సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్ : డీఈఓ రమేశ్ బదిలీ కాగానే బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్న ఉపాధ్యాయుల తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై శాఖాపరమైన చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. డీఈఓ రమేశ్ ఈనెల 18వ తేదీ ఆదివారం రిలీవ్ కాగా, సోమవారం డీఈఓ కార్యాలయానికి తరలివచ్చిన ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు డీఈఓ కార్యాలయ ఆవరణలోనే
బాణసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘పంపిచేశామని.. పండగ చేశారు’ అన్న శీర్షికతో మంగళవారం సంచికలో సాక్షి కథనాన్ని ప్రచురించింది. సెలవులో ఉన్న కలెక్టర్ స్మితా సబర్వాల్ ఘటన పూర్వాపరాలను ఆరా తీయాలని జేసీ శరత్‌ను ఆమె ఆదేశించినట్లు తెలుస్తోంది. దీంతో జేసీ శరత్ ఈ ఘటనపై విచారణ జరపాలని రెవెన్యూశాఖకు చెందిన సీనియర్ అధికారిని ఆదేశించారు.
ఏం జరిగిందంటే...
డీఈఓగా రమేశ్ బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు నుంచే విద్యా ప్రమాణాలను మెరుగుపర్చేందుకు కృషి చేశారు. ఈ క్రమంలోనే పనిచేయని చాలామంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. దీంతో కొందరు ఉపాధ్యాయులు ఆయన్ను ఎలాగైనా జిల్లా నుంచి సాగనంపాలని ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగానే మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ద్వారా అప్పటి సీఎం కిరణ్ మీద ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 12న రమేశ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే అప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న డీఈఓను రిలీవ్ చేయలేనని కలెక్టర్ వెల్లడించడంతో బదిలీ తాత్కాలికంగా ఆగిపోయింది. ఈ నెల 16తో ఎన్నికల ప్రక్రియ ముగిసినందున డీఈఓను రిలీవ్ చేయాలని కలెక్టర్‌ను విధ్యాశాఖ ఆదేశించింది. దీంతో ఈ నెల 18న కలెక్టర్ రమేశ్‌ను రిలీవ్ చేశారు. దీంతో గుర్తింపు పొందిన ఓ ఉపాధ్యాయ సంఘం నేతలు 19 వ తేదీన కొత్త డీఈఓ రాజేశ్వర్‌రావుకు శుభాకాంక్షలు తె లిపారు. అనంతరం డీఈఓ కార్యాలయ ఆవరణలోనే బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వెల్లువెత్తడం, సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
పండుగ చేసిన పంతుళ్లపై చర్యలు?
Published Wed, May 21 2014 11:47 PM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement