అశ్రునయనాలతో అంతిమయాత్ర | Funeral Completed Telangana Siblings Killed In US Fire | Sakshi
Sakshi News home page

అశ్రునయనాలతో అంతిమయాత్ర

Published Sun, Jan 20 2019 2:24 PM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

Funeral Completed Telangana Siblings Killed In US Fire  - Sakshi

ముగ్గురు విద్యార్థులకు కుటుంబ సభ్యులు, సమీప గ్రామాల ప్రజలు, క్రిస్టియన్‌ మత పెద్దలు, పలువురు ప్రముఖులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్‌నాయక్, సుజాత పిల్లలు సాత్విక(18) జై సుచిత(14) సుహాస్‌నాయక్‌(16) అమెరికాలోని టెన్నిస్‌ రాష్ట్రం కొలిరివిల్లేలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి వారి మృతదేహాలు గుర్రపుతండాకు చేరుకోగా, శనివారం క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. 

చందంపేట (దేవరకొండ) : డిసెంబరులో అమెరికాలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో మృతిచెందిన విద్యార్థుల మృతదేహాలు శనివారం స్వగ్రామం చేరాయి. నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన పాస్టర్, అలైఖ్య బంజార ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల కుమార్తెలు సాత్విక(18) జై సుచిత(14) కుమారుడు సుహాస్‌నాయక్‌(16) అమెరికాలోని టెన్నిస్‌ రాష్ట్రం కొలిరివిల్లేలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. సుమారు 25 రోజుల పాటు  అక్కడే ఉండడంతో సొంత గ్రామమైన గుర్రపుతండాకు  తీసుకురావాలని గ్రామస్తులు కోరారు. దీంతో శుక్రవారం రాత్రి స్వగ్రామానికి మూడు ప్రత్యేక అంబులెన్స్‌లలో చిన్నారుల మృతదేహాలు తరలించారు. శనివారం గుర్రపుతండాలోని అలేఖ్య బంజార పాఠశాలలో పెద్ద సంఖ్యలో జనం రావడంతో అక్కడ ఏర్పాటు చేసిన భూస్థాపన ఆరాధన కార్యక్రమంలో క్రిస్టియన్‌ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించారు.

 ఒకే కుటుం బానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు క్రిస్టియన్‌ మతపెద్దలు, క్రైస్తవ సోదరులు, ప్రముఖులు, స్నేహితులు హాజరై శ్రీని వాస్‌ కుటుంబాన్ని పరామర్శించారు. ముగ్గురు చిన్నారులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో అక్కడున్న వారు కన్నీ రు పెట్టుకున్నారు. అనంతరం శ్రీనివాస్‌నాయక్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ముగ్గురి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీనివాస్‌ కుటుంబాన్ని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్, బి ల్యానాయక్, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వైస్‌ చైర్మన్‌ శంకర్‌లుకి, బిఎండబ్ల్యూవో వెంకటేశ్వర్లు, ఆర్డీఓ లింగ్యానాయక్, ఫ్రెండ్‌ క్యాంపస్‌ అకాడమి ప్రెసిడెంట్‌ అస్టోబిట్, హుమేల్, ఎలెక్స్‌ కోబర్ట్, మేరిమిహోలో, కొబిలి కిల్‌ హాజరయ్యారు. 

అండగా ఉంటా : ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు
నా చిన్ననాటి నుంచి శ్రీనివాస్‌నాయక్‌ మంచిమిత్రుడు. వీరికుటుంబం చాలా మంచిది. ముగ్గురు చిన్నారులను కోల్పోవడం చాలా బాధగా ఉంది. నాతో కూడా ఎప్పుడు ఫోన్‌ చేసి ముగ్గురు చిన్నారులు మాట్లాడే వారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరఫున సానుభూతి వ్యక్తం చేస్తున్నా. 

ప్రభుత్వం తరఫున ఆదుకుంటాం : రవీంద్రకుమార్‌ 
అలైఖ్య బంజార సంస్థను స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు విద్యను చెబుతున్న శ్రీనివాస్, సుజాత దంపతుల ము గ్గురు చిన్నారులు ఉన్నత చదువులకు వెళ్లి మృతిచెందడం చాలా బాధాకరం. నా,  ప్రభుత్వం తరఫున  ఆ కుటుంబానికి  అందుబాటులో ఉంటా. 

కుటుంబానికి ప్రభుత్వ అండ : ఎంపీ
గుర్రపుతండాకు చెందిన శ్రీనివాస్, సుజాత దంపతుల ముగ్గురు చిన్నారులు చనిపోవడం బాధాకరం. ఇంత మంది ప్రజలు రావడం చూస్తే శ్రీనివాస్‌నాయక్‌పై ఉన్న నమ్మకం ఏంటో తెలుస్తుంది. శ్రీనివాస్‌ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడుతుంది. 

తోడుగా ఉంటాం : జెడ్పీచైర్మన్, బాలునాయక్‌   
నా చిన్నతనం నుంచి శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు తెలుసు. సొంత గ్రామం కోసం పాఠశాలను ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్న శ్రీనివాస్‌నాయక్‌ ముగ్గురు చిన్నారులు చనిపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం.

పాటతో కన్నీరుపెట్టిన తల్లి 
తనకున్న ముగ్గురు చిన్నారులు ఉన్నత చదువుల కోసం వెళ్లి అగ్ని ప్రమాదంలో మృతిచెందడంతో తల్లి సుజాత కన్నీరుమున్నీరైంది. ఎవరు నన్ను చెయ్యి విడిచినా... అనే పాటతో చిన్నారుల జ్ఞాపకాలను తల్లి నెమరువేసుకుంది. పాట పాడినంత సేపు అక్కడున్న జనం కన్నీరును  ఆపలేకపోయారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement