సాక్షి, చెన్నై: సమ్మె బాటకు సిద్ధపడ్డ రేషన్ షాపుల సిబ్బందిపై ఉక్కుపాదం మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నో వర్క్..నో పే అంటూ సమ్మె రోజుల్లో జీతాలు నిలుపుదలకు తగ్గ ఆదేశాలు జారీ అయ్యాయి. ఇది కాస్త సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెకు సిద్ధ పడ్డ రేషన్ సిబ్బందిని ఆందోళనలో పడేసింది.
రాష్ట్రంలో రెండు కోట్ల 20 లక్షల మేరకు కుటుంబకార్డుదారులు ఉన్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నేతృత్వంలోని రేషన్ దుకాణాల ద్వారా కుటుంబకార్డుదారులకు ఉచిత బియ్యం, చౌక ధరకే చక్కెర, కంది, ఉద్ది, పామోలిన్, కిరోసిన్ అందిస్తున్నారు. ముఫ్‌పై వేలకు పైగా ఉన్న రేషన్ దుకాణాల్లో 70 వేల మంది దాకా పనిచేస్తున్నారు. అయితే, ఇటీవల కాలంగా అధికారులు తమను వేధిస్తున్నారంటూ, రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల బాట కూడా పట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాగే, అధికారుల వేధింపుల నుంచి రక్షించాలని, తమకు జీతాలు పెంచాలన్న, ఇతర అలవెన్స్‌లు పెంచాలన్న డిమాండ్లతో తొలుత రేషన్ సిబ్బంది పోరుబాటను దశల వారీగా సాగిస్తున్నారు. అయితే, పాలకుల్లో స్పందన లేని దృష్ట్యా, ఇక సేవల నిలుపుదలకుసిద్ధమయ్యారు. గతంలో వలే కాకుండా, ఈ సారి సంఘాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి సమ్మె గంటకు సిద్ధమయ్యాయి. సోమవారం నుంచి విధుల్ని బహిష్కరించి సమ్మెలోకి వెళ్లేందుకు నిర్ణయించాయి.
నీరుగార్చేందుకు అస్త్రం..
రేషన్ దుకాణాల్లో సాధారణంగా నెలలో మొదటి, రెండు, మూడు వారాల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో సిబ్బంది సమ్మె గంట మోగించిన పక్షంలో నిత్యావసర వస్తువుల సరఫరా ఆగే ప్రమాదం నెలకొనడం ఖాయం. దీనిని పరిగణించిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెట్టింది. ఎక్కడెక్కడ విధులకు రాకుండా సిబ్బంది సమ్మెలోకి వెళ్తారో అక్కడల్లా ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా నిత్యావసర వస్తువుల్ని కార్డుదారులకు ఎలాంటి ఆటంకం అన్నది లేకుండా సరఫరా చేయడానికి చర్యలు చేపట్టారు. అదే సమయంలో సిబ్బందిని దారిలోకి తెచ్చుకోవడంతో పాటు సమ్మెను అణగదొక్కేందుకు ప్రభుత్వం కొత్తబాటను ఎంచుకుంది. సిబ్బందికి హెచ్చరికలు చేస్తూ ఆదివారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో ఓ హెచ్చరిక సిబ్బందిని డైలమాలో పడేశాయి. నో వర్క్..నో పే అంటూ విధులకు హాజరు కాని వారికి సమ్మె రోజులకు జీతాలు నిలుపుదల చేయనున్నట్టు ప్రకటించారు. పౌరసరఫరాల విభాగం అధికారి కన్నన్ ఈ ఉత్తర్వుల్ని అన్ని మండల, డివిజన్ కార్యాలయాలకు జారీ చేశారు. ఆయా దుకాణాల తాళాలను మండల అధికారులు చేజిక్కించుకోవాలని, సమ్మె గంట మోగిన పక్షంలో నిత్యావసర వస్తువుల సరఫరాకు ఆటంకం అన్నది లేకుండా ప్రత్యామ్నాయ సిబ్బంది ద్వారా అందించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని ఆ ఉత్తర్వుల్లో వివరించారు. అలాగే, ఎక్కడెక్కడ సిబ్బంది విధులకు హాజరు కారో, ఆ రోజుల్లో వారికి జీతాలు ఇవ్వబోమని స్పష్టం చేయడం గమనార్హం. ఇది కాస్త రేషన్ సిబ్బంది సంఘాల్ని కలవరంలో పడేసింది. గతంలో ఇదే మాదిరిగా సంఘాలన్నీ ఒకే వేదికపైకి రాగా, పాలకుల హెచ్చరికలతో చీలికలు తప్పలేదు. అదే పరిస్థితి మళ్లీ పునరావృతం అయ్యేనా అన్నది వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment