social responsibility
-
సామాజిక సేవలో కార్పొరేట్స్
సాక్షి, అమరావతి: దేశ ప్రగతిలో తమవంతు పాత్రను పోషిస్తూ సమాజ శ్రేయస్సు కోసం వివిధ సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న కార్పొరేట్ సంస్థలు తమ సేవానిరతిని చాటుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో సామాజిక భద్రతను కల్పించేందుకు ఈ కంపెనీలు పెద్దపీట వేస్తున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ సామాజిక నిధుల (సీఎస్ఆర్) వ్యయాలను పరిశీలిస్తే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా క్రీడలు, కళలు–సంప్రదాయాలు, మహిళా సాధికారిత, జంతువుల సంక్షేమం, లింగ వివక్ష రూపుమాపడం వంటి కార్యక్రమాలకు నిధులు క్రమేపీ పెరుగుతున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఈ ఐదు రంగాలకు కేటాయింపులు ఏకంగా 48 శాతం పెరిగాయి. ఈ ఐదు రంగాలకు 2021–22లో రూ.174 కోట్లు వ్యయం చేస్తే ఇపుడు రూ.1,800 కోట్లు వ్యయం చేశాయి. ముఖ్యంగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి శిక్షణ ఇవ్వడానికి కార్పొరేట్ సంస్థలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే సీఎస్ఆర్ నిధులు క్రీడలకు 80 శాతంగా రూ.292 కోట్ల నుంచి రూ.526 కోట్లకు పెరిగాయి. అదే విధంగా దేశ సంస్కృతిని కళలను ప్రోత్సహిస్తూ ఈ రంగానికి నిధులను రూ.248 కోట్ల నుంచి రూ.441 కోట్లకు పెంచడం గమనార్హం. అత్యధికంగా విద్యారంగానికే.. మొత్తం సీఎస్ఆర్ నిధుల వినియోగం చూస్తే విద్యారంగానికే కార్పొరేట్ సంస్థలు భారీగా కేటాయింపులు చేశాయి. 2021–22లో విద్యారంగానికి రూ.6,557 కోట్లు కేటాయిస్తే ఈ సారి ఈ మొత్తం రూ.10,085 కోట్లకు చేరింది. విద్యారంగం తర్వాత అత్యధికంగా వైద్య రంగానికి కేటాయించినా గతేడాదితో పోలిస్తే నిధుల కేటాయింపు తగ్గింది. ఆరోగ్యరంగానికి సీఎస్ఆర్ నిధుల కేటాయింపు రూ.7,806 కోట్ల నుంచి రూ.,6830 కోట్లకు తగ్గింది. ఇదే బాటలో పర్యావరణం రంగానికి కూడా నిధుల కేటాయంపు రూ.2,432 కోట్ల నుంచి రూ.1,960 కోట్లకు తగ్గాయి. గ్రామీణాభివృద్ధికి, జీవన ప్రమాణాలు పెరుగుదల వంటి రంగాలకు కూడా కార్పొరేట్ సంస్థలు భారీగానే వ్యయం చేస్తున్నాయి. సీఎస్ఆర్లో హెచ్‌డీఎఫ్‌సీదే పెద్ద పీట కార్పొరేట్ సంస్థలు తమకు వచ్చిన లాభాల్లో కనీసం రెండు శాతం నిధులను సామాజిక బాధ్యతకు వినియోగించ్సా ఉంది. 2022–23 సంవత్సరంలో దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ ఫండ్ ద్వారా రూ.29,987 కోట్లు వ్యయం చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంకు రూ.803 కోట్లు వ్యయం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టాటా కన్సల్టెన్సీ సంస్థ (టీసీఎస్) రూ. 774 కోట్లు, రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.743 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంకు రూ.477 కోట్లు, టాటాస్టీల్ రూ.454 కోట్లు వ్యయం చేశాయి. -
జర్నలిజం సామాజిక బాధ్యత: హరీశ్
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: జర్నలిజం పవిత్రమైన వృత్తే కాదు.. సామాజికమైన బాధ్యత కూడా అని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సుంద రయ్య విజ్ఞాన కేంద్రంలో ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులు, కవులను ఆర్ఎస్ఎన్ అవార్డులతో సత్కరిం చారు. ఈ సందర్భంగా కలాలకు సలామ్ అనే సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమా నికి ముఖ్యఅతిథిగా హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజాసమస్య లను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని కొని యాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం రూ. 42 కోట్లు కేటాయించిందని... జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం సీఎం యోచిస్తున్నారని హరీశ్‌రావు వివరించారు. అనంతరం కామారెడ్డి సాక్షి విలేకరి ఎస్.వేణు గోపాలచారికి ద్వితీయ అవార్డుతోపాటు మరి కొందరు జర్నలిస్టులు, కవులను ఆర్ఎస్ఎన్ అవార్డులతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు సంఘం ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ ఎన్ సేవా ఫౌండేషన్ ట్రస్టీ ఆర్.సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ సభ్యుడు కారం రవీందర్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు, ఆర్ఎస్ఎన్ అవార్డు జ్యూరీ కమిటీ చైర్మన్ డాక్టర్ కె.రామచంద్ర మూర్తి, ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి, తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జి.దేవీప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
Leena Gandhi Tewari: మర్యాద ఇచ్చిపుచ్చుకుంటాం.. 3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో
Leena Gandhi Tewari Inspirational Story: ముంబైలోని ఫార్మస్యూటికల్ అండ్ బయోటెక్నాలజి కంపెని యుఎస్వీ ప్రధాన కార్యాలయం దగ్గర ఒక తోట ఉంటుంది. ఆ తోటలోనే కాదు కార్యాలయంలో కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఎక్కడా అరుపులు, కేకలు వినబడవు. ప్రశాంతమైన వాతావరణంలో పని జరుగుతుంటుంది. ‘నేను నీ కంటే ఎక్కువ. నువ్వు నా కంటే తక్కువ... అనే వాతావరణం మా సంస్థలో కనిపించదు. మర్యాద ఇచ్చిపుచ్చుకునే ధోరణికి ప్రాధాన్యత ఇస్తాం’ అంటుంది లీనా గాంధీ తివారి. యుఎస్వీ చైర్పర్సన్ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్ ‘100 రిచెస్ట్ ఇండియన్స్’ జాబితాలో చోటు దక్కించుకుంది. మహిళలలో రూ.3.28 లక్షల కోట్లతో మూడోస్థానంలో నిలిచింది. చదవండి : Divya Gokulnath: ఫోర్బ్స్ లిస్ట్‌లో.. సంపద ఎంతో తెలుసా? ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్, సోషల్ రెస్పాన్స్‌బిలిటీ భిన్న ధృవాలుగా కనిపిస్తాయి. కానీ మనసు ఉన్న వాళ్లకు రెండు వేరు వేరు కావు. లీనా తివారి ఇలాంటి వ్యక్తే. వ్యాపార నైపుణ్యం, సామాజిక బాధ్యతను మిళితం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తుంది లీనా. ‘డా. సుశీలగాంధీ– సెంటర్ ఫర్ అండర్ ప్రివెలేజ్డ్ ఉమెన్’ తరఫున అట్టడుగు వర్గాల మహిళలకు అనేక రకాలుగా సహాయంగా నిలుస్తుంది. పేద గ్రామీణ విద్యార్థులకు విద్య చెప్పించడం నుంచి కంప్యూటర్లో శిక్షణ ఇప్పించడం వరకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ‘మహిళలు తమ సొంతకాళ్ల మీద నిలబడేలా చేయడానికి సహకరించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆడవాళ్లు ఎంత చదువుకున్నా పురుషులతో సమానం కాదు అనే ఆధిపత్య భావజాలాన్ని తొలగించడం మరో ఎత్తు. మొదటి లక్ష్యం సులభమేకాని రెండోది మాత్రం క్లిష్టమైనది. దానికి నిరంతర కృషి కావాలి. క్లిష్టమైన వాటిని దారికి తేవడం ఎంటర్ప్రెన్యూర్ చేసే పనుల్లో ఒకటి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నేను అదే చేయాలనుకుంటున్నాను’ అంటున్న లీనా మాటల్లోనే కాదు చేతల్లోనూ తన మాట నిలబెట్టుకుంటుంది. యుఎస్వీలో ఉన్నతస్థానాల్లో మహిళలు ఉన్నారు. వారి ప్రతిభ, కృషి సంస్థ విజయానికి ఇంధనంగా పనిచేస్తుంది. ‘మొదట్లో ఏ మహిళలకైనా ఏదైనా కీలక బాధ్యత అప్పగిస్తే...నేను చేయలేనేమో అన్నట్లుగా మాట్లాడేవారు. నువ్వు తప్పకుండా చేయగలవు. నీలో ఆ ప్రతిభ ఉంది...అని ప్రోత్సహిస్తే కీలక బాధ్యతలను భుజాన వేసుకోవడం మాత్రమే కాదు తమను తాము నిరూపించుకున్న మహిళలు మా సంస్థలో ఎంతోమంది ఉన్నారు’ అంటుంది లీనా. 1961లో యుఎస్వీ ఏర్పాటయింది. అప్పటి నుంచి వ్యాపార విలువలతో పాటు స్త్రీలను గౌరవించే సంస్కృతికి కూడా సంస్థ ప్రాధాన్యం ఇచ్చింది. పెద్దలు పాదుకొల్పిన ఈ విలువలను మరింత ముందుకు తీసుకువెళుతుంది లీనా. ‘యూనివర్శిటీ ఆఫ్ ముంబై’లో బి.కామ్ చేసిన లీనా బోస్టన్ యూనివర్శిటీ నుంచి ‘బిజినెస్ అడ్మిన్‌స్ట్రేషన్’లో పట్టా పుచ్చుకుంది. వ్యాపార పాఠాలు మాత్రమే కాదు జీవితపాఠాలను కూడా చదువుకుంది లీనా. అందుకే ‘ఫోర్బ్స్’ మాత్రమే కాదు ఫిలాంత్రోపి జాబితాలోనూ ఆమె అగ్రస్థానంలో ఉంటుంది. లినా మంచి రచయిత్రి కూడా. తాత విఠల్ బాలక్రిష్ణ గాంధీ జీవితంపై ఆమె రాసిన ‘బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్’ ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన పుస్తకం. దీనిలో ఒక వాక్యం... ‘నువ్వు గెలవడమే కాదు ఇతరుల గెలుపు గురించి కూడా ఆలోచించు' లినా తివారీ గాంధీ వ్యక్తిత్వానికి అద్దం పట్టే వాక్యం ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చదవండి: World Post Day: జ్ఞాపకాల మూట -
హక్కులే కాదు... బాధ్యతలూ గుర్తించాలి
సాక్షి, న్యూఢిల్లీ: పౌర హక్కులు, సామాజిక బాధ్యతల మధ్య పరస్పర సమన్వయం ద్వారానే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కేవలం హక్కులకే ప్రాధాన్యతనిస్తూ బాధ్యతలను విస్మరించడం ద్వారా సమాజంలో సమన్వయం లోపిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. దివంగత సంఘ సేవకుడు చమన్‌లాల్ శతజయంతి సందర్భంగా భారతీయ పోస్టల్ శాఖ రూపొందించిన తపాలా బిళ్లను ఉపరాష్ట్రపతి శనివారం విడుదల చేశారు. స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టి జాతి ప్రయోజనాలే పరమావధిగా జీవించాలని ప్రతి నాగరికత, ప్రతి ధర్మం బోధిస్తున్నాయని వెంకయ్యనాయుడు గుర్తుచేశారు. అందుకే హక్కులు, బాధ్యతల విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశ విభజన అనంతరం పాకిస్తాన్లో సర్వస్వాన్ని కోల్పోయిన భారతీయ కుటుంబాలను పరామర్శిస్తూ వారికి చమన్‌లాల్ అండగా నిలిచారన్నారు. చమన్ లాల్ జీ శతజయంతిని పురస్కరించుకుని తపాలా బిళ్లను విడుదల చేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించేందుకు ముందుకొచ్చిన కేంద్ర ప్రభుత్వాన్ని, భారతీయ తపాలా శాఖను ఉపరాష్ట్రపతి అభినందించారు. కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, మంత్రులు దేవ్‌సింగ్ చౌహాన్, రాజీవ్ చంద్రశేఖర్, మాజీ కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యసభలో 22.60% సమయం సద్వినియోగం పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో మూడోవారం 8 బిల్లులను ప్రవేశపెట్టారు. దీంతో ఎగువ సభలో సద్వినియోగమైన సమయం(ప్రొడక్టివిటీ) 24.2 శాతానికి పెరిగింది. ఇది మొదటి వారంలో 32.20 శాతం, రెండో వారంలో కేవలం 13.70 శాతంగా నమోదయ్యింది. ఈ మేరకు రాజ్యసభ పరిశోధక విభాగం గణాంకాలను విడుదల చేసింది. ఇప్పటిదాకా మొత్తం మూడు వారాల్లో సద్వినియోగమైన సమయం 22.60 శాతంగా తేలినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జూలై 19న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగసస్ స్పైవేర్‌తోపాటు మూడు కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు మొదటిరోజు నుంచే ఉభయ సభల్లో ఆందోళన కొనసాగిస్తున్నాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొత్త బిల్లులను ప్రవేశపెడుతూనే ఉంది. గతవారం 17 పార్టీలకు చెందిన 68 మంది సభ్యులు వివిధ బిల్లులపై జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. రాజ్యసభలో బిల్లులపై మొత్తం 3.25 గంటలపాటు చర్చలు జరిగాయి. -
సామాజిక బాధ్యత ఫీల్ అవ్వండి!
ఈ కోవిడ్ సంక్షోభంలో ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు హీరోయిన్ శ్రుతీహాసన్. కోవిడ్ బాధితులకు, కోవిడ్ నుంచి కోలుకున్నవారికి మన మంచి మాటలతో ధైర్యాన్ని నింపడం కూడా సాయమే అవుతుందంటున్నారామె. ‘‘కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్డౌన్ అప్పుడు ఇంట్లోనే ఉండి వంటలు, వ్యాయామాలు, ఆన్లైన్ క్లాసులతో రోజులను గడిపాం. కానీ ఇప్పటి కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల ఏర్పడిన పరిస్థితులు వేరు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఫీలై ఒకొరికొకరం సాయం చేసుకోవాల్సిన తరుణం ఇది’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ– ‘‘ఈ సమయంలో కొంతమందికి సోషల్ మీడియా ఓ మంచి సాధనంగా ఉపయోగపడుతోంది. కోవిడ్ సహాయ సమాచారాలను తెలుసుకోగలుగుతున్నాం. అయితే తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు. నా వరకు కచ్చితమైన వివరాలనే షేర్ చేయడానికే ప్రయత్నిస్తాను. నా టీమ్ గ్రౌండ్ లెవల్లో కొంత వర్క్ చేసిన తర్వాతనే నా టైమ్‌లైన్‌లో సమాచారాన్ని షేర్ చేస్తాం’’ అని పేర్కొన్నారు. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెబుతూ – ‘‘లాక్‌డౌన్‌కు ముందే ఓ హిందీ ఓటీటీ ప్రాజెక్ట్ చేశాను. ‘సలార్’ చేయాల్సి ఉంది. కమిటైన మరికొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. త్వరలో మరికొన్ని వివరాలు చెబుతాను’’ అని పేర్కొన్నారు శ్రుతీహాసన్. -
బాలికల హక్కులు సామాజిక బాధ్యతగా గుర్తించాలి
ఒంగోలు టౌన్: రాజ్యాంగపరంగా బాలికలకు కల్పించిన హక్కులు, సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు కోరారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ వద్ద ఆయన జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ బాలికా సంరక్షణతో పాటు సాధికారత కల్పించే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. రాజ్యాంగ బద్ధంగా బాలికలకు కల్పించిన హక్కులను గౌరవించాలన్నారు. ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా అవకాశాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.సరోజని మాట్లాడుతూ బాలికల హక్కులను కాపాడటంతో పాటు బాలిక విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాలికలు అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహకారం అందించాలని కోరారు. బాలికలు బాల్యం నుంచే పలు ఆంక్షలకు గురవుతున్నారన్నారు. నేటి సమాజంలో బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, అక్రమ రవాణా, అత్యాచారాలు వంటివి అక్కడకక్కడా జరుగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. సతీసహగమనం, కన్యా శుల్కం వంటి దురాచారాలను రూపుమాపినా ప్రస్తుతం బాలికలు ఎదుర్కొంటున్న ఇతర దురాచారాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నా రు. బాలికల చదువుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. బాలికల బంగారు భవిష్యత్ కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, ఏపీడీ జి. విశాలాక్షి, ఆంధ్రప్రదేశ్ ప్రొచైల్డ్ గ్రూపు ప్రతినిధి బీవీ సాగర్, చైల్డ్‌లైన్ జిల్లా కో ఆర్డినేటర్ ఎం.కిషోర్‌కుమార్ పాల్గొన్నారు. గంటకుపైగా నిలువు కాళ్లపై నిరీక్షణ జాతీయ బాలికా దినోత్సవం రోజు బాలికలు గంటకుపైగా నిలువు కాళ్లపై నిలబడాల్సి వచ్చింది. బాలికా దినోత్సవ ర్యాలీ కలెక్టరేట్ వద్ద ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని ప్రకటించడంతో అంతకంటే ముందుగానే పలు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన బాలికలతో పాటు బాలురను కూడా కలెక్టరేట్‌కు తరలించారు. జిల్లా ఉన్నతాధికారులు ర్యాలీ ప్రారంభిస్తారని మహిళా శిశు అభివృద్ధి సంస్థ అధికారులతో పాటు బాల బాలికలు ఎదురు చూశారు. నిమిషాలు, గంటలు అవుతున్నా ఉన్నతాధికారుల జాడ మాత్రం కనిపించలేదు. 11.15 గంటల సమయంలో జాయింట్ కలెక్టర్–2 మార్కండేయులు హడావుడిగా వచ్చి ర్యాలీకి సంబంధించిన జెండా ఊపి వెళ్లారు. అప్పటివరకు నిలువు కాళ్లపై నిరీక్షించిన బాల బాలికలు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. స్థానిక రామనగర్‌లోని మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగడంతో బాలబాలికలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ర్యాలీలు జరిగే ప్రతిసారీ బాల బాలికలకు పరీక్ష పెట్టడం జిల్లా యంత్రాంగానికి పరిపాటైంది. -
సామాజిక బాధ్యతను గుర్తు పెట్టుకుంటున్నారా?
మనదేశంలో సివిక్సెన్స్ పట్ల ధ్యాస చాలా తక్కువ అనే చెప్పాలి. అందుకే క్లీన్ అండ్ గ్రీన్, స్వచ్ భారత్ క్యాంపెయిన్ల అవసరం వచ్చింది. ప్రభుత్వం పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నా పాటించే వాళ్లు తక్కువగానే ఉంటున్నారు. రకరకాల సామాజిక నేపథ్యాలు కూడా ఇందుకు కారణం కావచ్చు. ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్లైనా నాగరక ప్రపంచంలో కనీస సామాజిక జ్ఞానం లేకుండా వ్యవహరించరాదు. మీ ధోరణి ఎలా ఉంటోంది? ఓసారి చెక్ చేసుకోండి! 1. సివిక్ సెన్స్‌ను పాటించడం అంటే సమాజంలో ఒక వ్యక్తిగా మీరు పాటించాల్సిన సామాజిక విలువలను గౌరవించడం అని మీ అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 2. రోడ్ల మీద ఉమ్మడం వంటి సామాజిక జ్ఞానం లేని ప్రవర్తనను ఇష్టపడరు. ఇతరుల వల్ల మీకు అసౌకర్యం కలిగినా సరే మీరు మరొకరికి ఇబ్బంది కలిగించకూడదని భావిస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను చాలా సాధారణంగా మీది కాని ఏ ప్రదేశంలోనైనా పడేయడానికి వెనుకాడరు. ఎ. కాదు బి. అవును 4. పార్కుల వంటి పబ్లిక్ ప్రదేశాలను ఎంట్రీ టికెట్ ఇచ్చాం కాబట్టి ఎలాగైనా వాడవచ్చు అనుకోకుండా పరిశుభ్రత విషయంలో నియమాలను పాటిస్తారు. ఎ. అవును బి. కాదు 5. మీరు ఉద్దేశపూరకంగా సామాజిక స్పృహను ఉల్లంఘించక పోయినప్పటికీ పొరపాటున మీ కారణంగా మరొకరు అసౌకర్యానికి గురయినట్లు గమనిస్తే వెంటనే వారికి క్షమాపణ చెబుతారు. సరిదిద్దే అవకాశం ఉన్న వాటిని సవరించుకుంటారు. ఎ. అవును బి. కాదు 6. మీరు వాడేసిన బ్యాండేజ్‌లు, స్వైన్ ఫ్లూ నిరోధక మాస్కుల వంటి వాటిని యథేచ్ఛగా పారేయడం ద్వారా అవి ఇతరులను అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి నియమిత పద్ధతిలోనే వాటిని డెస్ట్రాయ్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. సివిక్ సెన్స్‌తో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మీకు తెలుసు. మీ అభిప్రాయాలను ఎవరైనా చాదస్తంగా పరిహసించినా ఆ మాటలను పట్టించుకోరు. ఎ. అవును బి. కాదు 8. తమతోపాటు, సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిల్లలకు చెబుతారు. అలాగే తోటి పిల్లల సామాజిక నేపథ్యాన్ని విమర్శించడం తప్పని కూడా చెబుతుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సామాజిక జ్ఞానంతో ఇతరులకు ఆదర్శంగా ఉన్నారని అర్థం. ‘బి’లు ఎక్కువైతే మీరు సామాజికంగా మీ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనుకోవాలి. సమాజంలో పౌరులుగా సామాజిక విలువలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించండి. -
అమ్మా.. నన్ను అమ్మకే ..!
పోలీసుల ఆధ్వర్యంలో నేడు అవగాహన సామాజిక బాధ్యతను తీసుకున్న ఖాకీలు దేవరకొండ : దేవరకొండ ప్రాంతంలో వెలుగు చూస్తున్న శిశు విక్రయాల నిర్మూలనకు డీఎస్పీ జి. చంద్రమోహన్ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. శిశు విక్రయాలు, బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, స్త్రీ రక్షణ చట్టాలు అనే అంశాలపై గురువారం దేవరకొండలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ‘అమ్మా నన్ను అమ్మకే’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అయితే గతంలో ఇటువంటి అవగాహన సదస్సులను స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్ అధికారులు, శిశు విక్రయాల నియంత్రణ కమిటీలు చేపట్టగా ఈ సారి మాత్రం పోలీసులు ఈ సామాజిక బాధ్యతను గుర్తించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోజు రోజుకూ ఎక్కువవుతున్న శిశు విక్రయాలను అరికట్టడానికి సంబంధిత శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకే.. దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా నిరక్షరాస్యత, అధిక సంతానం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆడపిల్లలను విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘అమ్మా... నన్ను అమ్మకే’ అనే పేరుతో దేవరకొండ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం చేపట్టనున్నాం. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ముఖ్యంగాా ఈ సమస్య దేవరకొండ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడే చేపట్టాలనుకున్నాం. ఈ అవగాహన సదస్సులు దశలవారీగా మండలాలు, గ్రామాల్లో కూడా చేపట్టడానికి ప్లాన్ తయారు చేస్తున్నాం. - చంద్రమోహన్, దేవరకొండ డీఎస్పీ -
సామాజిక బాధ్యత ఎరిగిన పారిశ్రామికవేత్త
మన దిగ్గజాలు అవిభక్త భారతదేశంలోని అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలలో ఆయన ఒకరు. నెలకొల్పిన పరిశ్రమలను లాభాల బాటలో నడిపించడం సరే, అనాచారాలతో కునారిల్లుతున్న సమాజాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్న సామాజిక బాధ్యతనూ గుర్తెరిగిన అసాధారణ వ్యక్తి ఆయన. స్వాతంత్య్రానికి ముందు దేశంలో టాటా, బిర్లాల తర్వాత మూడో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా నిలిచిన దాల్మియా గ్రూప్ వ్యవస్థాపకుల్లో ఒకరైన జైదయాల్ దాల్మియా, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థల అభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారు. భవిష్యత్ సాంకేతిక అవసరాలపై గల దార్శనికత, ఉన్నత ఆదర్శాలపై గల నిబద్ధత దాల్మియాను భారత పారిశ్రామిక చరిత్రలో ప్రత్యేక స్థానంలో నిలుపుతాయి. వ్యాపార నేపథ్యం జైదయాల్ దాల్మియా 1904 డిసెంబర్ 11న రాజస్థాన్‌లోని చిరావా గ్రామంలో జన్మించారు. కొంతకాలం ఆయన కుటుంబం కలకత్తాకు వలస వెళ్లడంతో ఆయన ప్రాథమిక విద్య అక్కడే సాగింది. తర్వాత తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. చిరావాలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. అప్పటికే జైదయాల్ అన్న రామకృష్ణ దాల్మియా పలు వ్యాపారాలను నిర్వహిస్తూ ఉండేవారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక జైదయాల్ అన్నకు చేదోడుగా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపార విస్తరణలో కీలక పాత్ర పోషించి, అన్న మనసు చూరగొన్నారు. జైదయాల్ను సంప్రదించనిదే రామకృష్ణ దాల్మియా కీలక నిర్ణయాలేవీ తీసుకునేవారు కాదు. దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం ప్రారంభించిన తొలినాళ్లలో జైదయాల్ తనదైన ముద్రవేశారు. తీపి ప్రారంభం దాల్మియా గ్రూప్ వ్యాపార ప్రస్థానం చక్కెర కర్మాగారాలతో మొదలైంది. నిర్మల్‌కుమార్ జైన్ అనే బీహారీ వ్యాపారితో కలసి 1932-33లో దాల్మియా సోదరులు సుగర్ మిల్లును ప్రారంభించారు. మరుసటి ఏడాదే మరో చక్కెర మిల్లును ప్రారంభించారు. బ్యాంకింగ్, బీమా రంగాలపై దృష్టి సారించి, పంజాబ్ నేషనల్ బ్యాంకు, భారత్ ఫైర్ అండ్ జనరల్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల్లో ప్రధాన వాటాదారుగా ఎదిగారు. 1935లో రాజ్‌గంగపూర్‌లో తొలి సిమెంట్ కర్మాగారాన్ని స్థాపించారు. తర్వాతి కాలంలో ఇది దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్‌గా (డీబీసీఎల్) అవతరించింది. జైదయాల్ సారథ్యంలో దాల్మియా గ్రూప్ సిమెంటు కర్మాగారాల సంఖ్య అనతి కాలంలోనే ఆరుకు పెరిగింది. వీటిలో ఒకటి కరాచీలో ఏర్పాటు చేశారు. దేశంలో అన్ని ప్రాంతాల్లోనూ సిమెంటు కర్మాగారాలను ఏర్పాటు చేయడం ద్వారా అప్పట్లో అవిభక్త భారత్‌లో సిమెంటు రంగంలో ఏసీసీ గుత్తాధిపత్యానికి తెరదించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధాసక్తులు గల జైదయాల్, సిమెంటు కర్మాగారాల కోసం యూరోప్ నుంచి అధునాతన యంత్రాలను తెప్పించారు. సిమెంటు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు దేశంలోనే మొదటిసారిగా వెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. నిర్మాణ రంగంలో మరో మైలురాయిగా రౌర్కెలాలో 1954లో అగ్నిప్రమాదాలను తట్టుకునే ఇటుకలను తయారు చేసే కర్మాగారాన్ని నెలకొల్పారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాలో నిరుపయోగంగా మారిన వాహనాలను దిగుమతి చేసుకుని, తుక్కుగా మార్చి విక్రయించేందుకు అలెన్ బెర్రీ అడ్ కో కంపెనీని స్థాపించారు. పత్రికారంగం ప్రాధాన్యాన్ని గుర్తించి, అందులోనూ అడుగుపెట్టారు. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ప్రచురణ సంస్థ బెన్నెట్ కోల్మన్ అండ్ కో కంపెనీని కొనుగోలు చేశారు. స్వాతంత్య్రానంతరం జైదయాల్ దాల్మియా పలు ప్రభుత్వరంగ సంస్థల్లో కీలక పదవులు నిర్వహించి, వాటి అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే దాల్మియా గ్రూపులో విభేదాల వల్ల సోదరులు విడిపోయారు జైదయాల్ వాటాకు రాజ్‌గంగపూర్, కరాచీ సిమెంటు కర్మాగారాలు వచ్చాయి. కరాచీ కర్మాగారాన్ని 1964లో అమ్మేసి, స్వదేశంలోని సంస్థల విస్తరణకు కృషి చేశారు. రచయిత, సంస్కరణాభిలాషి... పారిశ్రామికవేత్తల్లో చాలామంది రచనా వ్యాసంగం, సంఘ సంస్కరణలు వంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటారు. జైదయాల్ దాల్మియా మాత్రం అందుకు భిన్నంగా ఈ రెండు రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారు. బెంగాలీ వైష్ణవ సాహిత్యాన్ని హిందీలోకి అనువదించడమే కాకుండా, ధర్మశాస్త్రం, అస్పృశ్యత, ప్రాచీన భారతంలో గోమాంసం వంటి పుస్తకాలను రాశారు. సంస్కృత భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం ఆయన రామకృష్ణ జైదయాల్ దాల్మియా శ్రీవాణీ అలంకరణ్ సంస్థను స్థాపించారు. సాంఘిక సంస్కరణలకు విశేషంగా కృషి చేశారు. వితంతువులకు, వికలాంగులకు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణ జైదయాల్ దాల్మియా సేవా సంస్థాన్ పేరిట సేవాసంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, జలసంరక్షణ వంటి కార్యక్రమాలకు విశేషంగా కృషిచేశారు. చరమాంకంలో వ్యాపారరంగం నుంచి విరమించుకున్న తర్వాత దాదాపు రెండు దశాబ్దాల కాలం సేవా కార్యక్రమాలకే అంకితమైన జైదయాల్ దాల్మియా 1993లో కన్నుమూశారు. - దండేల కృష్ణ -
సందేశాత్మకం
నిర్మల్ రూరల్ : ‘అయ్యో..! నాడబ్బులు పోయాయి.. ఇప్పడిదిప్పుడే నా ఏటీఎం కార్డు మార్చేసిండ్రు. నా అకౌంట్లో ఉన్న పైసలన్నీ డ్రాజేసి ఎత్తుకెళ్లిండ్రు.. ఇదెక్కడి అన్యాయం..’ ఇది ఏటీఎం మోసగాళ్ల బారిన పడ్డ ఓ బాధితుడి ఆక్రందన. ‘ఇప్పుడేం చేయాలిరా దేవుడా..! ‘మేం అడిగిన వివరాలు చెబితే.. మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి’ అని కాల్ చేశారు.. ఊరికే కాసులు వస్తాయని కక్కుర్తిపడి ఉన్న విషయాలన్నీ చెప్పిన. ఇప్పుడు నా ఖాతాలో నుంచే ఉన్న డబ్బులు ఖాళీ చేసిండ్రు. ఎవరికి చెప్పుకోను నా గోస.. అంటూ ఫేక్‌కాల్ బారిన పడ్డ బాధితుడి ఆవేదన ఇలా నిత్యం సమాజంలో ఎన్నో నేరాలు, మరెన్నో ఘోరాలు జరుగుతూనే ఉన్నాయి. అవగాహన లేక కొందరు.. అత్యాశ, అమాయకత్వంతో మరికొందరు మోసగాళ్ల బారిన పడుతూనే ఉన్నారు. ఇలాంటి వాటిపై ఏదైనా చేయాలి.. సమాజంలో జరుగుతున్న నేరాలపై కళ్లకు కట్టించేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్న తలంపుతో షార్ట్ల్మ్స్కు శ్రీకారం చుట్టాడు కాండ్రె రాంరాజ్. పట్టణంలోని బేస్తవార్పేట్కు చెందిన కాండ్రె సుష్మ, ప్రేంరాజ్ దంపతులు కుమారుడైన రాంరాజ్ చదువు పూర్తికాగానే కెమెరా చేతపట్టాడు. వీడియోగ్రఫీపై ఇష్టంతో ఆ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టాడు. బతుకుదెరువుకు ఉపయోగపడుతున్న ఈ వీడియోగ్రఫీని సమాజ శ్రేయస్సుకూ ఉపయోగించాలకున్నాడు. నేరాలు, ఘోరాలపై తన ఆలోచనలకు స్థానిక పోలీసుల నుంచి పూర్తి సహకారం అందడంతో రంగంలోకి దిగాడు. వరుసగా షార్ట్‌ఫిల్మ్స్.. నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డి, పట్టణ సీఐ జీవన్‌రెడ్డి, ఎసై ్సల సహకారం, సూచనలతో తన స్క్రిప్ట్‌లను తెరకెక్కించాడు. రోడ్డుభద్రత వారోత్సవాల నేపథ్యంలో ‘హెల్మెట్’పై షార్ట్ఫిలిమ్ తీశాడు. హెల్మెట్ ధరించడం వల్ల లాభం.. లేకపోవడం వల్ల జరిగిన నష్టం ఏంటో దీని ద్వారా వివరించాడు. దీన్ని స్థానిక ఛానల్స్‌లో ప్రసారం చేయడం, ప్రజల్లో మంచి రెస్పాన్స్ రావడంతో రెట్టింపు ఉత్సాహంతో రాంరాజ్ మరిన్ని రచనలు సిద్ధం చేశాడు. మళ్లీ పోలీసులు పూర్తిసహకారం అందించారు. వరుసగా రోడ్డుభద్రత, ఏటీఎంలలో మోసాలు జరుగుతున్న తీరు, ఫేక్‌కాల్స్, ఆన్లైన్ మోసాలు.. ఇలా పలురకాల నేరాలపై చిన్నచిత్రాలను, ఆడియో, వీడియో సీడీలను రూపొందించాడు. ఈ చిత్రాలు సహజంగా వచ్చేందుకు స్థానిక పోలీసులనే పాత్రధారులుగా ఎంచుకోవడం గమనార్హం. వీటితో పాటు పలు ఇతర షార్ట్ఫిలిమ్స్నూ సిద్ధం చేస్తున్నాడు. ఇప్పటి వరకు తనతో పాటు జి.రాజశేఖర్, మహేశ్, లక్ష్మణ్, సాయిసింగ్, గోపివర్మ, కపిల్రాథోడ్, అఖిల్, మురళీ, గాయకుడు ఎలిశెట్టి సుదర్శన్‌ల సహకారంతో ముందుకు సాగుతున్నాడు. ప్రశంసించిన ఎస్పీలు.. పట్టణ పోలీసులు, రాంరాజ్ కలిసి రూపొందించిన సందేశాత్మక షార్ట్ఫిలిమ్స్ సీడీలను గత ఎస్పీ తరుణ్‌జోషి, ప్రస్తుత ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆవిష్కరించారు. వీటిని సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా చిత్రీకరించిన రాంరాజ్‌ను ఇద్దరు ఎస్పీలూ అభినందించారు. శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలనూ అందించారు. పట్టణంలోనూ డీఎస్పీ, సీఐ, ఎసై ్సలు రాంరాజ్ అండ్ టీమ్‌ను ఘనంగా సన్మానించారు. పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు సైతం రాంరాజ్ తీసిన సందేశాత్మక షార్ట్‌ఫిల్మ్స్‌ను ప్రశంసించారు. ప్రజోపయోగం ఉన్న వీటిని ప్రస్తుతం లోకల్ ఛానల్స్‌లో ప్రసారం చేస్తుండడం విశేషం. వినూత్నంగా చేయాలని.. నేను ఎంచుకున్న వీడియోగ్రఫీ ఫీల్డ్‌లో ఉంటూనే సమాజానికి ఏదైనా సేవ చేయాలనుకున్నాను. అందుకే చేతిలోని కెమెరాతోనే వినూత్నంగా ముందుకు వెళ్లాలనుకున్నాను. నా కాన్సెప్ట్స్‌కు పట్టణ పోలీసుల సహకారం లభించడం, వారూ కొన్ని సూచనలు చేయడంతో సందేశాత్మక షార్ట్‌ఫిల్మ్స్ రూపొందించాను. ఇద్దరు ఎస్పీలు, మరెందరో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకోవడం చాలా సంతప్తినిచ్చింది. మున్ముందు మరిన్ని చిత్రాల రూపకల్పనకు స్ఫూర్తినిచ్చింది. కాండ్రె రాంరాజ్, షార్ట్‌ఫిల్మ్స్ డైరెక్టర్ ఈ ‘దాహం..’ తీరనిది.. నిర్మల్ రూరల్ : సకల ప్రాణకోటికి జీవనాధారం నీళ్లు. ప్రస్తుతం ఆ నీళ్లని అవసరానికి మించి వాడుతున్నం. కానీ కొన్ని గ్రామాలు తాగడానికి నీళ్లు దొరకక ప్రాణాలు కోల్పోతున్నాయి. అలాంటి ఓ గ్రామం కథే ఈ.. ‘దాహం’ అంటూ 7నిమిషాల 30సెకన్లలోనే.. ఒక్క ముక్కమాట లేకుండా.. కేవలం హావభావాలతో నీళ్లకున్న ప్రాధాన్యం, నీటిచుక్క లేక ప్రాణం విడుస్తున్న అడవిపల్లెల గుండెచప్పుడును కళ్లకు కట్టించారు. ఆ పల్లెల దాహం తీరుతుందో.. లేదో.. తెలియదు. కానీ.. సమాజానికి ఏదో చేయాలన్న ఈ ‘నలుగురు’ కుర్రాళ్ల దాహం మాత్రం ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఫ(ఫో)ర్ ది పీపుల్.. ఏదైనా చేయాలి చుట్టూ ఉన్న ప్రజా సమస్యలు.. దేశంలోని సమకాలీన పరిస్థితులే వారి చిత్రాలకు మూలాలు. మొదట నలుగురు కలిసి నలుగురికి ఉపయోగపడేలా.. ఫ(ఫో)ర్ ది పీపుల్ అని ఓ బ్యానర్ పెట్టుకుని ముందడుగేశారు. ఇందుకు మూలకారకుడు హరిచరణ్. నిర్మల్‌లోని బుధవార్‌పేట్‌కు చెందిన మౌర్య ఇందిరవదన, పార్థసారథి దంపతుల కుమారుడైన మౌర్య హరిచరణ్ బీఎఫ్ఏ పూర్తిచేశాడు. నిత్యం ఏదో సామాజిక అంశంపై హరిచరణ్, ఆయన స్నేహితులు బారడ్ గౌరవ్, తూము సంపత్, బారడ్ సౌషిల్లు చర్చించేవారు. ఇలా మాటలతోనే కాలం గడిపితే ఏం లాభం.. అన్న ఆలోచనల్లో నుంచి పుట్టిందే షార్ట్‌ఫిల్మ్ రూపకల్పన. ‘దాహం’తో మొదలు హరిచరణ్ రచన, కథ, కథనం.. ఎలా చేయాలో పూర్తిగా సిద్ధం చేశాడు. ఇందుకు స్నేహితులతో పాటు కళాకారుడు మహేశ్ చేతులు కలిపాడు. ముందుగా జిల్లాలో వేసవి వస్తే నీళ్లచుక్క కోసం తల్లడిల్లే గోండుగూడేల గోడును తెరకెక్కించాలనుకున్నారు. అనుకున్నట్లుగానే ‘దాహం’ పేరుతో కేవలం 7నిమిషాల నిడివిలోనే అర్థవంతమైన చిన్నచిత్రాన్ని రూపొందించారు. ఎలాంటి మాటలు లేకున్నా ఆద్యంతం హావభావాలతోనే సాగిన ఈ ఫిల్మ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ‘దాహం నిర్మల్’ పేరుతో అప్లోడ్ చేసిన ఈ షార్ట్‌ఫిల్మ్ వేలాది వీక్షకులను ఆకట్టుకుంటోంది. జాతి పతాక గౌరవం.. జనగణమన హరిచరణ్ అండ్ టీమ్ తెరకెక్కిస్తున్న రెండో షార్ట్‌ఫిల్మ్ జనగణమన. దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిన్నచిత్రం ఆగస్ట్15 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలయ్యింది. దేశంలో ఎన్ని కులాలున్నా.. ఎన్ని మతాలున్నా.. అందరూ చేతులెత్తి సెల్యూట్ చేసేది ఒక్క మువ్వన్నెల జెండాకే.. అన్న సందేశంతో దీన్ని చిత్రీకరించారు. ఇటీవల కశ్మీర్లో జాతీయజెండాకు అవమానం జరగడం, భిన్నత్వంలో ఏకత్వం.. ఇలాంటి సామాజిక, సమకాలీన అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడైన హరిచరణ్ పేర్కొన్నాడు. మున్ముందు మరిన్ని.. తమదైన శైలిలో సమాజానికి మెసేజ్ ఇవ్వాలన్న లక్ష్యంతో హరిచరణ్ మిత్రబృందం ఆలోచనలు చేస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తమ కాళ్లపై తాము నిలబడుతున్న ఈ యువత.. తమ చిత్రాలకు తాము సంపాదించిన డబ్బులనే పెట్టుబడిగా పెడుతోంది. రూపాయి కూడా ఆశించకుండా సమాజం కోసం నిస్వార్థంగా తమవంతు కృషిచేస్తామంటోంది. మౌర్య హరిచరణ్, షార్ట్‌ఫిల్మ్ డైరెక్టర్ ఏదో చేయాలి.. ఏదో సాధించాలి.. అన్న తపనే మమ్మల్ని షార్ట్ఫిల్మ్ప్ వైపు నడిపించింది. దాహం చిత్రం మాకు చాలా పేరుతెచ్చింది. మంచి ఉత్సాహాన్నిచ్చింది. ఇదే ఊపుతో జనగణమన రూపొందించాం. మున్ముందు పెద్ద సినిమా స్థాయికి ఎదగాలని, జనాలందరికీ మా సందేశం అందించాలన్నదే మా లక్ష్యం. -
డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం సామాజిక బాధ్యత
* సిమెంటు కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి భేటీ * రూ.230కే బస్తా సిమెంటును ఇచ్చేందుకు అంగీకరించిన కంపెనీలు సాక్షి, హైదరాబాద్: పేదలకు నాణ్యతతో కూడిన విశాలమైన రెండు పడక గదుల ఇళ్లు (డబుల్ బెడ్రూం) నిర్మిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి సామాజిక బాధ్యతగా సిమెంటు కంపెనీలు తోడ్పాటునివ్వాలని వారు కోరారు. దీనికి సంబంధించి మంత్రులు శుక్రవారం సచివాలయంలో సిమెంటు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో 2.72లక్షల ఇళ్ల నిర్మాణానికి సుమారు 27లక్షల మెట్రిక్ టన్నుల సిమెంటు అవసరమని మంత్రులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే లక్షా ఎనిమిది వేల ఇళ్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జిల్లాలో నిర్మించే రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను కలెక్టర్లకు అప్పగించామని..గతంలో మాదిరిగా బిల్లుల చెల్లింపులో జాప్యం ఉండబోదని మంత్రులు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం బస్తా సిమెంటును రూ.230కి అమ్మేందుకు సిమెంటు కంపెనీల ప్రతినిధులు అంగీకరించారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా సిమెంటును సరఫరా చేస్తామన్నారు. అనంతరం స్టీల్ కంపెనీల ప్రతినిధులతోనూ మంత్రులు భేటీ అయ్యారు. డబుల్ బెడ్రూం ఇళ్లకు గాను సుమారు 4.1లక్షల మెట్రిక్ టన్నుల స్టీలు అవసరమని మంత్రులు తెలిపారు. ధరపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. మంత్రులతో జరిగిన సమావేశంలో 30 సిమెంటు కంపెనీల ప్రతినిధులతో పాటు.. వీఎస్పీ, టాటా, సెయిల్ తదితర స్టీల్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి అశోక్ కుమార్, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి, గనుల శాఖ డైరక్టర్ సుశీల్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు రాజీవ్ స్వగృహ ఇళ్లు రాజీవ్ స్వగృహ పథకం కింద నిర్మించి.. ఖాళీగా ఉన్న ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగ సంఘం ప్రతినిధులు.. గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. బండ్లగూడ, పోచారంలో స్వగృహ పథకం కింద నిర్మించిన మూడు వేల ఇళ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. యూనిట్ ధరను నిర్ణయించాలని.. ఉద్యోగ సంఘాల నుంచి అందిన ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి తెలిపారు. -
ప్రధాని బీమా పథకాలకు అమితాబ్ ప్రచారం
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రజల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీమా పథకాలకు బాలీవుడ్ షెహన్షా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రచారం చేస్తున్నారు. ఇందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోకపోవడం విశేషం. సామాజిక బాధ్యతగా భావించి ఈ పథకాల ప్రచార వీడియోల్లో ఉచితంగా నటించేందుకు ఆయన అంగీకరించారు. ఇందులో భాగంగా తీవ్ర ఎండల్లో సైతం దాదాపు పది గంటల పాటు షూటింగ్లో పాల్గొన్నారు. అంతేకాదు, వాటికి డబ్బింగ్ కూడా స్వయంగా ఆయనే చెప్పారు. ఇందుకు 2 రోజులు కేటాయించారు. దీంతో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన కార్యక్రమాలు మరింతగా ప్రజల్లోకి వెళతాయనడంలో సందేహం లేదని ఈ వీడియోలను రూపొందించిన అడ్వర్టయిజింగ్ సంస్థ ప్రచార్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డెరైక్టర్ వినీత జైన్ పేర్కొన్నారు. -
పల్లెబాట పట్టండి
వైద్యులకు మంత్రి యు.టి.ఖాదర్ సూచన గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడం సామాజిక బాధ్యతగా గుర్తించాలని హితవు బెంగళూరు : వైద్య విద్యను పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవచేయడాన్ని సామాజిక బాధ్యతగా భావించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ సూచించారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేందుకు వైద్యులు ముందుకు రావాలని పేర్కొన్నారు. మడికేరిలో శుక్రవారం నిర్వహించిన జిల్లాస్థాయి వైద్యులు, కుటుంబ సంక్షేమ శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వైద్య కళాశాలల్లో ఉచితంగా విద్యతో పాటు వసతి, భోజనాన్ని పొందిన వారు సైతం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలు అందించేందుకు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప గొప్ప చదువులు చదివిన తాము పల్లెలకు వెళ్లడమా అన్న భావన చాలా మందిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో నిపుణులైన వైద్యుల కొరత తీవ్రంగా ఉందని తెలిపారు. తాము గొప్ప చదువులు చదివామన్న భేషజాన్ని వైద్యులు వదిలి, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే పేద రోగులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని అన్నారు. హెచ్1ఎన్1తో పాటు డెంగీ, మలేరియా, పాముకాటు, కుక్కకాటు తదితర అన్ని చికిత్సలకు అవసరమైన మందులు ఆస్పత్రుల్లో ఉండేలా చూసుకోవాలని సూచించారు. -
ప్రజా ప్రయోజనాలకు పట్టంకట్టే.. డెవలప్మెంట్ జర్నలిజం
పత్రికలో ప్రచురితమైన వార్త ప్రభుత్వాన్ని కదిలిస్తుంది. టీవీలో ప్రసారమైన కథనం అక్రమార్కుల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. రేడియోలో వచ్చిన కార్యక్రమం ప్రజలను చైతన్యపరుస్తుంది. పాత్రికేయానికి ఉన్న శక్తి ఇది. సామాజిక బాధ్యత ఉన్న వృత్తి జర్నలిజం. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి, సమాజానికి మేలు చేయాలనుకునే సేవాతత్పరులకు సరైన కెరీర్.. డెవలప్మెంట్ జర్నలిజం. వృత్తిపరమైన సంతృప్తి సాధారణంగా జర్నలిజం పరిధిలోకి రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, వ్యాపార, సినిమా.. ఇలా అన్ని రంగాలూ వస్తాయి. కానీ, డెవలప్మెంట్ జర్నలిజంలో మాత్రం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని పేదరికం, పర్యావరణం, వ్యవసాయం, ఆరోగ్యం, పరిశుభ్రత, లింగ వివక్ష, మౌలిక సదుపాయాలు, రహదారుల భద్రత, విద్య, మానవ హక్కులు.. ఇలా మానవాభివృద్ధికి సంబంధించిన రంగాలు ఉంటాయి. ఆయా రంగాల్లో సమస్యలను తెరపైకి తీసుకురావడం డెవలప్మెంట్ జర్నలిస్టుల బాధ్యత. అన్ని భాషల్లో మీడియా సంస్థలు విస్తరిస్తుండడంతో పాత్రికేయులకు అవకాశాలు భారీగా పెరుగుతున్నాయి. జర్నలిస్టులకు ప్రస్తుతం పత్రికలు, వార్తా చానళ్లు, మ్యాగజైన్లు, వెబ్సైట్లలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కుతున్నాయి. డెవలప్మెంట్ జర్నలిస్టులకు మంచి డిమాండ్ ఉంది. మీడియా సంస్థల మధ్య పోటీ విపరీతంగా పెరగడంతో పాత్రికేయులకు ఆకర్షణీయమైన వేతనాలు అందుతున్నాయి. వృత్తిలో ప్రతిభాపాటవాలు చూపితే సమాజంలో పేరుప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు. ఫ్రీలాన్స్‌గా కూడా పనిచేసుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేసే జర్నలిస్టులకు వృత్తిపరమైన సంతృప్తి లభిస్తుంది. కావాల్సిన నైపుణ్యాలు జర్నలిస్టులకు సామాజిక బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. ప్రజా ప్రయోజనాలే పరమావధిగా భావించాలి. ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లొంగని మనస్తత్వం అవసరం. మంచి కమ్యూనికేషన్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్ ఉండాలి. వార్తలు, వార్తల్లోని జీవరేఖను గుర్తించే నేర్పు ముఖ్యం. పాత్రికేయులు నిత్య విద్యార్థిగా మారాలి. ఎప్పటికప్పుడు జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలి. ఈ వృత్తిలో డెడ్లైన్లు ఉంటాయి కాబట్టి పొరపాట్లకు తావులేకుండా వేగంగా పనిచేయగలగాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులు ఆరోగ్యాన్ని నూటికి నూరు శాతం కాపాడుకోవాలి. అర్హతలు ఇంటర్మీయెట్, గ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఏ కోర్సులు చదివినా పాత్రికేయ రంగంలోకి అడుగుపెట్టొచ్చు. అకడమిక్ బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా జర్నలిస్ట్‌గా పనిచేయొచ్చు. అయితే, సోషల్ సైన్స్ కోర్సులు చదివితే ఇందులో రాణించడానికి అవకాశం ఉంటుంది. మనదేశంలో జర్నలిజం/మాస్ కమ్యూనికేషన్లో డిప్లొమా, పీజీ డిప్లొమా తదితర కోర్సులున్నాయి. ఆసక్తిని బట్టి ఇంటర్/గ్రాడ్యుయేషన్ తర్వాత వీటిలో చేరొచ్చు. మొదట మీడియా సంస్థలో ట్రైనీగా చేరి, అనుభవం, నైపుణ్యాలను పెంచుకొని పూర్తిస్థాయి జర్నలిస్టుగా కెరీర్లో నిలదొక్కుకోవచ్చు. వేతనాలు పని చేస్తున్న మీడియా సంస్థ(న్యూస్ చానల్, వార్తాపత్రిక, మేగజైన్)ను బట్టి వేతనం అందుతుంది. ప్రారంభంలో ఏడాదికి రూ.1.5 లక్షల నుంచి రూ.3.5 లక్షల వేతన ప్యాకేజీ పొందొచ్చు. అనుభవం, పనితీరు ఆధారంగా జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తిలో ప్రతిభ చూపితే తక్కువ సమయంలో ఉన్నత హోదాలు, అధిక వేతనాలు అందుకోవచ్చు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తే రాసిన కథనాలను బట్టి ఆదాయం లభిస్తుంది. కోర్సులను అందిస్తున్న సంస్థలు 1. ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్: www.osmania.ac.in/ 2. ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.efluniversity.ac.in 3. ఎ.పి. కాలేజీ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్: http://apcj.in/ 4. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్: www.braou.ac.in 5. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్-న్యూఢిల్లీ వెబ్సైట్: www.iimc.nic.in 6. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జర్నలిజం అండ్ న్యూ మీడియా వెబ్సైట్: www.iijnm.org 7. ఆసియన్ కాలేజీ ఆఫ్ జర్నలిజం వెబ్సైట్: www.asianmedia.org -
జీవితాంతం తెలంగాణ కోసం పోరాడిన జయశంకర్
తెలంగాణ కోసం అనుక్షణం పరితపించిన మహనీయుడు స్పీకర్ మధుసూదనాచారి కేయూ జంక్షన్లో ‘సార్’ విగ్రహావిష్కరణ నయీంనగర్ : ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జీవితాంతం కాలంతో పోటీపడుతూ తెలంగాణ కోసంపోరాడి అగ్రస్థానంలో నిలిచిన మహావ్యక్తి అని తెలంగాణ శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండలోని కేయూ జంక్షన్లో ప్రొఫెసర్ జయశంకర్ మెమోరియల్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత జయశంకర్ విగ్రహాన్ని ఆయన శనివారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన కర్తవ్య నిర్వహణను ఒక సామాజిక బాధ్యతగా స్వీకరించి తెలంగాణ సమాజ శ్రేయస్సు కోసం అనుక్షణం పరితపించిన మహామనిషి జయశంకర్‌సార్ అన్నారు. ఆయన స్ఫూర్తితో తెలంగాణ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కేసీఆర్ అమరణ నిరాహార దీక్ష సమయంలో తప్ప అన్ని సమయాల్లో జయశంకర్ సలహాలతోనే పని చేశారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ జయశంకర్ కేసీఆర్ వద్దకు నేరుగా వెళ్లి ఉద్యమ ఎత్తుగడలను, వ్యూహ, ప్రతివ్యూహాలను సుధీర్ఘంగా చర్చించి, దిశా, నిర్దేశం చే సేవాడన్నారు. తాము ఏదైనా కేసీఆర్‌తో చెప్పదలుచుకుంటే జయశంకర్ ద్వారా మాత్రమే చెప్పేవారమన్నారు. ఉపముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి తుదిశ్వాస విడిచే వరకు ఆచార్య జయశంకర్ తెలంగాణ విముక్తి కోసం అనేక విధాలుగా ప్రజలను చైతన్యపరిచారని గుర్తుచేశారు. వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ స్వచ్ఛదంగా జయశంకర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. కేయూ జంక్షన్‌కు జయశంకర్ చౌరస్తాగా అధికారికంగా నామకరణం చేసి, అన్నివిధాల అభివృద్ధి చేసేలా నగరపాలక సంస్థ కమిషనర్, కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ అధికారులతో చర్చించి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో వివక్షకు గురైన తెలంగాణ ప్రాంతాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసుకున్నప్పుడే జయశంకర్ ఆశయాలు నెరవేరుతాయన్నారు. జెడ్పీ చైర్పర్సన్ పద్మ మాట్లాడుతూ నూతన రాష్ర్టంలో జయశంకర్ ఆయాలకు అనుగుణంగా తెలంగాణ పునర్నిర్మాణం చేస్తామన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్‌తో తమ కుటుంబానికి 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన అనుక్షణం తెలంగాణ రాష్ట్రం విముక్తి కోసం మాత్రమే ఆలోచించేవాడన్నారు. మాజీ మంత్రి ప్రణయభాస్కర్ అసెంబ్లీలో తెలంగాణ పదం ఉచ్చరించినప్పుడు సీమాంధ్ర పాలకులు అవమానిస్తే, తన పదవికి రాజీనామా చేసినప్పుడు స్వయంగా జయశంకర్ సార్ అభినందించార ని గుర్తుచేశారు. ఆ తర్వాత ప్రణయ్ మిత్రమండలికి గౌరవసలహాదారుడిగా ఉంటూ తెలంగాణ ప్రజలను అనునిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యపరిచారని తెలిపారు. కార్యక్రమంలో సేవా సమితి నాయకులు బక్కి యాదగిరి, రావుల జగదీశ్వరప్రసాద్, ఠాకూర్ రతన్‌సింగ్, నాగభూషణం, సర్వేశం, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పమ్మి రమేష్, ఎంజాల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిథులను శాలువాలు, జయశంకర్ మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. -
క్రియేటివిటీ +సోషల్ రెస్పాన్సిబిలిటీ =శంకర్
ఒక ‘జెంటిల్‌మేన్’ పుట్టాలంటే, ఏ ‘జీన్స్’ కావాలో..! వాడు ‘భారతీయుడై’... దుండగుల పాలిట ‘అపరిచితుడై’... నరకంలో శిక్షలన్నీ భూమ్మీదే ఆచరణలో పెట్టేసి, అవినీతిని అంతమొందించేసి... ఒక్కరోజులోనే ముఖ్యమంత్రై, రాష్ట్రాన్ని బాగుచేసిన ‘ఒకే ఒక్కడు’... ఆగస్టు 17న పుడితే... అతనే దక్షిణ భారత దర్శకుల స్థాయిని, మోడరన్ జెనరేషన్లో సినిమా బడ్జెట్‌ని, మార్కెట్‌ని వంద కోట్లు దాటించిన ‘రోబో’టిక్ బ్రెయిన్, వీర ‘శివాజీ’ - శంకర్! పేరుకి తమిళ దర్శకుడైనా, తెలుగువారికి చాలా సుపరిచితుడు, ఆప్తుడు, అభిమాన దర్శకుడు శంకర్‌కి జన్మదిన శుభాకాంక్షలతో ఈ హార్టికల్ని చిరుకానుకగా అందిస్తున్నాను. సినిమాలో పెద్ద హీరో ఉండాలి. ప్రతి దర్శకుడి కోరికే ఇది. సినిమాకి బాగా ఖర్చుపెట్టే నిర్మాత కావాలి. ప్రతి దర్శకుడి అవసరమే ఇది. సినిమా సూపర్హిట్టవ్వాలి. ప్రతి దర్శకుడి కలే ఇది. కానీ, సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉండాలి. కేవలం దర్శకుడు శంకర్‌కి మాత్రమే మొదటి సినిమా నుంచి ఈ రోజుదాకా ఉన్న నిబద్ధత ఇది. నియమం ఇది. కట్టుబాటు ఇది. అన్ని కమర్షియల్ కథల్లో హీరోలాగే శంకర్ సినిమాలో హీరో కూడా దొంగతనాలు చేస్తాడు. చట్టం నుంచి తప్పించుకుంటాడు. కానీ విద్యావ్యవస్థ మీద విరక్తి చెంది, పేద విద్యార్థుల్ని పెద్ద చదువులు చదివిస్తాడు. సామాన్య విద్యార్థుల కలల్ని తను కంటాడు. అందుకే అతను జెంటిల్‌మేన్. పదిహేడు సంవత్సరాలు అసిస్టెంట్ డెరైక్టర్‌గా, అసోసియేట్ డెరైక్టర్‌గా, కో-డెరైక్టర్‌గా ఎస్.ఎ.చంద్రశేఖర్, కె.బాలచందర్ తదితరుల దగ్గర సుశిక్షితుడై, కె.టి.కుంజుమోన్ నిర్మాతగా ‘జెంటిల్‌మేన్’ సినిమాకి మొదటిసారి మెగాఫోన్ పట్టారు శంకర్. అప్పుడే విక్రమ్ధర్మా అనే ఫైట్ మాస్టర్ కోసం రోజూ లంచ్ బ్రేక్‌లో ‘భైరవ ద్వీపం’ షూటింగ్‌కి వచ్చేవారు. ఆ సినిమాకి నేను అసిస్టెంట్ డెరైక్టర్ని. విక్రమ్ధర్మాకి నాపై ఉన్న అభిమానం వల్ల, శంకర్‌తో కథాచర్చల్లో నన్నూ కూర్చోబెట్టుకునేవారు. ఆయన విజన్‌ని ఆయన మాటల్లో స్వయంగా నేనూ చూశాను. మనిషి వీర సౌమ్యుడు, సహనశీలి. ఆలోచనల్లో వీర కసి. పని అయ్యేదాకా సడలని పట్టుదల. స్ప్లిట్ పర్సనాలిటీ. అందుకే ‘అపరిచితుడు’ కథను అంత బాగా రాసుకోగలిగారు. ‘జెంటిల్‌మేన్’ సూపర్‌హిట్ అయ్యాక కూడా విక్రమ్ధర్మాని కలవడానికి వచ్చేవారు. అప్పుడు నేను కమల్‌హాసన్ సినిమా ‘నమ్మవర్’కి అసోసియేట్ని. ‘భారతీయుడు’ రూపుదిద్దుకుంటోంది... ఎ.ఎం.రత్నం నిర్మాతగా తెలుగు, తమిళ భాషల్లో. ఆ సినిమాకి నన్ను పనిచేయమని అడిగారు. అప్పటికే ఆయన దగ్గర తమిళ అసిస్టెంట్ డెరైక్టర్లు క్యూ కడుతున్నారు. మొదటి సినిమా రిలీజ్‌కి ముందు, రెండో సినిమా మేకింగ్‌లోనూ ఒకే రకమైన డౌన్ టూ ఎర్త్ నేచర్. ఆ టైమ్‌లోనే వాహినీ స్టూడియోకొచ్చి ఆయన పెళ్లికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించి వెళ్లారు. అప్పుడు నేను ‘శ్రీకృష్ణార్జున విజయం’ సినిమాకి అసోసియేట్ని. శంకర్‌ని కలిసినప్పుడు సినిమా గురించి తప్ప సినిమావాళ్ల గురించి ఆయన ఒక్కమాట కూడా తేడాగా మాట్లాడటం నేను వినలేదు. కలిసిన ప్రతిసారీ ఆయన స్థాయిలో అనూహ్యమైన మార్పులున్నాయి. కానీ స్వభావంలో అణువంతైనా మార్పు లేదు. స్థిత ప్రజ్ఞత అతన్నుంచి నేను నేర్చుకున్న మొదటి లక్షణం. సంగీతం, సాహిత్యం, హాస్యం, శృంగారం, రౌద్రంలో ఎక్కడా అతి గానీ, అసభ్యత గానీ, అశ్లీలం గానీ లేకపోవడం అతన్నుంచి దర్శకుడిగా నేను నేర్చుకున్న రెండో లక్షణం. 1990ల తర్వాతి దక్షిణ భారత చలనచిత్ర సీమ గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో కచ్చితంగా శంకర్ ముందు వరుసలో ఉంటారు. సామాన్య మానవుడిని, నిరక్షరాస్యుడిని కూడా మెప్పించేలా, ఆలోచింపజేసేలా మంచి మాటలు చెప్పాలంటే, ఆ సినిమా దర్శకుడు చాలా విజ్ఞుడై ఉండాలి. తెలివితేటలు, సాహితీ పరిజ్ఞానంతో పాటు చాలా కామన్సెన్స్ ఉన్నవాడై ఉండాలి. గొప్ప టెక్నీషియన్స్‌ని, మేథావులైన రచయితల్ని, స్టార్స్‌ని, బాగా డబ్బుపెట్టే నిర్మాతని సమకూర్చుకున్నంత మాత్రాన శంకర్ స్థాయి దర్శకుడైపోరు ఎవరూ. నేల, బెంచీ, బాల్కనీ, రిజర్వ్డ్, ఎగ్జిక్యూటివ్, గోల్డ్ క్లాస్ టిక్కెట్లు కొన్న కోట్లమంది మెదళ్లని ఏకకాలంలో కదిలించి, నవ్వించి, ఒళ్లు గగుర్పొడిపించి, అద్భుతం అనిపించి, ఆ! అవును నిజమే కదా అని ఆలోచింపజేసి, సినిమా సూపర్‌హిట్ అనిపించడం అంటే... నేను ఈ ఆర్టికల్ రాసినంత సింపుల్ కాదు... శంకర్ లైఫ్ స్టైల్ అంత సింపుల్ కూడా కాదు - శంకర్ అంత టఫ్ - శంకర్ అంత కాంప్లికేటెడ్. ఎంతో ధైర్యం, విజన్, యాటిట్యూడ్, ఫైర్, గట్ ఫీలింగ్, సెల్ఫ్ బిలీఫ్ ఉంటే తప్ప ఎవరూ శంకర్ కాలేరు. శంకర్ ఒక ప్యాకేజీ. నవీన దర్శకుడి లక్షణాలకి ఒక నమూనా. న్యూ ట్రెండ్ సినిమాకి, టెక్నికల్‌గా ఎదుగుతున్న సొసైటీకి ఒక దిక్సూచి. యూత్‌కి ఒక రోల్ మోడల్. రజనీకాంత్ నల్లగా ఉంటాడని మనకి చిన్నప్పట్నుంచీ తెలుసు. కానీ నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టే పెళ్లి చేసుకోను అనేస్తుంది శ్రీయ ‘శివాజీ’లో. ఆశ్చర్యంగా రజనీ తెల్లగా తయారవుతారు. ఇది టెక్నికల్‌గా సాధ్యమే అయినా, ఈ థాట్‌ని సినిమాలో పెట్టాలంటే, దర్శకుడికి చాలా విషయం ఉండాలి. హిమాలయాలకి వెళ్లొచ్చీ వెళ్లొచ్చీ హిమాలయమంత కీర్తిని మూటగట్టుకున్న సూపర్‌స్టార్‌కి ఏ విలన్ని పెట్టినా, వెయ్యి మంది విలన్లని పెట్టినా ఆనదనిపించి, ఆయనకి ఆయన్నే విలన్ని చేసేశారు శంకర్ ‘రోబో’లో. అది హైట్స్ ఆఫ్ ఇంటెలిజన్స్. కేరళ విద్యను ప్రయోగించి, లంచగొండుల భరతం పట్టే స్వాతంత్య్ర సమరయోధుడు ‘భారతీయుడు’. కవలలు పుడితే... ప్రేమించే అమ్మాయి కూడా కవలలే కావాలని పట్టు పడితే, సాంకేతికంగా తనో చెల్లెల్ని సృష్టించుకున్న అమ్మాయి కథ ‘జీన్స్’. చాలామంది విద్యార్థినీ విద్యార్థులకి చిన్నప్పట్నుంచీ వ్యాసరచన పోటీల్లోనో, వక్తృత్వ పోటీల్లోనో ఇచ్చే టాపిక్ ‘‘నేనే ముఖ్యమంత్రినైతే...’’. ఆ టాపిక్‌కి ఆయన వెండితెర మీద రాసిన అద్భుత వ్యాసరచన ‘ఒకే ఒక్కడు’. అన్నీ జీవితాల్లోంచి పుట్టినవే. సామాన్య, మధ్య తరగతి, దిగువ మధ్యతరగతి జీవితాల్లోని అంతః సంఘర్షణలే. ఆవిష్కరించే తీరు మాత్రం అద్భుత రసంతో. అందుకే ఆయన సినిమాలు ఒకే రకమైన సామాజిక పరిస్థితుల్లో పెరిగిన దక్షిణ భారతావనిలో పెద్ద హిట్టు. బహుశా ఈ బలమే వేరే వ్యక్తిత్వం ఉన్న ఉత్తర భారతంలో బలహీనత అయినట్టుంది. వాళ్లకీ సమస్యలు చిన్నవిగానో, అసలు లేనట్టో ఉండుంటాయి. మాఫియా గన్నులో, ప్రియురాలి కన్నులో... ఈ రెండే దశాబ్దాలుగా ప్రధాన టాపిక్ అయిన నార్త్ ఇండియాలో పెన్షన్ ఆఫీసుల్లో లంచాలు, స్వతంత్ర సమరయోధుల బాధలు, అవినీతి, విద్యావ్యవస్థలో ప్రక్షాళనలు - ఇంత హెవీనెస్ అర్థం కాకపోయి ఉండొచ్చు. లేదా సహజంగా అనిపించకపోయి ఉండొచ్చు. ఏదేమైనా శంకర్ ఎడాప్ట్ చేసుకోవలసిన అవసరం లేదు. ఈ పుట్టినరోజు బాలుడు మనోహరుడై మళ్లీ ముందుకు వస్తున్నాడు. ఈసారి సమస్య ఏదో, పరిష్కారం ఏదో! భారతీయ పురాణ ఇతిహాసాలు వేదాల సారమా? అత్యాధునిక సాంకేతిక మాయాజాలమా? మనిషి సాధారణంగా ఉండాలి. కలలు అసాధారణంగా ఉండాలి. అలా సినిమాని కలగన్నారు శంకర్. వాటిని అన్ని సినిమాల స్థాయిలో కాకుండా, ఇంకా విపరీత ధరలకి అమ్మే రేంజ్లో కలలు కన్నారు. ఆ కలల్లో ఒక అర్థవంతమైన, అవినీతి రహితమైన సమాజానికి కావాల్సిన సందేశాల్ని చుట్టి ఇస్తున్నారు. బురద ఆర్థికంగా నిరుపేద అయితే, అందులో పుట్టిన పద్మం వెలకట్టలేనంత విలువైనది. శంకర్ మనిషిగా, మామూలు దర్శకుడిగా వెలకట్టలేని విలువైన వ్యక్తి. ఇది ఒక్క రాత్రిలోనో, అదృష్టాన్ని నమ్ముకుంటేనో జరగలేదు. పదిహేడేళ్ల పునాది, ఆగని చదువు, అపరిమితమైన మేధోమథనం - ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని, అతను తీసే సినిమాలని కలిపి అనలైజ్ చేయలేం. కానీ ఒక దర్శకుడు తీసే సినిమాల వల్ల, అతని వ్యక్తిత్వం ఎంత గొప్పదో మనకి తెలిసిపోతుంది. శంకర్ అంత గొప్పవాడు. తను నిర్మాతగా మారి, తన దగ్గర పనిచేసిన మంచి సహాయ దర్శకుల్ని దర్శకులుగా ప్రమోట్ చేసిన సహృదయుడు. న్యూవేవ్ దర్శకులందరికీ టార్గెట్ తన సినిమా, సినిమాకీ మరో వందమైళ్లు ముందుకి జరిపి కష్టపెట్టిస్తున్న కృషీవలుడు. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. మర్యాదగా, వినయంగా మాట్లాడతారు. క్లుప్తంగా చెప్తారు. గుప్తంగా దానాలు చేస్తారు. 20 ఏళ్ల కెరీర్లో, సెలెబ్రిటీ లైఫ్‌లో ఎటువంటి చిన్న కాంట్రవర్సీ గానీ, చెడు గాసిప్పు గానీ అంతర్జాలంలోను, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలోనూ లేని ఏకైక వ్యక్తి శంకర్. ఇది నిజంగా చాలా చాలా కష్టం. కలల వ్యాపారంలో సంఘ సంస్కరణలని అమ్మడం అన్నిటికన్నా అత్యంత కష్టమైన పని. దానిని అమిత ఇష్టంగా చేసే వ్యక్తిగా, దర్శకుడిగా శంకర్ అంటే తెలుగు, తమిళ ప్రేక్షకులలాగా నాక్కూడా అమిత ఇష్టం. సాటి దర్శకుడిగా చాలా గౌరవం. ఈ పుట్టినరోజు ఆయనకి మనోహరమైన మంచి హిట్టుని ఇస్తుందని గట్టిగా నమ్ముతూ... ఒక దర్శకుడినైనా, సాటి దర్శకుడు శంకర్ గురించి నన్ను ఈ సందర్భంగా ఆర్టికల్ రాయమని పురమాయించిన ‘సాక్షి’కి కృతజ్ఞతలు. - మీ వి.ఎన్.ఆదిత్య వ్యక్తిగతంగా శంకర్... తమిళ చిత్రం ‘కుంగుమమ్’లో శివాజీ గణేశన్ పాత్ర పేరు శంకర్. తనకో కొడుకు పుడితే శంకర్ అని పేరు పెడతానని అనుకున్నారట శంకర్ తల్లి. పుట్టగానే ఆ పేరే పెట్టేశారట. సినిమాల్లోకి రాకముందే చెన్నయ్‌లోని హాల్డా కంపెనీలో శంకర్ పనిచేవారు. అప్పుడు కార్మిక సంఘం కార్యకలాపాల విషయంలో చిన్న వివాదం జరిగి, మూడు రోజులు జైలు శిక్ష కూడా అనుభవించారట. శంకర్‌కి గడియారాలంటే చాలా ఇష్టం. ఇప్పటివరకు రకరకాల గడియారాలను సేకరించారు. ఎలాంటి సమయంలో అయినా చేతికి ఉన్న గడియారానికి ఒక్క గీటు కూడా పడకుండా జాగ్రత్తపడతారట. పెళ్లయిన తర్వాత శంకర్ స్వయంగా షాప్స్కి వెళ్లి బట్టలు కొన్నదే లేదట. తన భార్య ఈశ్వరి సెలక్ట్ చేసినవే ఆయన ధరిస్తారట. ‘బాయ్స్’ సినిమాకి ముందు శంకర్ సిగరెట్లు తాగేవారు. ఆ సినిమా తర్వాత పూర్తిగా మానేశారు. అప్పుడప్పుడు రజనీకాంత్ ఆ విషయం గురించి ప్రస్తావిస్తూ.. ‘అంత సులువుగా ఎలా మానేయగలిగావ్ శంకర్’ అని అడగుతుంటారట. షూటింగ్ లొకేషన్లో సిల్లీ జోకులేయడం శంకర్‌కి నచ్చదు. చాలా సీరియస్‌గా ఉంటారు. ఒకవేళ తనకు నచ్చనిది ఏదైనా జరిగితే.. అక్కణ్ణుంచి దూరంగా వెళ్లిపోతారు. కోపం తగ్గిన తర్వాతే లొకేషన్లోకి అడుగుపెడతారట. ప్రతి రోజూ దాదాపు గంటసేపు షటిల్ కాక్ ఆడటం శంకర్ అలవాటు. షూటింగ్ లొకేషన్లో అప్పుడప్పుడూ తన సహాయ దర్శకులతో కూడా ఆడుతుంటారట. భారతదేశంలో తాజ్‌మహల్, విదేశాల్లో పీసా టవర్ అత్యద్భుత కట్టడాలని శంకర్ అంటారు. తాజ్‌మహల్‌ని ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని, పీసా అలా ఒరిగిపోయి ఉండటం వింతగా ఉంటుందని అంటుంటారట. -
రోడ్డు భద్రత.. సామాజిక బాధ్యత
ఒంగోలు : రోడ్డు భద్రత ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని ఆర్టీసీ రీజియన్ మేనేజర్ వి.నాగశివుడు అన్నారు. ఆర్టీసీ గ్యారేజీ ఆవరణలో ఆదివారం జరిగిన రీజియన్ స్థాయి ప్రమాదరహిత వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. ప్రస్తుతం ఎక్కువగా ప్రమాదాలు మానవ తప్పిదాల వల్లే చోటుచేసుకుంటున్నాయన్నారు. రోడ్డు భద్రతపై పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన లేని కారణంగానే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లకు సంస్థ సీయూజీ సిమ్ కార్డులను అందజేసింది అత్యవసర సమయంలో సమాచార సేకరణ లేదా సమాచారం తెలియజేసేందుకు మాత్రమేనన్నారు. అందువల్ల వాటిని ప్రయాణంలో తక్కువగా వినియోగించుకోవాలని సూచించారు. బస్సుల కండీషన్ మెరుగుపరిచేందుకు ఆర్టీసీ ప్రత్యేక దృష్టిపెట్టిందని పేర్కొన్నారు. ఆర్టీసీ సీఎంఈ రవికాంత్ మాట్లాడుతూ సమాజంలో నేడు ఆరోగ్య, ఆర్థిక, ఉద్యోగ భద్రత వంటి వాటిపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహిస్తున్నా రోడ్డు భద్రతపై మాత్రం దృష్టి సారించడంలేదన్నారు. ప్రజలను చైతన్యం చేయడం కోసమే ఆర్టీసీ ప్రమాద రహిత వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రమాద రహిత డ్రైవర్లను సన్మానించడం ద్వారా కార్మికుల్లో కూడా నూతనోత్తేజాన్ని ఆర్టీసీ నింపుతోందన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ డిప్యూటీ సీటీఎం రాజశేఖర్, పలు డిపోల మేనేజర్లతో పాటు పలు కార్మిక సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డిపో స్థాయిలో ప్రమాదరహిత డ్రైవర్లుగా వరుస మూడు స్థానాల్లో నిలిచిన వారికి సన్మానంతో పాటు ప్రథమ స్థానం కింద రూ.500, ద్వితీయ రూ.400, తృతీయ రూ.300 నగదు బహుమతిని అందజేశారు. -
సామాజిక బాధ్యతతో సేవా వైద్యం
‘డాక్టరీ చదివాను.. మూడేళ్లు వైద్యం కూడా చేశాను. అయినా ఏదో వెలితి.. ఇంకేదో చేయాలన్న తపన. కేవలం రోగులకే సేవ చేసే వైద్యం కన్నా.. పేదరికం, అసమానత.. వంటి రుగ్మతలతో బాధపడుతున్న మెజారిటీ ప్రజానీకానికి సేవావైద్యం చేయడమే గొప్పదన్న భావనే నన్ను సివిల్స్ వైపు మళ్లించింది’... ‘నా స్నేహితులెందరో విదేశాల్లో స్థిరపడ్డారు. ప్రయత్నిస్తే నాకూ అవకాశాలు వచ్చేవే.. కానీ నాన్న అంగీకరించలేదు. స్వదేశంలోనే.. ప్రభుత్వ సర్వీసులో ఉంటూ ప్రజలకు సేవ చేయాలన్నది ఆయన ఆకాంక్ష. ఆయన స్ఫూర్తితోనే ఈ రంగంలోకి వచ్చాను. ఈ స్థాయికి రాగలిగాను’.. అని చెప్పార్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్. జిల్లా కలెక్టర్‌గా వారం క్రితమే బాధ్యతలు చేపట్టిన ఆయన్ను ‘సాక్షి’ మంగళవారం కలిసినప్పుడు తన కుటుంబ నేపథ్యాన్ని, అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. వ్యక్తిగతం మాది చంఢీగఢ్. నాన్న పి.ఎన్.ఉప్పల్.. ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించి పదవీ విరమణ చేశారు. అమ్మ ఉషా ఉప్పల్.. గృహిణి. భార్య కోమల్ ఉప్పల్.. ఆమె చిన్నపిల్లల వైద్యురాలు. మాకు ఇద్దరు పిల్లలు. ఒకరు బ్రిజు (6), మరొకరు దిజా (3). మా అన్నయ్య దంత వైద్యుడు. ఈ రకంగా చూస్తే.. మాది వైద్య, ఉద్యోగ కుటుంబం. ఉద్యోగ ప్రస్థానం తొలుత నేను మెడిసిన్ చదివా. ఆరేళ్ల చదువు తర్వాత మూడేళ్లు వైద్యాధికారిగా సేవలందించా. ఉద్యోగం బాగానే ఉన్నా ఏదో లోటు. మరేదో సాధించాలన్న తపన. మా కజిన్ ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. పైగా మా నాన్న అత్యధిక ప్రజలకు సేవ చేసే రంగం ఎంచుకోమని సూచించారు. ఆయన స్పూర్తితో.. కజిన్‌ను ఆదర్శంగా తీసుకొని ఐఏఎస్ అవ్వాలని నిర్ణయించుకున్నా. రెండుసార్లు పరీక్ష రాసి విఫలమయ్యాను. మూడోసారి దేశంలోనే మూడో ర్యాంకు సాధించగలిగాను. ఆ విధంగా 2005లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. 2007లో విశాఖలో ట్రైనీ ఐఏఎస్‌గా పనిచేశా. తర్వాత విజయవాడలో సబ్ కలెక్టర్‌గా, కొన్నాళ్లు గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించా. కృష్ణా జిల్లా జేసీగా పనిచేశా. మరికొన్నాళ్లు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా కూడా చేసి కేంద్ర సర్వీసులకు వెళ్తాను. అక్కడ ఏడాదిన్నర పని చేశాను. ఈనెల 14న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ ఇచ్చారు. కలెక్టర్‌గా ఇదే తొలి అడుగు. విదేశాల్లో అవకాశాలున్నా.. నా స్నేహితులు ఎంతో మంది విదేశాల్లో స్థిరపడిపోయారు. కావాలనుకుంటే నాకూ అవకాశం వచ్చేదే. కానీ నాన్న ఒప్పుకోలేదు. స్వదేశంలోనే సేవలందించాలని కోరారు. ఆయన ఆకాంక్ష నెరవేర్చేందుకు ఇక్కడే ఉండిపోయా. మాదీ పంజాబీ అయినా ట్రైనింగ్‌లో చాలా నేర్చుకున్నా. తెలుగు భాషపై ఎంతో మమకారం ఉంది. శిక్షణ సమయంలో తెలుగు నేర్చుకోవాలన్న నిబంధన కూడా ఉంది. ఇప్పుడు తెలుగు పూర్తిగా మాట్లాడగలుగుతున్నా. పేపర్ చదువుతా. తెలుగులో రాయగలను కూడా. సిక్కోలుకు ఏం తక్కువ.. