దొంగ దొరికాడు..!
దొంగ దొరికాడు..!
Published Tue, Jul 19 2016 11:50 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
దేవరకొండ
పది రోజుల క్రితం కొండమల్లేపల్లి ఆంధ్రా బ్యాంకు ఎదుట ఓ మహిళకు మాయమాటలు చెప్పి రూ.70వేలు దోచుకెళ్లిన ఘరానా దొంగ పోలీసులకు చిక్కాడు. అమాయక ప్రజలే లక్ష్యంగా ఎంచుకుని బ్యాంకుల ముందు రెక్కీ నిర్వహించి వారితో మాటలు కలిపి బ్యాంకు ఉద్యోగినంటూ సహాయం చేస్తానంటూ దోచుకెళ్లే దొంగను మంగళవారం పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు దేవరకొండ డీఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ చంద్రమోహన్ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా చాగల్లుకు చెందిన షేక్ నాగూర్ మీరావలిని పోలీసులు దొంగగా గుర్తించారు. దేవరకొండలోని విష్ణు కాంప్లెక్స్‌లో ఉన్న బ్యాంకుల ముందు మరో దొంగతనం చేయడానికి కాపుకాసిన నాగూర్ మీరావలిని అనుమానించి తమదైన శైలిలో పోలీసులు విచారించడంతో కొండమల్లేపల్లిలో బ్యాంకు దొంగతానికి పాల్పడింది తానేనని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా నాగూర్‌వలీ అభిరామ్, అభి, బాబ్జి అనే వివిధ రకాల పేర్లతో గతంలో వివిధ బ్యాంకుల సమీపంలో డబ్బు కాజేసిన కేసుల్లో నిందితుడు. ఇతనిపై గణపవరం, చేబ్రోలు, విజయనగరం, గుడివాడతో పాటు నల్లగొండ జిల్లా చౌటుప్పల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్‌లలో కూడా బ్యాంకు దొంగతనం కేసులున్నాయి. షేక్ నాగూర్‌మీరావలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుండి లక్షా 13వేలతో పాటు నానో కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన ఐడీ పార్టి సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో సీఐ గట్టుమల్లు, ఎస్‌ఐలు ఖలీల్‌ఖాన్, సర్ధార్, సిబ్బంది రామారావు, నర్సింహ్మారావు, మేగ్యానాయక్, సింహాద్రి తదితరులున్నారు.
Advertisement