ఏజెంట్లపై ఆర్టీఏ 'ఐ'! | AI CCTV cameras in RTA offices | Sakshi
Sakshi News home page

ఏజెంట్లపై ఆర్టీఏ 'ఐ'!

Published Sat, Mar 22 2025 5:53 AM | Last Updated on Sat, Mar 22 2025 6:05 AM

AI CCTV cameras in RTA offices

ఆర్టీఏ కార్యాలయాల్లో ఏఐ సీసీ కెమెరాలు 

ఖైరతాబాద్‌ ఆర్టీఏలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు 

కెమెరాలో రికార్డయ్యే ప్రతి వ్యక్తికి ఒక కోడ్‌  

ఒకే వ్యక్తి పదేపదే కనిపిస్తే ఏజెంటుగా గుర్తింపు 

మొదటి వారంలోనే 45 మందిని గుర్తించిన కెమెరాలు  

దశలవారీగా అన్ని ఆర్టీఏ కేంద్రాలకు విస్తరణ 

సాక్షి, హైదరాబాద్‌: ఏజెంట్లు, దళారుల ఆట కట్టించేందుకు రవాణాశాఖ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అస్త్రాన్ని ప్రయోగించింది. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో పటిష్ట నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నిఘా కెమెరాలు క్లిక్‌మనిపించే ప్రతి వ్యక్తికి ఒక కోడ్‌ నమోదవుతుంది. ఆ కోడ్‌ ఆధారంగా సదరు వ్యక్తి ఒక రోజులో ఎన్నిసార్లు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చాడు? ఏ పని కోసం వచ్చాడనేది ఇట్టే తెలిసిపోతుంది. 

సాధారణంగా ఏజెంట్లు, దళారులు మాత్రమే ఆర్టీఏ కార్యాలయాల వద్ద తిష్ట వేస్తారు. నిఘా కెమెరాల్లో వాళ్లకు సంబంధించిన కోడ్‌ నంబర్లు పదేపదే నమోదవుతాయి. ఒక రోజులో, ఒకవారంలో ఒక కోడ్‌ ఎన్నిసార్లు కనిపించింది అనే విశ్లేషణ ఆధారంగా దళారులను అరికట్టేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 

ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కేంద్ర కార్యాలయంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ సీసీ కెమెరాలు విజయవంతంగా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ వ్యవస్థను దశలవారీగా రాష్ట్రంలోని అన్ని రవాణా కార్యాలయాలకు విస్తరించనున్నారు. చెక్‌పోస్టుల్లోనూ వీటిని ఏర్పాటుచేసి రవాణా శాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి పర్యవేక్షించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఒక అధికారి చెప్పారు. 

వారంలోనే 45 మందిని పసిగట్టిన ఏఐ 
ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏఐ కెమెరాలు వారం రోజుల్లో 45 మంది పదేపదే ఆఫీసుకు వచ్చినట్లు పసిగట్టాయి. ఆర్టీఏ ప్రాంగణంలోనే ఉన్నఈ సేవా కేంద్రంలో పనిచేసే కొందరు ఉద్యోగులు మినహాయించి మిగతావాళ్లంతా ఏజెంట్లుగా తేలింది. దీంతో ఏజెంట్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. బారికేడ్లు ఏర్పాటు చేసి ఆర్టీఏ సేవల కోసం వచ్చేవాళ్లు మినహా ఇతరులు లోపలికి ప్రవేశించకుండా పోలీసులతో ఆంక్షలు విధించారు. 

ఆ తరువాత రెండు వారాల్లోనే దళారుల రాకపోకలు చాలా వరకు తగ్గుముఖం పట్టినట్లు అధికారులు చెప్పారు. ఈ నిఘా వ్యవస్థను త్వరలో సికింద్రాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఏర్పాటు చేయనున్నట్లు ఒక అధికారి చెప్పారు. ఆ తర్వాత మెహిదీపట్నం, ఉప్పల్, బండ్లగూడ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, మణికొండ, కూకట్‌పల్లి, మలక్‌పేట, నాగోల్‌ తదితర ప్రాంతీయ రవాణా కార్యాలయాలకు, డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌లకు విస్తరించనున్నారు. ఆ తదుపరి అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. 

ఏజెంట్లదే హవా
కొన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లో ఏజెంట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారులు, సిబ్బంది సహాయంతో అన్ని రకాల పౌరసేవల్లో హవా కొనసాగిస్తున్నారు. క్లర్క్‌లు, అసిస్టెంట్లుగా పనులు చక్కబెడుతున్నారు. వీరు అధికారుల వద్ద కీలకంగా మారటంతో డ్రైవింగ్‌ లైసెన్సులు, వాహనాల రిజి్రస్టేషన్లు, తదితర పనుల కోసం వచ్చేవారు ఈ ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు. 

కొన్నిచోట్ల కార్యాలయాల వెలుపల బాహాటంగానే దుకాణాలు తెరుచుకొని పని చేస్తున్నారు. డ్రైవింగ్‌ స్కూళ్ల నిర్వాహకులు కూడా ఏజెంట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో పౌరసేవలపై ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే రెండు రెట్లు అధికంగా సమరి్పంచుకోవలసి వస్తోంది. ఏజెంట్లను అరికట్టేందుకు ఇప్పటివరకు 17 రకాల సేవలను ఆన్‌లైన్‌లోకి మార్చారు. కానీ తరచూ సాంకేతిక సమస్యలు వస్తుండటంతో అవి పారదర్శకంగా అమలు కావడం లేదు.  

చెక్‌పోస్టుల్లో ఏఐ నిఘా 
రాష్ట్రంలోని అన్ని ఆర్టీఏ చెక్‌పోస్టులకు కూడా ఏఐ నిఘా వ్యవస్థను విస్తరించనున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను తనిఖీ చేసేందుకు భైంసా, కామారెడ్డి, జహీరాబాద్, అలంపూర్, క్రిష్ణా, విష్ణుపురం, నాగార్జునసాగర్, కోదాడ, మద్దునూరు, సాలూరు, వాంకిడి, కల్లూరు, అశ్వారావుపేట, పాల్వంచలో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. 

నిజానికి దేశవ్యాప్తంగా నేషనల్‌ పరి్మట్‌ విధానం, జీఎస్టీ అమల్లోకి వచి్చన తరువాత ఈ చెక్‌పోస్టుల అవసరం లేకుండా పోయింది. ఏపీ సహా పలు రాష్ట్రాల్లో చెక్‌పోస్టులను ఎత్తేసినా తెలంగాణలో మాత్రం కొనసాగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement