా నగరంలోకి వచ్చే వాహనాలు శివారు వరకు వేగంగానే వచ్చినా, అక్కడి నుంచి ట్రాఫిక్‌లో ఇరుక్కుని నగరం చేరేందుకు దాదాపు గంటకుపైగా సమయం పడుతోంది. దీంతో ట్రాఫిక్ చిక్కుల నుంచి మోక్షం కలిపిస్తూ, వాహనాలు వేగంగా నగరంలోకి వచ్చేలా భారీ వంతెనలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది జరగాలంటే కచ్చితంగా కంటోన్మెంట్ భూముల మీదుగానే నిర్మించాలి. ప్యాట్నీ కూడలి నుంచి శామీర్‌పేట వరకు రాజీవ్ రహదారిని అనుసంధానిస్తూ ఓ కారిడార్, ప్యారడైజ్ కూడలి నుంచి నిజామాబాద్ జాతీయ రహదారిని అనుసంధానిస్తూ సుచిత్ర కూడలి వరకు మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని రోడ్లు, భవనాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ రెండు కారిడార్ల నిర్మాణానికి దాదాపు 96 ఎకరాల కంటోన్మెంట్ భూమిని సేకరించాలి. సీఎం స్థాయిలో రక్షణశాఖ మంత్రితో గతంలో చర్చించిన మీదట రక్షణ శాఖ దీనికి సానుకూలత వ్యక్తం చేసింది. ‘ఏఓసీ’కి ప్రత్యామ్నాయ మార్గం కూడా... మరోవైపు సికింద్రాబాద్ నుంచి అటు రామకృష్ణాపురం వంతెన మీదుగా ఈసీఐఎల్ రోడ్డు.. ఇటు సఫిల్‌గూడ రోడ్డుకు చేరుకునేలా కంటోన్మెంట్‌లోని ఏఓసీ మార్గాన్ని వినియోగిస్తున్నారు. క్రమంగా వాహనాల రద్దీ బాగా పెరగడంతో తమకు ఇబ్బందిగా మారిందని పేర్కొంటూ కంటోన్మెంట్ యంత్రాంగం ఆ రోడ్డును మూసేయాలని నిర్ణయించి పలుమార్లు దాన్ని తాత్కాలికంగా అమలు చేసింది. ఆ రోడ్డు మూసేస్తే ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది ఎదురు కానున్నందున ఆ ప్రతిపాదనను విరమించుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని రక్షణశాఖ కొట్టిపారేసింది. ప్రత్యామ్నాయ మార్గాన్ని నిర్మించుకునేందుకు కొంత గడువు ఇస్తామని ప్రకటించటంతో ప్రభుత్వం ఆ అన్వేషణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి కూడా మార్గం సుగమమవుతోందని రోడ్లు భవనాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కంటోన్మెంట్ సరిహద్దుల మీదుగా ఉన్న ప్రత్యామ్నాయ రోడ్లను వెడల్పు చేసి వాటిని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం కంటోన్మెంట్‌కు సంబంధించిన 40 ఎకరాలను సేకరించనుంది. దీనికి కూడా ప్రత్యామ్నాయ స్థలం తీసుకునేందుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. -
ఆకాశ వీధిలో...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ చుట్టూ ఆకాశ మార్గాల దిశగా (ఎలివేటెడ్ కారిడార్లు) మరో అడుగు పడింది. ఆధునిక హంగులతో మూడు ప్రధాన మార్గాల్లో ప్రతిపాదించిన ఎలివేటెడ్ కారిడార్లపై అధ్యయనానికి ప్రభుత్వం కన్సల్టెన్సీలను నియమించింది. ప్యారెడైజ్ నుంచి కంటోన్మెంట్ మీదుగా శామీర్‌పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు... బాలానగర్ నుంచి జీడిమెట్ల మీదుగా నర్సాపూర్ ఔటర్ వరకు... ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి ఘట్కేసర్ ఔటర్ వరకు నిర్మించదలచిన ఆకాశమార్గాలపై అన్ని కోణాల్లో అధ్యయనం చేసి 6 నెలల్లో నివేదిక అందించాలని కన్సల్టెన్సీలకు ప్రభుత్వం సూచించింది. ప్యారెడైజ్-శామీర్‌పేట్, బాలానగర్-నర్సాపూర్ మార్గాల అధ్యయనాన్ని ఆర్ వీ అసోసియేట్స్ దక్కించుకోగా, ఉప్పల్-ఘట్కేసర్ మార్గాన్ని వాడియా కన్సల్టెన్సీ కైవసం చేసుకుంది. ఐదు కన్సల్టెన్సీలు పోటీ పడగా చివరకు రెండింటికి అవకాశం దక్కినట్టు జాతీయ రహదారుల సంస్థ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో చెప్పారు. గత అనుభవం, తక్కువ మొత్తంతో అధ్యయనానికి సంసిద్ధతను వ్యక్తం చేయడం, తదితర అంశాల ఆధారంగా వీటిని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఒక్కో మార్గంలో అధ్యయనానికి రూ.3 కోట్ల చొప్పున వెచ్చిస్తున్నట్లు పేర్కొన్నారు. పక్కాగా ప్రణాళికలు... ప్రస్తుత ప్రతిపాదనల మేరకు మూడువైపులా ఔటర్‌ను అనుసంధానిస్తూ ఎలివేటెడ్ మార్గాలు నిర్మించనున్నారు. ఈ కారిడార్లలో ప్రస్తుతం ఉన్న రహదారులను విస్తరిస్తూనే... ఇరుకు ప్రాంతాల్లో ఆకాశమార్గాలను (ఎలివేటెడ్ కారిడార్లను) నిర్మిస్తారు. ఒక్కో కిలోమీటర్‌కు రూ.వంద కోట్ల వంతున ఖర్చవుతుందని అంచనా. ఉప్పల్- ఘట్కేసర్ మధ్య 10 కిలోమీటర్ల వరకు ఎలివేటెడ్ హైవే వచ్చే అవకాశం ఉంది. ప్యారెడైజ్- శామీర్‌పేట్ మార్గంలో కంటోన్మెంట్ నుంచి తూంకుంట వరకు 12 కిలోమీటర్లు ఎలివేటెడ్ కారిడార్ రానుంది. బాలానగర్-నర్సాపూర్ కారిడార్‌లో ఇరుకు రహదారులు పెద్దగా లేకపోవడంతో ఎలివేటెడ్ మార్గం తక్కువగానే ఉంటుంది. వీటిపై సమగ్ర సర్వేతో పాటు డిజైన్ల రూపకల్పన, నిర్మాణ అంచనాలు, ఆ మార్గాల్లో రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య, తదితర అంశాలతో కన్సల్టెన్సీలు నివేదిక లను రూపొందిస్తాయి. రద్దీకి చెక్... ఎన్‌హెచ్-163లో ఉన్న ఉప్పల్-ఘట్కేసర్ మధ్య వాహనాల రద్దీలో వెళ్లడం నరకప్రాయంగా మారింది. వరంగల్, హన్మకొండల నుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. ఉప్పల్ నల్లచెరువు నుంచి రింగ్‌రోడ్డు వరకు ఇరుకైన రహదారి వల్ల, మెట్రో నిర్మాణ పనుల దృష్ట్యా గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఎలివేటెడ్ మార్గం వస్తే ఘట్కేసర్ ఔటర్ నుంచి నేరుగా ఉప్పల్ రింగు రోడ్డుకు చేరుకోవచ్చు. ఇక నిత్యం రద్దీగా ఉండే రాజీవ్ రహదారి, నర్సాపూర్ మార్గంలోనూ ఔటర్‌కు అనుసంధానం చేస్తూ ఎలివేటెడ్ హైవేలు నిర్మిస్తే మెదక్, సిద్ధిపేట్, కరీంనగర్ నుంచి వచ్చే వాహనాలు నేరుగా నగరంలోకి ప్రవేశించే అవకాశం లభిస్తుంది. అవసరమైన చోట జంక్షన్లను ఏర్పాటు చేస్తారు. తద్వారా నాలుగు వైపులా రద్దీ లేకుండా (ఫ్రీ ఫ్లో) వాహనాలు సాగిపోతాయి.