అమ్మా.. నన్ను అమ్మకే ..!
Published Thu, Dec 1 2016 2:28 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM
పోలీసుల ఆధ్వర్యంలో నేడు అవగాహన
సామాజిక బాధ్యతను తీసుకున్న ఖాకీలు
దేవరకొండ : దేవరకొండ ప్రాంతంలో వెలుగు చూస్తున్న శిశు విక్రయాల నిర్మూలనకు డీఎస్పీ జి. చంద్రమోహన్ ఓ కార్యక్రమాన్ని చేపట్టారు. శిశు విక్రయాలు, బ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, స్త్రీ రక్షణ చట్టాలు అనే అంశాలపై గురువారం దేవరకొండలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో వివిధ శాఖల అధికారులతో కలిసి ‘అమ్మా నన్ను అమ్మకే’ పేరిట అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. అయితే గతంలో ఇటువంటి అవగాహన సదస్సులను స్వచ్ఛంద సంస్థలు, ఐసీడీఎస్ అధికారులు, శిశు విక్రయాల నియంత్రణ కమిటీలు చేపట్టగా ఈ సారి మాత్రం పోలీసులు ఈ సామాజిక బాధ్యతను గుర్తించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోజు రోజుకూ ఎక్కువవుతున్న శిశు విక్రయాలను అరికట్టడానికి సంబంధిత శాఖ అధికారులు కూడా పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిరక్షరాస్యులకు అవగాహన కల్పించేందుకే..
దేవరకొండ డివిజన్ వ్యాప్తంగా నిరక్షరాస్యత, అధిక సంతానం, ఆర్థిక స్థోమత లేని కారణంగా ఆడపిల్లలను విక్రయిస్తున్నారు. ఈ పరిస్థితి దారుణం. ఇలాంటి పరిస్థితుల్లో నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘అమ్మా... నన్ను అమ్మకే’ అనే పేరుతో దేవరకొండ సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం కార్యక్రమం చేపట్టనున్నాం. ఈ కార్యక్రమానికి కలెక్టర్, ఎస్పీ, జెడ్పీ చైర్మన్, ఎమ్మెల్యేతో పాటు పలువురు ప్రముఖులు హాజరవుతున్నారు. ముఖ్యంగాా ఈ సమస్య దేవరకొండ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇక్కడే చేపట్టాలనుకున్నాం. ఈ అవగాహన సదస్సులు దశలవారీగా మండలాలు, గ్రామాల్లో కూడా చేపట్టడానికి ప్లాన్ తయారు చేస్తున్నాం.
- చంద్రమోహన్, దేవరకొండ డీఎస్పీ
Advertisement