సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తానంటూ ప్రకటించిన కలెక్టర్ స్మితాసబర్వాల్ అదే విధంగా ప్రభుత్వ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఐదు ప్రభుత్వ విభాగాల సమన్వయంతో చేపట్టిన ‘మార్పు’ అమలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమం అమలుకు ఈ నెలాఖరు వరకు గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఇంకా మార్పు అమలుపై అవగాహన లేకపోవడంతో ఫలితాల సాధనపై వైద్య వర్గాల్లో ఆందోళన నెలకొంది.
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు, వైద్యుల హాజరు తదితరాలను స్వయంగా పర్యవేక్షించేందుకు ‘స్కైప్’ సాంకేతికతను కలెక్టర్ ఆసరా చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 66 పీహెచ్‌సీలకు గాను 50, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో 12కు గాను 9 చోట్ల స్కైప్ టెక్నాలజీ సిద్ధం చేశారు. వైద్యులు, రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడే అవకాశం ఉండటంతో వైద్యులు ఉరుకులు, పరుగుల మీద ఆస్పత్రులకు చేరుకుంటున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రూ.1.25 కోట్ల ఆసుపత్రి అభివృద్ధి నిధులు ఉండటంతో పారిశుద్ధ్యం నిర్వహణ తదితరాలపై ఖర్చు చేయాల్సిందిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో ప్రస్తుతం 52 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. మెరుగైన వైద్య సేవలు అందించే ఆస్పత్రులకు నిధులు, సిబ్బంది పెంచుతామంటూనే, పనితీరు బాగా లేనివారిపై వేటు వేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. జహీరాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట మాతా శిశు ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య మెరుగ్గా ఉంది. గజ్వేల్, నర్సాపూర్, రామాయంపేట తదితర చోట్ల ఆసుపత్రి ప్రసవాల సంఖ్య పెరగాలంటూ కలెక్టర్ నిర్దేశించారు.
‘మార్పు’ వేగంపై ఆందోళన
మాత, శిశు మరణాల రేటు తగ్గింపు లక్ష్యంగా ‘మార్పు’ అమలు దిశగా కలెక్టర్ సంబంధిత విభాగాలను సమాయత్తం చేస్తున్నారు. అయితే ఐదు ప్రభుత్వ శాఖలకు సంయుక్తంగా ఈ కార్యక్రమం అమలు బాధ్యతను అప్పగించారు. స్వయం సహాయక సంఘాలను ‘మార్పు’ అమలులో భాగస్వాములను చేయడంతో వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే నవంబరు నెలాఖరుకల్లా ఫలితాలు చూపాలంటూ లక్ష్యం
నిర్దేశించడంపై సంబంధిత శాఖలు మల్లగుల్లాలు పడుతున్నాయి. పది ఆరోగ్య క్లస్టర్లలో స్వయం సహాయక సంఘాలకు శిక్షణ ఇవ్వడం తలకు మించిన భారంగా మారేలా కనిపిస్తోంది. ఒక్కోచోట 700 నుంచి వేయి మంది మహిళలకు శిక్షణ ఇవ్వాల్సి ఉండటంతో ఏర్పాట్లపై సంబంధిత అధికారులు తల పట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ‘మార్పు’ అమలు ప్రణాళిక తయారీలో తమను భాగస్వాములను చేసి ఉంటే మెరుగైన శిక్షణకు అవకాశముండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైద్య సేవలు మెరుగు దిశగా కలెక్టర్ వడివడిగా అడుగులు వేస్తుండటంతో, అందుకోలేక సంబంధిత విభాగాలు ఆయాస పడుతున్నాయి.
‘వైద్యం’.. వేగిరం!
Published Fri, Nov 8 2013 3:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:23 AM
Advertisement
Advertisement