పంపేందుకు పైరవీ
సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను జిల్లా నుంచి పంపించేందుకు బడా పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్‌లో ఎత్తులు వేస్తున్నాయి. ఆమె బదిలీ కోసం పారిశ్రామికవేత్తలంతా కలిసి ఏకంగా సెక్రటేరియట్‌లోనే లాబీయింగ్ మొదలుపెట్టారు. ‘ముఖ్య’నేత బంధువు ద్వారా ఇప్పటికే ‘రాయబేరాలు’ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. రూ.కోట్లకు కోట్లు ఆర్జిస్తూ ‘సామాజిక బాధ్యత’ను మరిచిపోయిన కంపెనీల ముక్కుపిండి సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులు వసూలు చేయాలనుకోవడమే ఆమెపై పారిశ్రామికవేత్తల గుర్రుకు కారణంగా తెలుస్తోంది.
రూ.కోట్లలో ‘సామాజిక బాధ్యత’ బకాయిలు
జిల్లాలోని ప్రతి పరిశ్రమ స్థాపనకు అయ్యే వ్యయంలో 0.02 శాతం సొమ్మును సీఎస్‌ఆర్ నిధుల కింద చెల్లించాలి. జిల్లాలో దాదాపు 958 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ లెక్కన కార్పొరేటు కంపెనీలు రూ.కోట్లలో బకాయి పడ్డాయి. వీటినుంచి 2012-13 ఆర్థిక సంవత్సరానికే రూ.41.64 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల వసూలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవ ల సంబంధిత అధికారులతో ‘సామాజిక బాధ్యత’ నిధులపై సమీక్ష జరిపారు.
జనవరి మాసాంతం లోపు కనీసం 50 శాతం బకాయిలు వసూలు చేయాలని, నిధులు చెల్లించని పరిశ్రమల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇలా వసూలుచేసిన మొత్తాన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాలని ఆమె నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమించి పరిశ్రమల వివరాలన్నీ తెప్పించారు. బాకీ వసూలుచేసే బాధ్యతను కూడా వారికే అప్పగించారు.
ఈ పరిస్థితుల్లో సీఎస్‌ఆర్ బకాయి నిధులు చెల్లించడం ఆయా కంపెనీలకు అనివార్యంగా మారింది. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఏకమై సీఎస్‌ఆర్ నిధులు చెల్లించకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఒకసారి సీఎస్‌ఆర్ నిధులు చెల్లించడం ప్రారంభిస్తే ప్రతి కలెక్టర్ ఇదే విధానాన్ని కొనసాగిస్తారనే భయంతోనే వారంతా కలెక్టర్ స్మితాసబర్వాల్‌ను బదిలీ చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం.
సీఎస్‌ఆర్ నిధుల బకాయి రూ.41 కోట్లు ఉండడంతో అందులోని 25 శాతం నిధులు ఖర్చు చేస్తే కలెక్టర్‌నే బదిలీపై పంపొచ్చనే ఆలోచనతో పారిశ్రామికవేత్తలంతా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో కూర్చుని సచివాలయంలో పథక రచన చేస్తున్నారని, అవసరమైతే ఢిల్లీ నుంచి ఒత్తిడి తెచ్చి ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.