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా పోస్టింగ్ అనగానే సంబరపడిపోయా. ఇక్కడి ప్రజలు అమాయకులు. మంచివాళ్లు. అందర్నీ ప్రేమిస్తారని విన్నా. మంచి మనసున్న వ్యక్తులు ఇక్కడున్నారని గత కలెక్టర్ కూడా చెప్పారు. అందమైన తీర ప్రాంతం శ్రీకాకుళం సొంతం. అందువల్ల పర్యాటక రంగం అభివృద్ధిపై దృష్టి సారిస్తాను. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను తీర్చిదిద్దుతా. విద్యా విభాగంలో మార్పులు తెస్తా. పరిశ్రమలకు ఊతమిస్తా. గిరిజన గ్రామాల్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తా. జిల్లా అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తా. ప్రభుత్వ సహకారంతో జిల్లాలో గ్రోత్ సెంటర్ ఏర్పాటుకు ప్రయత్నిస్తాను. దేవాలయాల పరిరక్షణకు పాటుపడతా. ఫుడ్ ప్రాసెసింగ్ (పార్క్) యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి లేఖ రాస్తా. పైనాపిల్ పంటకు మార్కెట్ సౌకర్యం, మత్స్యకార గ్రామాల్లో జెట్టీ ఏర్పాటుకు కృషి చేస్తాను. సంక్షేమ పథకాల అమలుపై శ్రద్ధ జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుకు కృషి చేస్తా. ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా. అన్ని వనరులూ ఉండి వెనుకబడిన జిల్లాగా మిగిలిపోయిన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి భవిష్యత్తులో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగేలా నేతలు చర్యలు తీసుకోవాలి. విశాఖ సహా తిరుపతి, విజయవాడ పట్టణాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందన్న మాట వాస్తవమే అయినప్పటికీ ఈ జిల్లాను ప్రగతి పథంలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ సహాయం కోరతాను. అందరూ సహకరిస్తే కచ్చితంగా శ్రీకాకుళం జిల్లా అన్ని రంగాల్లోనూ ముందంజ వేయడం ఖాయం. - శ్రీకాకుళం, సాక్షి ప్రతినిధి -
తారలొచ్చారు
తమిళసినిమా, న్యూస్‌లైన్ : ఓటు వేయడానికి మనతారలు తరలి వచ్చారు. ప్రేక్షకులకు తమ నటనతో కాలక్షేపాన్ని ఇవ్వడమే కాక, సామాజిక బాధ్యతపై ప్రజలకు అవగాహన కలిగించడానికి ఎన్నికల వేళ తాము ముందుంటామని నిరూపించారు. తమిళనాడులో సార్వత్రిక ఎన్నికలు గురువారం జరిగిన నేపథ్యంలో పలువురు ప్రముఖ నటీనటులు ఓటు హక్కును వినియోగించుకుని పలువురికి ఆదర్శంగా నిలిచారు. వీరిలో రజనీకాంత్, కమలహాసన్, శివకుమార్, సూర్య, విజయ్, అజిత్, కార్తీ, విశాల్, జీవా తదితరులు ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకోండి రజనీకాంత్ పోయెస్‌గార్డెన్ సమీపంలోని స్టెల్లామేరి కళాశాలలోని పోలింగ్ బూత్‌లో ఓటువేశారు. అనంతరం రజనీ విలేకరులతో మాట్లాడుతూ అందరూ ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుస్థిర ప్రభుత్వం మరో ప్రముఖ నటుడు కమలహాసన్, గౌతమి దంపతులు తేనాంపేటలోని పోలింగ్ బూత్‌లో ఓటేశారు. నటుడు శరత్‌కుమార్ కొట్టివాక్కంలోని నెల్లై నాడార్ రోడ్డులోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. భార్య రాధికతో కలసి వచ్చి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు విజయ్ అడయారు కామరాజర్ అవెన్యూలో ఓటు వేశారు. నటుడు అజిత్ తిరువాన్మియూరులోని కార్పొరేషన్ పాఠశాలకు ఉదయం 6.50 నిమిషాలకు వచ్చి పోలింగ్ ప్రారంభమయ్యే వరకు వేచి ఉండి ఓటు వేశారు. నటి ఖుష్బు, తన భర్తతో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నటుడు జీవా టీ.నగర్లో హిందీ ప్రచార సభలోని పోలింగ్‌బూత్‌లో ఓటు వేశారు. -
పంపేందుకు పైరవీ
సంగారెడ్డి: కలెక్టర్ స్మితా సబర్వాల్‌ను జిల్లా నుంచి పంపించేందుకు బడా పారిశ్రామిక సంస్థలు హైదరాబాద్‌లో ఎత్తులు వేస్తున్నాయి. ఆమె బదిలీ కోసం పారిశ్రామికవేత్తలంతా కలిసి ఏకంగా సెక్రటేరియట్‌లోనే లాబీయింగ్ మొదలుపెట్టారు. ‘ముఖ్య’నేత బంధువు ద్వారా ఇప్పటికే ‘రాయబేరాలు’ చేసినట్టు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి ‘సాక్షి’కి సమాచారం అందింది. రూ.కోట్లకు కోట్లు ఆర్జిస్తూ ‘సామాజిక బాధ్యత’ను మరిచిపోయిన కంపెనీల ముక్కుపిండి సీఎస్ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ) నిధులు వసూలు చేయాలనుకోవడమే ఆమెపై పారిశ్రామికవేత్తల గుర్రుకు కారణంగా తెలుస్తోంది. రూ.కోట్లలో ‘సామాజిక బాధ్యత’ బకాయిలు జిల్లాలోని ప్రతి పరిశ్రమ స్థాపనకు అయ్యే వ్యయంలో 0.02 శాతం సొమ్మును సీఎస్ఆర్ నిధుల కింద చెల్లించాలి. జిల్లాలో దాదాపు 958 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. ఈ లెక్కన కార్పొరేటు కంపెనీలు రూ.కోట్లలో బకాయి పడ్డాయి. వీటినుంచి 2012-13 ఆర్థిక సంవత్సరానికే రూ.41.64 కోట్లు రావాల్సి ఉంది. ఈ నిధుల వసూలుపై జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవ ల సంబంధిత అధికారులతో ‘సామాజిక బాధ్యత’ నిధులపై సమీక్ష జరిపారు. జనవరి మాసాంతం లోపు కనీసం 50 శాతం బకాయిలు వసూలు చేయాలని, నిధులు చెల్లించని పరిశ్రమల బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇలా వసూలుచేసిన మొత్తాన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాలని ఆమె నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐదుగురు అధికారులను నియమించి పరిశ్రమల వివరాలన్నీ తెప్పించారు. బాకీ వసూలుచేసే బాధ్యతను కూడా వారికే అప్పగించారు. ఈ పరిస్థితుల్లో సీఎస్ఆర్ బకాయి నిధులు చెల్లించడం ఆయా కంపెనీలకు అనివార్యంగా మారింది. దీంతో పారిశ్రామికవేత్తలంతా ఏకమై సీఎస్ఆర్ నిధులు చెల్లించకుండా ఉండేందుకు కొత్త ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఒకసారి సీఎస్ఆర్ నిధులు చెల్లించడం ప్రారంభిస్తే ప్రతి కలెక్టర్ ఇదే విధానాన్ని కొనసాగిస్తారనే భయంతోనే వారంతా కలెక్టర్ స్మితాసబర్వాల్‌ను బదిలీ చేయించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. సీఎస్ఆర్ నిధుల బకాయి రూ.41 కోట్లు ఉండడంతో అందులోని 25 శాతం నిధులు ఖర్చు చేస్తే కలెక్టర్‌నే బదిలీపై పంపొచ్చనే ఆలోచనతో పారిశ్రామికవేత్తలంతా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో కూర్చుని సచివాలయంలో పథక రచన చేస్తున్నారని, అవసరమైతే ఢిల్లీ నుంచి ఒత్తిడి తెచ్చి ఆమెను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. -
మరువలేని మహానేతకు చిత్రాంజలి...
కోటేశ్వరరావు ఇప్పటికి 25కి పైగా వైయస్ చిత్రాలను గీశారు. ఆ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజస్సు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది. సమాజంలోని అట్టడుగు వర్గాల సమస్యలపై చిత్రాలు గీసి వాటి తీవ్రతను తెలియజేస్తున్నారు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన చింతలపల్లె కోటేశ్వరరావు. ఆయన కుంచె నుండి రూపుదాల్చుకున్న ప్రతీ చిత్రం సందే శాత్మకమే. అవి సామాన్యుడిని సైతం ఆలోచింపచేసి, సామాజిక బాధ్యతను గుర్తుచేస్తాయి. ప్రతీరోజూ కుంచెపట్టుకొని బొమ్మ గీయకపోతే ఏమీ తోచదు. ఇప్పటికీ కొన్ని వందలకు పైగా కళాఖండాలను గీశారు. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను అందుకున్నారు. కోట్లాది ప్రజల హృదయాల్లో కొలువైవున్న మహా నేత వైయస్ రాజశేఖరరెడ్డి అంటే కోటేశ్వరరావుకు ఎంతో అభిమానం. ఆయన ప్రవేశపెట్టిన పథకాల్లో లబ్ధిపొందిన వారిలో కోటేశ్వరరావు కూడా ఒకరు. ఆ మహానేత మర ణాంతరం రాష్ట్రం అల్లకల్లోలంగా మారిపోయింది. ఆయన లేరన్నది ఇప్పటికీ జీర్ణించుకోలేని వాస్తవంగా మిగిలింది. ఆ వాస్తవాన్ని తాను గీసిన కొన్ని చిత్రాల్లో చిత్రించారు కోటేశ్వరరావు. ‘‘ఆయనది రాజసం ఉట్టి పడే రూపం. ఒక్కసారి చూస్తే శాశ్వతంగా మనసులో ముద్రించికుపోయే చిత్రం’’ అంటున్న కోటేశ్వరరావు ఇప్పటికి 25కి పైగా వైయస్ చిత్రాలను గీశారు. ఆ చిత్రాలలో వైయస్ జీవనరేఖలు కనిపిస్తాయి. రాజసంతో ఉట్టి పడే తేజసు, ఆయన ప్రవేశపెట్టిన పథకాల చల్లని వెలుగు కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలో ‘అమ్మ ఆర్ట్ అకాడ మీ’ నిర్వహించిన పోటీల్లో కోటేశ్వరరావు గీసిన వైయస్ చిత్రాలకు జాతీయ చాంపియన్‌షిప్ అవార్డు దక్కింది. వైయస్ఆర్ వర్థంతి సందర్భంగా కోటేశ్వరరావు ఘటిస్తున్న చిత్రాంజలి ఇది. - నాగేష్